
ఐటీ మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా హరిత ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసి రెండ్రోజులు గడుస్తున్నా టీఆర్ఎస్ నేతలు మాత్రం నోరుమెదపడం లేదు. దీంతో కాంగ్రెస్ నేతలు కేటీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా జనవాడలో కేటీఆర్ ఫాంహౌజ్ ను అక్రమంగా నిర్మించుకున్నారని రేవంత్ రెడ్డి గతంలోనే ఫిర్యాదు చేశారు. 111 జీవోను ఉల్లంఘించి 25ఎకరాల్లో కేటీఆర్ విలాసవంతమైన భవనం నిర్మించుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ గ్రీన్ ట్రీబ్యునల్ ను ఆశ్రయించారు. దీనికి స్పందించిన ట్రీబ్యునల్ రెండ్రోజుల క్రితం కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఫౌంహౌజ్ ఇష్యూలో సక్రమంగా విచారణ జరుగాలంటే తక్షణమే కేటీఆర్ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.
కేటీఆర్ సతీమణి పేరిట 301, 302 సర్వే నెంబర్లలో భూమి ఉందని ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు. వట్టినాగులపల్లి నుంచి గండిపేటకు నీరు వచ్చే కాల్వను కేటీఆర్ ఫాంహౌస్ దారి కోసం పూడ్చివేశారని ఆరోపించారు. ఈ విషయంపై తాము గ్రీన్‌ట్రిబ్యునల్‌కు వెళ్లగా ఎనిమిది మంది అధికారులతో గ్రీన్ ట్రిబ్యునల్ కమిటీ వేసిందని వారు గుర్తు చేశారు.
ఈ ప్రాంతంలోనే అర్చనా వెంచర్స్‌కు భూమి ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులో కేటీఆర్‌కు వాటా ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో గతంలోనే కేటీఆర్ పేర్కొన్నారని తెలిపారు. తమ వద్ద తగిన ఆధారాలున్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కేటీఆర్ ఆ భూములను లీజులు తీసుకున్నట్లు చెబుతుండగా అందుకు సంబంధించి ఎన్నికల ఆఫిడవిట్ లో ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ అవినీతిపై పోరాడితే రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టారని తెలిపారు.
111 జీవోకు విరుద్ధంగా ఉన్నాయనని వేల ఇళ్లను కూల్చారని.. టీఆర్ఎస్ నేతల ఇళ్లను మాత్రం కూల్చలేదన్నారు. తక్షణమే ప్రభుత్వం 111 జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. మెయినాబాద్, శంకర్ పల్లి ప్రజలకో న్యాయం.. కేటీఆర్ కో న్యాయమా? అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ ను తక్షణమే క్యాబినెట్ నుంచి తప్పించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.