దేశం అంతా కరోనా వైరస్ ఉద్రుతిగా ఉన్న సమయంలో, లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి, పాటించకుండా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు, సినీ నటుడు నిఖిల్ వివాహం జరపడం దుమారం రేపింది.
మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు, జేడీఎస్ అధినేత కుమారస్వామి తనయుడైన హీరో నిఖిల్ వివాహం బెంగళూరులో రంగరంగ వైభోగంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి క్రిష్ణప్ప మనవరాలు రేవతి పెళ్లికుమార్తె. రామ్‌నగర్ కేతగానహళ్లిలోని ఫాం హౌస్‌లో జరిగిన ఈ వివాహానికి దేవెగౌడ కుటుంబసభ్యులు, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు, అత్యంత సన్నిహితులు సుమారు 200 మంది హాజరయ్యారు.
ఈ సందడిలో సామాజిక దూరం అనే నిబంధన, దాంతోపాటే ముఖానికి వేసుకోవాల్సిన మాస్కులు ఎక్కడో గాలికి కొట్టుకుపోయాయి. బెంగళూరుకు 28 కిలోమీటర్ల దూరంలోని బిదడీలోని ఓ ఫాంహౌస్‌లో ఈ పెళ్లి జరిగింది.
నిఖిల్ జాగ్వార్ సినిమాలో హీరోగా నటించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాండ్యా నియోజకవర్గం నుంచి జేడీఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఇండిపెండెంట్ అభ్యర్ధి, నటి సుమలత (కాంగ్రెస్ పార్టీ నేత, నటుడు అంబరీశ్ భార్య) చేతిలో రెండు లక్షల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.
పెళ్లిలో సామాజిక దూరం పాటించలేదనే ఆరోపణలు వచ్చాయి. సోషల్ డిస్టన్స్ పాటించలేదని చెబుతూ సోషల్ మీడియాలో అనేక వీడియోలు చక్కర్లు కొడుతుండటంతో యెడ్యూరప్ప ప్రభుత్వం రామ్‌నగర్ అధికారుల నుంచి నివేదిక కోరింది.
కరోనా వేళ లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో వివాహం జరపడంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అశ్వథ్ నారాయణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోకపోతే వ్యవస్థను వెక్కిరించినట్లౌతుందని స్పష్టం చేశారు.
తాము ఇప్పటికే రామ్‌నగర్ డిప్యూటీ కమిషనర్ నుంచి నివేదిక కోరామని చెప్పారు. జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడామని చెబుతూ చర్యలు తప్పవని అశ్వథ్ నారాయణ్ హెచ్చరించారు.