Case Against Kerala Woman: అబద్ధం ఊరు మొత్తం తిరిగేలోపు నిజం గడప దాటుతుంది అంటారు. కానీ, అబద్ధాల వల్ల చాలామంది జీవితాలు ప్రభావితం అవుతుంటాయి. ఊహించని విధంగా మారిపోతుంటాయి.. కొన్ని సందర్భాలలో జరగకూడని దారుణాలు చోటు చేసుకుంటాయి. అటువంటిదే ఈ సంఘటన కూడా.
ఆ వ్యక్తి పేరు దీపక్. కేరళ రాష్ట్రంలో ఓ వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఇటీవల అతడు కేరళ రాష్ట్రంలోని ప్రభుత్వం నడిపే బస్సులో ప్రయాణించాడు. ఆ సమయంలో బస్సులో సీట్ లేకపోవడంతో నిలబడి ప్రయాణించాడు. అతని ముందు ఒక యువతి ఉంది. ఆ యువతికి, అతనికి చాలా దూరమే ఉంది. అయినప్పటికీ ఆమె సెల్ఫీ వీడియో తీసుకొని.. తనను అతడు అసభ్యంగా తాకాడు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వాస్తవానికి ఆ వీడియోలో అతడు ఆమెను తాకుతున్నట్టుగాని.. ఇబ్బంది పెడుతున్నట్టు గాని కనిపించలేదు.
సోషల్ మీడియాలో ఆ వీడియో విస్తృతంగా కనిపించడంతో దీపక్ అవమానానికి గురయ్యాడు. అసలే సున్నిత మనస్కుడైన దీపక్ తన గదిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో అతడు నివసించే గోవిందాపురం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. దీపక్ వ్యవహారం కేరళ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా.. మర్యాదపూర్వకంగా వ్యవహరించే దీపక్ మీద ఆ యువతి ఆ స్థాయిలో ఆరోపణలు చేయడం కలకలం సృష్టించింది. దీంతో స్థానికులు ఈ విషయాన్ని మీడియా ద్వారా బయటపెట్టారు. అది కాస్త సోషల్ మీడియా లోకి ఎక్కింది. ద్వారా దీపక్ కు దేశ వ్యాప్తంగా సానుభూతి పెరిగింది.
ఈ వ్యవహారం కేరళ రాష్ట్ర ప్రభుత్వ పెద్దల వరకు వెళ్లడంతో.. విచారణకు ఆదేశించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వాస్తవాలను బయటపెట్టే ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఈ వ్యవహారంలో దీపక్ ప్రమేయం లేదని.. అతడు ఎటువంటి అసభ్యకరమైన ప్రవర్తనకు పాల్పడలేదని తేలింది. దీంతో కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ ప్రాంత పోలీసులు ఆ యువతిపై కేసు నమోదు చేశారు.. ప్రస్తుతం ఆదివతి పోలీసుల అదుపులో ఉంది. దీపక్ మీద ఆమె ఆరోపణ చేయడం వెనక బలమైన కారణం ఉందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఆమె ఈ ప్రయత్నం చేసిందని.. కానీ ఆమె చేసిన ఈ పని వల్ల ఒక వ్యక్తి నిండు జీవితం బలైపోయిందని నెటిజన్లు వాపోతున్నారు.
