
మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆకస్మికంగా పర్యటించారు. వేములవాడలోని కంటోన్మెంట్ ప్రాంతంతోపాటు ముస్తాబాద్ మండలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ముస్తాబాద్ మండలంలోని గూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పరిశీలించి మాట్లాడారు.
వేములవాడలో 21ఏళ్ల యువకుడికి పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా యువకుడితో సన్నహితంగా ఉన్న 21మందిని క్వారంటైన్లో ఉంచినట్లు తెలిపారు. కరోనా కట్టడికి ఫార్మూలా ఏమిలేదని.. అది సోకకుండా చూసుకోవడమే మందు అని ఆయన సూచించారు. రాష్ట్రంలో కరోనా కోసం ఎనిమిది ప్రత్యేక ఆస్పత్రులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో మర్కజ్ సంఘటన లేకపోయి ఉంటే జిల్లాల్లో ఒక్క కేసు కూడా ఉండేది కాదని ఆయన అన్నారు. వలస కార్మికుల కోసం హైదరాబాద్‌లో 55శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే గ్రామాలు, పట్టణాల్లో ప్రతిఒక్కరి ఆరోగ్య వివరాలను అధికారులు సేకరిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
లాక్డౌన్ కారణంగా రైతులు అధైర్య పడొడ్డన్నారు. రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే బేషరతుగా కొనుగోలు చేస్తుందని భరోసా కల్పించారు. ప్రభుత్వం సూచించిన విధంగానే రైతులు దిగుబడులను కొనుగోలు కేంద్రాలను తీసుకురావాలని సూచించారు. రైతులు సామాజిక దూరం పాటించాలని కోరారు. రైతులు డబ్బులను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుందన్నారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు తెల్లరేషన్ కార్డు కలిగిన వారందరికీ రూ.1,500లను వారి జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే ఈ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు.