
తెలంగాణ ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్.. యంగ్ అండ్ డైనమిక్ పొలిటీషియన్. కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ట్విట్టర్‌లో తన దృష్టికి వచ్చే సమస్యలపై వెంటనే స్పందిస్తుంటారు. అవసరం ఉన్నవారికి సాయం చేస్తుంటారు. ఎప్పుడూ సీరియస్ విషయాలే కాదు… నెటిజన్లతో అప్పుడప్పుడు సరదా విషయాలు కూడా మాట్లాడుతుంటారు. తాజాగా ట్విట్టర్ చిట్‌చాట్‌లో పలువురు నెటిజన్లు కేటీఆర్‌కు సరదా ప్రశ్నలు వేశారు.
దానికి ఆయన కూడా అంతే ఫన్నీగా బదులిచ్చారు. అలాగే పలు సీరియస్ ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలిచ్చారు. కేటీఆర్ యంగ్ లుక్‌లో ఉన్న ఫొటోను షేర్ చేసిన ఓ నెటిజన్… ‘సర్.. మీరు హీరోలా ఉన్నారు… ఎప్పుడూ బాలీవుడ్,హాలీవుడ్ సినిమాల్లో ప్రయత్నించలేదా…?’ అని ప్రశ్నించారు. దానికి కేటీఆర్… ‘బాలీవుడ్,హాలీవుడ్… మరీ పెద్ద చెట్టు ఎక్కిస్తున్నావ్…’ అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చారు. స్మైల్ ఎమోజీని దానికి జతచేశారు.
ఇక ఇదే చిట్‌చాట్‌లో ఓ నెటిజన్ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లపై ప్రశ్నించాడు. అన్నా.. తెలంగాణలో ప్రభుత్వ పథకాలన్నీ బాగున్నాయి… కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్..? అని ప్రశ్నించాడు. దానికి కేటీఆర్ ‘తప్పకుండా నాయక్..’ అని అతనికి బదులిచ్చారు. సాగర్ ఉపఎన్నిక తర్వాత నోటిఫికేషన్లు ఆశించవచ్చా అని మరో నెటిజన్ అని అడిగిన ప్రశ్నకు కూడా ‘తప్పకుండా…’ అని బదులిచ్చారు. బెంగాల్,కేరళలో ఎవరు గెలుస్తారని మరో నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. ‘ప్రజాస్వామ్యం గెలుస్తుంది’ అని చెప్పుకొచ్చారు. మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు… ఇంకా లేదని బదులిచ్చారు. సాగర్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో అక్కడ టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని మరో ప్రశ్నకు బదులిచ్చారు. నిజామాబాద్ రైతుల కల అయిన పసుపు బోర్డు ఎప్పుడు వస్తుందని ఓ నెటిజన్ ప్రశ్నించగా… పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్‌పై రాసి మరీ వాగ్దానం చేసిన జెంటిల్‌మన్‌ను అడగండి అని చెప్పారు.
కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 1,530 మంది వైద్యుల ఉద్యోగ భద్రత విషయాన్ని ఆరోగ్య మంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. హైదరాబాద్‌లో 50కి పైగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం జరుగుతుందని… ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులకు రూ.2వేల కోట్లు కేటాయించామని చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. అలాగే తనకు నచ్చిన క్రికెటర్ ఒకప్పుడు రాహుల్ ద్రవిడ్… ఇప్పుడు విరాట్ కోహ్లి అని చెప్పారు. జాతి రత్నాలు సినిమా బాగుందని… హాస్యభరితంగా ఉందని చెప్పుకొచ్చారు.