ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉన్న కర్నూల్ ఇప్పుడు కరోనా ఉధృతిలో సహితం దేశంలో రికార్డు నెలకొల్పుతున్నది. ఈ వైరస్ దేశంలో ఉధృతంగా ఉన్న 15 జిల్లాల్లో కర్నూల్ 14వ స్థానంలో ఉండడం గమనార్హం. ఏపీలో వస్తున్న కరోనా కేసులలో నాలుగోవంతు ఈ జిల్లా నుండే వస్తున్నాయి. ఇక ఏపీలో కరోనా సంబంధిత మరణాలలో 29 శాతం ఈ జిల్లాకు చెందినవే కావడం గమనార్హం.
రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నాటికి మొత్తం 1,332 కేసులు నమోదు కాగా, వాటిలో 343 కేసులు కర్నూలు జిల్లాకు చెందినవే. అంటే మొత్తం బాధితుల్లో 25 శాతం మంది కర్నూలు జిల్లాకు చెందినవారే.
స్టార్ హీరో రిషి కపూర్ ఆకస్మిక మృతి
రాష్ట్రంలో మొత్తం 31 మంది కరోనాతో మరణించగా, వారిలో కర్నూలు జిల్లాకు చెందిన వారు తొమ్మిది మంది ఉన్నారు. రాష్ట్రంలో నమోదైన మరణాల్లో 29 శాతం ఒక్క కర్నూలు జిల్లాకు చెందినవే.
జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్‌ల సంఖ్య 343కు చేరుకుంది. కర్నూలు నగరంలోనే 198 కేసులు నమోదు అయ్యాయి. నంద్యాలలో 74 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలోని బాధితుల్లో ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు వందమందికిపైగా ఉన్నారు.
కరోనా బారిన పడిన వారిలో కర్నూలు జిజిహెచ్‌కు చెందిన ఒక ఎనస్థీషియన్, ఒక గైనకాలజిస్టు ఉన్నారు. ఎనస్థీషియన్‌కు వైద్యం చేయడానికి ఆస్పత్రిలోని తోటి డాక్టర్లు సైతం ముందుకు రాకపోవడంతో నెల్లూరు నుంచి వైద్యులు రప్పించాల్సి వచ్చింది. వైద్యులే ఈ వైరస్ చూసి భయపడుతూ ఉండడం గమనిస్తే పరిస్థితులు ఎంత ఆందోళనకరంగా ఉన్నాయో అర్ధం అవుతుంది.
ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి
రాష్ట్రంలో తొలికేసు నమోదైన 24 రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 21న కర్నూలులోని జిజిహెచ్‌ని రాష్ట్ర స్థాయి కోవిడ్ ఆస్పత్రిగా ప్రభుత్వం మార్చింది. జిల్లాలో కేసులు అమాంతం పెరిగిపోవడానికి ప్రభుత్వం ముందుగా మేల్కొకపోవడమే కారణమని విమర్శలు చెలరేగుతున్నాయి.
రాష్ట్రంలో గత నెల 12న నెల్లూరులో తొలి కరోనా కేసు నమోదైంది. అదే నెల 28న కర్నూలు జిల్లాలోని సంజామల మండలం నొస్సంలో ఉద్యోగం చేస్తున్న రాజస్థాన్ వాసికి కరోనా నిర్ధారణ అయింది. జిల్లాలో తొలి పాజిటివ్ కేసు ఇదే. ఆ తర్వాత ఏప్రిల్ నాలుగున మరో మూడు కేసులు నమోదయ్యాయి. ఆ మరుసటి రోజు ఒకేసారి 52 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో, కేసుల సంఖ్య 56కు పెరిగిపోయింది.
కర్నూలు నగరంలోని ప్రయివేటు అల్లోపతి వైద్యుడు ఈ నెల 13న కరోనాతో మృతి చెందాడు. ఆయన కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరే ముందు రోజైన ఈ నెల 11 వరకూ తన ఆస్పత్రిలో రోగులకు చికిత్స అందించారు.
ఈ ఆసుపత్రి ద్వారానే కర్నూల్ పరిసర ప్రాంతాలలోనే కాకుండా, పొరుగున ఉన్న తెలంగాణ గ్రామాలలో సహితం వైరస్ వ్యాప్తికి కారణమైన్నట్లు భావిస్తున్నారు. అందుకనే తెలంగాణ ప్రభుత్వం కర్నూల్ సరిహద్దును మూసివేసింది.
పేరు మోసిన ఆస్పత్రి కావడంతో నగరంలోని పలు ప్రాంతాలతోపాటు తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు చెందిన రోగులు చికిత్స కోసం ఆయన ఆస్పత్రికే వచ్చారు. డాక్టర్ మృతితో ఆ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం బహిరంగ ప్రకటన జారీ చేయవలసి వచ్చింది.
ఆ ఆస్పత్రి ప్రాంతం అంతకు ముందే రెడ్‌జోన్ ప్రాంతంలో ఉన్నా, ఈ ప్రాంతంలోని ప్రయివేటు ఆస్పత్రుల్లో ఒపిలు చూడకూడదని ప్రభుత్వం ఉత్తర్వులున్నా, అక్కడ వైద్యం జరుగుతున్నా అధికారులు ఎందుకు గుర్తించలేకపోయారన్న ప్రశ్న తలెత్తుతోంది. స్థానికంగా గల అధికార పార్టీకి చెందిన ఎమ్యెల్యే వత్తిడి కారణంగానే అధికారులు ఉదాసీనంగా వ్యవహరించవలసి వచ్చిన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
కర్నూలు ఎంపి డాక్టర్ సంజీవ్‌కుమార్ కుటుంబ సభుల్లో ఆరుగురికి కరోనా సోకింది. వారిలో నలుగురు డాక్టర్లు కూడా ఉన్నారు. మరోవైపు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఉధృతమవుతున్నా టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటులో జాప్యం జరిగింది. ఆలస్యంగా కర్నూలు జిజిహెచ్‌లో ఈ నెల 23న స్వాబ్ విధానంలో పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. అప్పటికే జిల్లాలో 234 కేసులు నమోదయ్యాయి.