Homeజాతీయ వార్తలుKarnataka: లక్షల క్యూసెక్కుల నీరు వృధా.. అప్పుడే తుంగభద్ర కు ఎదురైన ఉపద్రవం పరిష్కారమయ్యేది..

Karnataka: లక్షల క్యూసెక్కుల నీరు వృధా.. అప్పుడే తుంగభద్ర కు ఎదురైన ఉపద్రవం పరిష్కారమయ్యేది..

Karnataka: తుంగభద్ర.. ఆంధ్రప్రదేశ్ – కర్ణాటక రాష్ట్రాలకు వరప్రదాయిని. అలాంటి ఈ జలాశయం ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో పడింది. అకస్మాత్తుగా ముంచుకొచ్చిన ఉపద్రవంతో ఉక్కిరి బిక్కిరవుతోంది. నీరు మొత్తం వృధాగా పోతున్న నేపథ్యంలో మరమ్మతులు మొదలయ్యాయి.. వరద ఒక్కసారిగా రావడంతో తుంగభద్ర డ్యామ్ లోని ఒక గేట్ పుల్లింగ్ చైన్ తెగిపోయింది. 19వ నెంబర్ గేటు కొట్టుకుపోయింది. ఫలితంగా 75 వేల క్యూసెక్కుల నీరు వృధాగా దిగువకు వెళ్తోంది. ఇదే విధంగా వెళ్తే దాదాపు 9 టీఎంసీల నీరు వృధా అయినట్టే.

కొట్టుకుపోయిన 19వ గేటు పై పూర్తిస్థాయిలో భారం పడకుండా ఉండేందుకు… డ్యాం అధికారులు మరో ఏడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 19వ గేటు సహా మిగతా ఎనిమిది గేట్ల నుంచి లక్ష క్యూసెక్కుల నీరు దిగువకు వృధాగా వెళ్తోంది. ఇప్పటికే నిపుణుల బృందం డ్యాం ను పరిశీలించింది. ఇనుప షీట్ల ద్వారా నీటి వృధాను అరికట్టేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రోజుకు 9 టీఎంసీల నీరు చొప్పున 60 టీఎంసీల నీటిని ఖాళీ చేయాలని అధికారులు ఇప్పటికే నిర్ణయించారు. ఆ నీటిని మొత్తం ఖాళీ చేసిన తర్వాత కొత్త గేటు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ డ్యాం నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 35 శాతం వాటా ఉంది. గత ప్రభుత్వం ఒక రూపాయి కూడా విడుదల చేయలేదు. ప్రస్తుతం విడుదల చేస్తున్న నీటితో సుంకేసుల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గేటుకు మరమ్మతులు కొనసాగే వరకు సుంకేసులకు వరద నీరు వస్తుందని అధికారులు అంటున్నారు.

ఈ ఘటన నేపథ్యంలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు డ్యాం ను పరిశీలించారు. డ్యామ్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పటికీ ఇలా జరగడంపై వారు విస్మయం వ్యక్తం చేశారు. ఇక ఈ డ్యాంలో నీరు ఆధారంగా కర్ణాటకలోని బళ్ళారి, రాయచూర్, కొప్పల, గదగ్, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలలో లక్షలాది ఎకరాల భూమి సాగు ఆధారపడి ఉంది.

నీరు వృధాగా పోతున్న నేపథ్యంలో ఈ జిల్లాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..” ఈ సంవత్సరం విస్తారంగా వర్షాలు కురిసాయి. డ్యాంలోకి సమృద్ధిగా నీరు చేరింది. పంటలు బాగా పండుతాయి అని భావించాం. వరి నారుమళ్ళు కూడా పోశాం. ఈ తరుణంలోనే ఈ ఘటన జరిగింది. మీరు మొత్తం వృధాగా పోతుంటే గుండె తరుక్కుపోతుంది. డ్యాం అధికారులు మరమ్మతులు వెంటనే చేపట్టాలి. నీటిని వృధాగా వెళ్లకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అప్పుడే మాకు లాభం జరుగుతుంది. లేకుంటే ఈ ఏడాది కూడా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని” ఆయకట్టు రైతులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version