
రెండున్నర నెలల విరామం అనంతరం దేవాదాయ ధర్మాదాయ శాఖ రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో ప్రవేశానికి భక్తులకు అవకాశం కల్పించింది. ఈ మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావు శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. ఇందుకు ప్రత్యేకంగా నిబంధనలు స్పష్టం చేశారు. 12 పేజీలలో ఈ వివరాలు పేర్కొంటూ ఉత్తర్వులు విడుదల చేశారు. అన్ని దేవాలయాల్లో 8, 9 తేదీల్లో ఆలయ సిబ్బంది, స్థానికులతో ట్రయిల్ రన్ నిర్వహించనున్నారు.
10వ తేదీ నుంచి సాధారణ భక్తులను అనుమతించనున్నారు. ఇప్పుడు కరోనా కారణంగా భక్తులను సామాజిక దూరం పాటించడంతోపాటు మాస్క్ లు ధరించడం, మరికొన్ని ఇతర చర్యలు తీసుకోవాల్సి ఉంది, లేని పక్షంలో దేవాలయాల్లోకి అనుమతించారు. కరోనా సమయంలో కూడా ఆలయాలు అన్ని తెరిచే ఉంటాయి, యధావిధిగా నిత్య పూజలు కైంకర్యాలు జరిగాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఎంతో కాలంగా దేవాలయాలకు వెళ్లాలని వేచి చూస్తున్న భక్తుల కోరిక తీరనుంది.
మరోవైపు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ దేవాలయాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్న అనంతరం 10వ తేదీ నుంచి భక్తులను అనుమతిస్తున్నట్లు చెప్పారు. 10 నుంచి దర్శనాలకు అవకాశం ఇచ్చామని స్థానికంగా ఇబ్బందులు ఉంటే ఒకటి రెండు రోజులు ఏర్పాట్లు పూర్తి చేసి అధికారులు అవకాశం కల్పిస్తారని చెప్పారు.