
జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్నికల హడావుడి మొదలైంది. త్వరలోనే ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ పరిధిలో 99సీట్లు కైవసం చేసుకొని సత్తా చాటింది. మంత్రి కేటీఆర్ నాయకత్వంలో నాడు జీహెచ్ఎంసీ ఎన్నికలకు కార్పొరేటర్లు వెళ్లి విజయఢంకా మోగించారు. తాజాగా మరోసారి సెంచరీ స్థానాలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. అందుకు తగ్గట్టుగానే మంత్రి కేటీఆర్ నగరంపై దృష్టిసారించారు.
ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచి టీఆర్ఎస్ ప్రచారంలో దూసుకెళుతోంది. కార్పొరేటర్లంతా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తున్నారు. ఇక మంత్రులు సైతం నగరంలో పర్యటిస్తూ టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. శంకుస్థాపనలు.. అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. టీఆర్ఎస్ ప్రచారం దూసుకెళుతుండగా ప్రతిపక్షాల్లో చాలా వెనుకబడినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మంగళవారం జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఎమ్మెల్సేలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నేతలందరికీ దిశానిర్దేశం చేశారు. కొందరు కార్పొరేటర్ల పని తీరు బాగోలేదని రిపోర్టులు వచ్చాయని.. వారు పనితీరు మార్చుకోకపోతే పక్కకు పెట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాలనీల్లో ఏవైనా సమస్యలుంటే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రభుత్వం పిలుపునిచ్చే అన్ని కార్యక్రమాల్లో కార్పొరేటర్లు విధిగా పాల్గొనాలని ఆదేశించారు.
టీఆర్ఎస్ హయాంలో నగరంలో చేపట్టిన అభిృవృద్ధి పనులను ప్రజలను వివరించాలని కేటీఆర్ సూచించారు. లక్షల కోట్ల పెట్టుబడులను హైదరాబాద్ కు తీసుకొచ్చామని.. గత ఐదేళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని అవన్నీ కూడా కార్పొరేటర్లు ప్రజలకు దృష్టికి తీసుకెళ్లాలన్నారు. కరోనా సమయంలో సంక్షేమ పథకాలు ఆగలేదని గుర్తు చేశారు. చేనేతల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. బతుకమ్మ చీరలను మహిళా సంఘాల ద్వారా అక్టోబర్ 9నుంచి పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. నవంబర్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో అధికార పార్టీ నేతలు ఇప్పటి నుంచే హడావుడి చేస్తున్నారు.