
Eetala: హోరాహోరీగా సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ ఘనవిజయం సాధించారు. అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. రాజేందర్ ను పడగొట్టలేకపోయింది. అయితే.. గెలుపు సంతోషం ఈటలకు దూరం చేసే సంఘటన తెరమీదకు వచ్చింది. ఆయనపై గతంలో వచ్చిన భూముల అక్రమాల కేసు మరోసారి లైన్లోకి వచ్చింది. ఈ విషయంలో నోటీలుసు కూడా జారీ అయ్యాయి.
మెదక్ జిల్లాలోని జమునా హ్యచరీస్ భూముల విషయం అప్పట్లో ఎంత హాట్ టాపిక్ అయ్యిందో తెలిసిందే. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం కేటాయించిన భూములను అక్రమంగా సొంతం చేసుకున్నారనే ఆరోపణలు సంచలనం రేకెత్తించాయి. ఈ ఆరోపణలతోనే ఈటలను కేబినెట్ నుంచి బరరఫ్ చేశారు సీఎం.
జూలై చివరి వారంలో ఈ భూముల వ్యవహారంపై రెండు రోజుల్లోనే కలెక్టర్‌తో విచారణ జరిపించి.. నివేదిక తెప్పించి ఈటలను పంపించారు. ఈ నివేదికపై ఈటల కుటుంబం హైకోర్టులో పిటిషన్ వేసింది. అయితే.. నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వలేదని, మెదక్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది. నోటీసులు సరైన ఫార్మాట్ లో ఇచ్చి విచారణ జరపాలని ఆదేశించింది.
ఆ తర్వాత ఈటల గులాబీ పార్టీ నుంచి బయటకు వెళ్లడం.. బీజేపీలో చేరడం.. ఉప ఎన్నికలో మునిగిపోవడంతో ఈ విషయం అందరూ మరిచిపోయారు. అయితే.. హుజూరాబాద్ ఫలితం వచ్చిన తర్వాత ఇప్పుడు మరోసారి ఈ భూమూల అంశం చర్చకు వచ్చింది.
జమునా హ్యాచరీస్ భూముల విషయమై మరోసారి ఈటల రాజేందర్ ఫ్యామిలీకి నోటీసులు జారీ అయ్యాయి. ఈ భూములను సర్వే చేస్తామని, 18వ తేదీన రావాలని ఈటల సతీమణి, కుమారుడికి ఆర్డీవో నోటీసులు జారీ చేశారు. దీంతో.. ఏం జరగబోతోందనే చర్చ సాగుతోంది. మరి, ఈటల ఈ అంశాన్ని ఎలా ఎదుర్కొంటారు? ఆరోపణల నుంచి ఎలా బయటపడతారు? అన్నది చూడాలి.