KTR
KTR: తెలంగాణ ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. గత రెండు ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ను రగిలించిన బీఆర్ఎస్.. ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడుతోంది. గతంలో ఏపీ పాలకులు అంటూ సాగిన ప్రసంగాలు.. వారు కూడా మంచి పాలకులేనన్నట్టు మారిపోయాయి. అయితే ఇవన్నీ ఓట్ల కోసమేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి సీఎం కేసీఆర్ తో పాటు ఆయన మేనల్లుడు హరీష్ రావు ఆంధ్ర నాయకుల గురించి ఎలా మాట్లాడారు అందరికీ తెలిసిన విషయమే. గత రెండుసార్లు ఏపీ పాలకులపై ద్వేషం నింపడంలో సక్సెస్ అయ్యారు. దాని నుంచే గెలుపు మాటను అందుకున్నారు. అయితే ఈసారి దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా కేటీఆర్ సెటిలర్స్ తో పాటు ఏపీ పార్టీల ప్రాపకం కోసం ప్రయత్నిస్తుండడం విశేషం. ఇటీవల ఓ సమావేశంలో అయితే 25 ఏళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకుంటే తనకు ముగ్గురు సీఎంలే కనిపిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు, వైయస్ రాజశేఖర్ రెడ్డి, కెసిఆర్ లు మాత్రమే తమదైన ముద్ర వేయగలిగారని కేటీఆర్ వ్యాఖ్యానించడం విశేషం.
ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ఏపీ సెక్యులర్ రెండు పార్టీలను అభిమానిస్తున్నాయి. అధికార వైసిపి తో పాటు టిడిపి అభిమానులు గణనీయంగా తెలంగాణలో ఉన్నారు. ప్రస్తుతం ఆ రెండు పార్టీలు ఎన్నికల బరిలో లేవు. దీంతో ఆ రెండు పార్టీల కేడర్ను ఆకట్టుకునేందుకు కేటీఆర్ కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. అందుకే చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి పల్లవి అందుకున్నారు. వారిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.చంద్రబాబు వ్యాపార, ఐటీ రంగంతో పాటు పట్టణీకరణ అభివృద్ధిపై దృష్టి పెట్టారని.. వైయస్ రాజశేఖర్ రెడ్డి గ్రామీణ, వ్యవసాయ రంగం అభివృద్ధికి కృషి చేశారని.. పేదల పక్షపాతిగా ఇమేజ్ తెచ్చుకున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. కెసిఆర్ లో మాత్రం ఆ ఇద్దరి నేతల పోకడలు కనిపిస్తున్నాయని ఆకాశానికి ఎత్తేశారు.
అయితే ప్రస్తుతం కెసిఆర్ కుటుంబ వ్యవహార శైలి చూస్తుంటే.. వాత పెట్టగలరు.. వెన్న పూయగలరు అన్న చందంగా ఉంది. ఇదే ఏపీ నేతలపై విమర్శలు చేస్తూ సెంటిమెంటును రగిలించి తొలి రెండు ఎన్నికల్లో గెలుపొందారు. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతను సెటిలర్స్ తో పాటు ఆంధ్ర పార్టీల అభిమానంతో అధిగమించాలని చూస్తున్నారు. మొన్నటి వరకు సంక్షేమ పథకాలతో బిఆర్ఎస్ వైపు చూసిన సెటిలర్స్.. ఏపీలో మారిన రాజకీయ సమీకరణలతో కాంగ్రెస్ వైపు వెళ్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. మరి ఎన్నికల పోలింగ్ నాటికి పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి.