Lagadapati Rajagopal: షర్మిల వెనుక లగడపాటి?

2004, 2009 ఎన్నికల్లో విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన లగడపాటి రాజగోపాల్ విజయం సాధించారు. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించడంతో హర్ట్ అయ్యారు.

Written By: Dharma, Updated On : January 9, 2024 8:56 am

Lagadapati Rajagopal

Follow us on

Lagadapati Rajagopal: లగడపాటి రాజగోపాల్ పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వనున్నారా? మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా? క్రియాశీలక రాజకీయాలు నడపనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్ర విభజనతో 2014లో రాజకీయ సన్యాసం ప్రకటించారు. గత పది సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

2004, 2009 ఎన్నికల్లో విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన లగడపాటి రాజగోపాల్ విజయం సాధించారు. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించడంతో హర్ట్ అయ్యారు. ఆ పార్టీకి దూరమయ్యారు. ఏ పార్టీలో చేరలేదు. గత ఎన్నికల్లో టిడిపికి మద్దతుగా మాట్లాడారు. ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేస్తారని కూడా ప్రచారం సాగింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన టిడిపిలో చేరరని తెలుస్తోంది. మళ్లీ కాంగ్రెస్ లో చేరతారని.. సమన్వయ బాధ్యతలు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.

త్వరలో పిసిసి పగ్గాలు షర్మిలకు అప్పగించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ హై కమాండ్ లగడపాటి రాజగోపాల్ కు కీలక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. షర్మిల వెంట ఉంటూ సమన్వయ బాధ్యతలు చూడాలని సూచించినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో పని చేసిన సీనియర్లతో రాజగోపాల్ సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల రాజమండ్రి వచ్చిన ఆయన మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్ష కుమార్ తో ప్రత్యేకంగా సమావేశం కావడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.

పూర్వాశ్రమంలో కాంగ్రెస్ పార్టీలో పని చేసిన చాలామంది నాయకులు సైలెంట్ గా ఉన్నారు. అటువంటి వారిని పార్టీలోకి రప్పించి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించేందుకు లగడపాటి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కానీ అటువంటిదేమీ లేదని లగడపాటి అనుచరులు చెబుతున్నారు. ఇప్పటికే వైసీపీ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం లేదు. దీంతో వారంతా రాజీనామా బాట పడుతున్నారు. మరి కొందరు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. అటువంటి వారందరినీ కాంగ్రెస్ లో చేర్చే ఆపరేషన్ బాధ్యతలు లగడపాటి రాజగోపాల్ చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కొద్దిరోజులు పోతే కానీ దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.