KTR: సీఎం కేసీఆర్ పుత్రుడు, మంత్రి కేటీఆర్ రాజకీయాల్లో చురుగ్గా ఉంటారు. మొన్నటి వరకు స్టేట్ పాలిటిక్స్‌పై దృష్టి పెట్టిన ఆయన, ఇటీవల జాతీయ స్థాయిలో రాజకీయంగా ఫోకస్ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. జాతీయ మీడియా ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాలు, అక్కడి అంశాలపైనే ప్రధానంగా దృష్టిసారిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల సమస్యలపై జాతీయ మీడియాలో ఇప్పటి వరకు వచ్చిన కథనాలు కూడా చాలా తక్కువే.
మంత్రి కేటీఆర్ ఢిల్లీ రాజకీయాల్లో ఫోకస్ కావాలంటే.. అక్కడి మీడియా దృష్టిలో పడాలి. అందుకు అక్కడి మీడియా ఏయే అంశాలను న్యూస్‌గా చూపిస్తుందో వాటిపై కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధతో దృష్టిసారిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఇటీవల కేటీఆర్ పంజాబ్‌కు చెందిన ఓ క్రీడాకారిణిని హైదరాబాద్‌కు పిలిచి ఆర్థిక సహాయం చేశారు.

పంజాబ్‌కు చెందిన చెస్ ప్లేయర్ మల్లికాహండా అక్కడి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాను దివ్యాంగురాలైనా.. ప్రతిభతో పతకాలు సాధిస్తే ఆదుకుంటామని హామీ ఇచ్చిన పంజాబ్ ప్రభుత్వం, తీరా తనను మోసం చేసిందని ఓ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇది మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. వెంటనే ఆమెకు మద్దతు తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు. అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు కేటీఆర్. ఆమెను ప్రత్యేకంగా హైదరాబాద్‌కు పిలిచి రూ.15 లక్షల ఆర్థిక సహాయం కూడా చేశారు. ఈ అంశం జాతీయ మీడియాలో హైలెట్ అయింది. అయితే తెలంగాణలో ప్రభుత్వ ఆదరణకు నోచుకోని క్రీడాకారులు కుప్పలు తెప్పలుగా ఉన్నారని.. తమను ఆదుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కేటీఆర్ ఆలోచనలు వేరన్న వాదనా వినిపిస్తుంది.
Also Read: ఐసీయూలో ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్.. ఆందోళనలో ఫ్యాన్స్..!
తాజాగా జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా మారిన మరో అంశంపై కేటీఆర్ స్పందించారు. కునాల్ కమ్రా, మునావర్ ఫారుఖీ అనే స్టాండప్ కమెడియన్లకు కేటీఆర్ మద్దతుగా నిలిచారు. దీంతో ఈ అంశం కూడా జాతీయ మీడియాలో ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. వీరి షోలను చాలా రాష్ట్రాల్లో నిషేధించారు. అయితే ఈ స్టాండప్ కమెడియన్లను షో చేసుకోవటానికి కేటీఆర్ హైదరాబాద్‌కు ఆహ్వానించారు. ఈ రెండు అంశాలు తెలంగాణకు ఎలాంటి సంబంధం లేనివి. అయితే జాతీయ స్థాయిలో ఫోకస్ కావడానికి కేటీఆర్ ఇలాంటి అంశాలపై స్పందిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాజకీయ నాయకులు సాధారణంగా ఏ కారణం లేకుండా ఏ పని చేయరు. మరీ కేటీఆర్ ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా పంజాబ్ ప్లేయర్‌కు రూ.15 లక్షల ఆర్థిక సహాయం చేశారా..?
Also Read: చంద్రబాబు ‘ప్రేమ’ ఆఫర్‌పై పవన్ కల్యాణ్ సైలెంట్ వెనుక కారణం అదే?