KTR: తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో అధికార బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారం మొదలు పెట్టింది. తాజాగా మేనిఫెస్టోను కూడా కేసీఆర్ విడుదల చేశారు. 2014, 2018 తరహాలోనే ఈసారి కూడా సంక్షేమ ఎజెండాతో ఓట్లు కొల్లగొట్టాలనుకుంటున్నారు. ఈ క్రమంలో ఎక్కువ మందిని ప్రభావితం చేసే కేసీఆర్ బీమా లాంటి ఫ్లాష్ స్కీం ప్రకటించారు. అయితే సర్వేలు మాత్రం హంగ్ అంటున్నాయి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అధికారం తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ మెజారిటీ రాకపోయినా అధికారంలోకి వస్తామంటోంది. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఆసక్తిగా మారింది.
కేసీఆరే ముఖ్యమంత్రని..
బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారంతో తమ ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ అని, విపక్షాలు ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తాయో ప్రకటించాలని కాంగ్రెస్, బీజేపీకి కేటీఆర్, హరీశ్‌రావు సవాల్ విసురుతున్నారు. అయితే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానంటున్న కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రికే పరిమితం చేయడం కూడా చర్చనీయాంశమైంది. జాతీయ రాజకీయాల్లో స్కోప్ లేదని కేసీఆర్‌తోపాటు, కేటీఆర్, హరీశ్‌రావుకు అర్థమైనట్లు కనిపిస్తోంది. అందుకే ఈసారి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ప్రకటిస్తున్నారు.
కేటీఆర్ పట్టాభిషేకం ఎప్పుడో..
ఇదిలా ఉంటే.. కేటీఆర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలిస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెబుతున్నారు. కదా.. ఐదేళ్లు ఉంటారా అని యాంకర్ కేటీఆర్‌ను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కేటీఆర్ వైనాట్.. అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకా డౌట్ అని ఎదురు ప్రశ్నించారు. దీనికి యాంకర్.. తర్వాత కేటీఆర్ వస్తారు కదా అని తెలిపారు. దీంతో కేటీఆర్.. ‘నేను ముఖ్యమంత్రి కావాంటే మోదీ పరిమిషన్ కావాలట కదా’ అని స్పందించారు. వాళ్లని అడిగి చెబుతాని ఎద్దేవా చేశారు. అయితే లోక్‌సభ ఎన్నికల తర్వాత కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లోకి వెళితే.. మీరు ముఖ్యమంత్రి కారా అని ప్రశ్నించారు..
చాలా మంది అర్హులు ఉన్నారట..
కేటీఆర్‌తోపాటు బీఆర్‌ఎస్‌లో ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉన్నవారు చాలా మంది ఉన్నారని కేటీఆర్ ప్రకటించారు. కేసీఆర్ మంచి విజన్ ఉన్న నేత అని, రాష్ట్రాన్ని బాగుచేసిన నేత దేశాన్ని కూడా బాగు చేయాలనుకుంటున్నారన్నారు. తాము బీఆర్‌ఎస్ కేంద్రంలో కీలక పాత్ర పోషించే అవకాశం వస్తే తప్పకుండా వెళ్తారని చెప్పారు. ఆయన కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు.. పార్టీ నేతలు ఏ నిర్ణయం తీసుకుంటే అది జరుగుతుందని స్పష్టం చేశారు.
అసమ్మతి ఉన్నట్లేనా..
అయితే కేటీఆర్ వ్యాఖ్యల్లో రెండు అర్థాలు వస్తున్నాయి. కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లోకి వెళితే.. అందరూ తనకే మద్దతు ఇస్తారని చెప్పకనే చెప్పారు. మరో కోణంలో చూస్తే.. ముఖ్యమంత్రి పదవి చేపట్టడం అంత ఈజీ కాదని కూడా చెప్పినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే కవిత, హరీశ్‌రావు దీనికి అంగీకరించరని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. అందుకే కేటీఆర్ చాకచక్యంగా పార్టీ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ముఖ్యమంత్రి ఎవరనేది చెబుతా అని స్పష్టం చేశారు.