
నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి నేటి సీఎం వైఎస్ జగన్ వరకు ఎందరో ప్రత్యర్థి సీఎంలు ఎంత వెతికినా దొరకకుండా తప్పించుకుంటున్న మేధావి మన టీడీపీ అధినేత చంద్రబాబు అని కథలు కథలుగా చెబుతారు. ఒక్క కేసీఆర్ ముందు మాత్రం చంద్రబాబు పప్పులు ఉడకలేదు. ‘ఓటుకు నోటు’లో బాబు గారు దొరికిపోయారనే ప్రచారం సాగింది. ఆ ఒక్కటి తప్పితే చంద్రబాబుపై కేసులు లేవు.. ఆయన దోషిగా తేలిన సందర్భాలు లేవు. పాలనలో అంత తెలివిగా తన చేతికి మట్టి అంటకుండా చంద్రబాబు వ్యవహరిస్తాడని.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం అదని రాజకీయాల్లో గొప్పగా చెబుతారు. కానీ ఎట్టకేలకు ఓ కేసులో చంద్రబాబుకు కష్టాలు ఎదురయ్యేలా ఉన్నాయి. కుప్పంలో తవ్వకాలు చేపడుతున్న వైసీపీ వలలో ప్రస్తుతానికి చంద్రబాబు పీఏ దొరికాడట.. ఇప్పుడు ఆయనను బేస్ చేసుకొని చంద్రబాబు మెడకు చుట్టాలనే ప్రయత్నాలు జోరుగానే సాగుతున్నాయనే ప్రచారం మొదలైంది.
*బాబు పీఏ అడ్డంగా బుక్కయ్యాడా?
ఏపీ మాజీ సీఎం.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పీఏ బ్యాంకు స్కామ్ కు పాల్పడ్డారంటూ ఆయనపై కుప్పం పోలీస్ స్టేషన్ లో తాజాగా కేసు నమోదైంది. వైసీపీ కార్యకర్తల ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేశారు. ఇది ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది. చంద్రబాబును బుక్ చేసేందుకు రంగం సిద్ధమైందనే ప్రచారం మొదలైంది. కుప్పం కోఆపరేటివ్ టౌన్ బ్యాంకులో ఈ స్కామ్ జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ స్కామ్ లో చంద్రబాబు సొంత పీఏ మనోహర్ ప్రమేయం ఉందని వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు.
*స్కాం ఏంటి?
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.192 కోట్ల స్కాం బ్యాంకులో జరిగినట్టు కుప్పం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఉపేంద్రకుమార్ తెలిపారు. గత నెల మార్చిలో జరిగిన ఆడిట్ లో ఈ మొత్తం స్కామ్ వెలుగుచూసినట్లు చైర్మన్ తెలిపారు. రూ.46.75 లక్షల 30 బంగారం ప్యాకెట్లు .. దీనిపై వడ్డీ రూ.38.44 లక్షలు ఉందని వివరించారు. దీంతో పాటు నగదు కలిపి 192కోట్ల స్కాం జరిగినట్టు గుర్తించామన్నారు ఈ బ్యాంకులో శ్రీనివాసులు అనే వ్యక్తి చంద్రబాబు పీఏ మనోహర్ రికమండేషన్ మేరకు వచ్చి 16 ఆలయ బాండ్లను పెట్టి ఈ డబ్బులు తీసుకెళ్లాడని ఈ బ్యాంకు మేనేజర్ వీఎస్వీ నవీన్ బాబు తెలిపారు. ఇదంతా టీడీపీ హయాంలోనే జరిగినట్టు వివరించారు. దీంతో చంద్రబాబు పీఏపై ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
*బాబును ఇరికిస్తాడా?
వైఎస్ నాడు ఎంతో ప్రయత్నించారు. చంద్రబాబు లూప్ హోల్స్ అన్నీ వెతికారు. కానీ ఒక్క కేసుల్లోనూ బాబును ఇరికించిలేకపోయారనే ప్రచారం ఉంది. కానీ ఇప్పుడు జగన్ కు అంతకుమించిన కోపం ఉంది. చంద్రబాబు వల్లేనే ఆయన జైలు పాలయ్యారనే అపవాదు.. రాజకీయ శతృత్వం పీకలదాకా ఉంది. అందుకే వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరేడు నెలలుగా చంద్రబాబు పాలనలోని బొక్కలన్నీ వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నా బాబు గారు మాత్రం తన చేతికి మట్టి అంటకుండా అన్నీ చక్కదిద్దేశారట.. సో ఇప్పుడు కుప్పం స్కారం దొరికింది.మరి దీన్ని అయినా చంద్రబాబు మెడకు చుడుతారా.? ప్రస్తుతానికి ఆయన పీఏ మనోహర్ దొరికేశాడు. తర్వాత నెక్ట్స్ ఏంటనేది ఆసక్తిగా మారింది.
*కుప్పంలో బాబుకు చెక్ పెట్టేందుకేనా?
కుప్పంలో చంద్రబాబుకు, టీడీపీకీ చెక్ పెట్టేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా వెళుతోంది. చంద్రబాబు ఎలాగూ రాష్ట్రానికి చివరన ఉండే ఆ కుప్పం నియోజకవర్గానికి వెళ్లడం లేదు. ఆయన ఎమ్మెల్యే కావడంతో ఆయన వ్యవహారాలన్నీ బాబు పీఏ మనోహర్ చూస్తుంటాడు. బాబు తర్వాత అన్నీ ఈయనే. అంతటి కీలక వ్యక్తి అక్కడ వైసీపీని తట్టుకొని నిలబడుతున్నాడు. ఇప్పుడు పీఏ మనోహర్ ను చాకచక్యంగా బుక్ చేసిన వైసీపీ చంద్రబాబుకు ఆ నియోజకవర్గంలో నూకలు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నట్టు ప్రచారం సాగుతోంది. మరి ఇదే జరిగితే రాజకీయంగానూ.. కేసుల పరంగానూ చంద్రబాబుకు పెద్ద దెబ్బే అనడంలో ఎలాంటి సందేహం లేదని పరిశీలకులు చెబుతున్నారు.
-నరేశ్ ఎన్నం