Koushik Maradi
Koushik Maradi : పశ్చిమ గోదావరి జిల్లాలోని అండలూరు గ్రామానికి చెందిన కౌశిక్ మరిడి(Koushik Maradi) ఒక సామాన్యుడే. కానీ ఈ రోజు దక్షిణ భారతదేశంలో నెంబర్ వన్ ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లూయెన్సర్. ఆర్థిక సందేహాలను సులభంగా తీర్చడం నుంచి ప్రభుత్వం ప్రవేశపెట్టే కొత్త పథకాలను వివరించడం, ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తం చేయడం, సాంకేతిక విషయాలను సరళంగా అందించడం వరకు కౌశిక్ తన కంటెంట్‌తో తెలుగు జనాల మనసు గెలుచుకున్నాడు.
Also Read : యూట్యూబ్‌కు 20 ఏళ్లు.. సోషల్ ప్రపంచంలో డిజిటల్ విప్లవం!
స్నేహితుల కోసం ప్రారంభించి..
అండలూరు జాతర విశేషాలను స్నేహితుల కోసం ఫొటోలు, వీడియోల(Photos, Vedios)రూపంలో పంచడంతో మొదలైన అతని ప్రస్థానం, ఫేస్‌బుక్ పేజీ, యూట్యూబ్ ఛానెల్‌గా విస్తరించింది. గ్రామంలోని అభివృద్ధి, సమస్యలను లేవనెత్తి అధికారులను ప్రశ్నించడం ద్వారా సామాజిక మాధ్యమాల శక్తిని అతడు గుర్తించాడు. సీఏ కావాలన్న కల సఫలం కాకపోయినా, బీకామ్, ఎంబీఏ పూర్తి చేసిన కౌశిక్ ఆర్థిక విషయాల్లో నైపుణ్యం సంపాదించాడు. స్నేహితుల సందేహాలు తీర్చడం నుంచి ప్రారంభమైన ఈ జ్ఞానం, 2020లో తన పేరిట యూట్యూబ్ ఛానెల్‌గా మారింది.
మొదట్లో అంతంతే..
మొదట్లో వీక్షణలు తక్కువగా ఉన్నా, యూట్యూబ్(You Tube) షార్ట్స్‌ని అందిపుచ్చుకొని క్లుప్తంగా, సూటిగా విషయాలను చెప్పడం మొదలుపెట్టాడు. తన వీడియోల్లో డబుల్ యాక్షన్ సందేహం లేవనెత్తే తింగరివాడిగా, సమాధానం ఇచ్చే నిపుణుడిగా నటించి కొత్తదనం తెచ్చాడు. ‘‘మొదట నా నటన దారుణంగా ఉండేది. కానీ తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకెళ్లడం నా అలవాటు,’’ అంటాడు కౌశిక్. ఈ పట్టుదలతోనే అతని ఛానెల్ ఈ రోజు 49.6 లక్షల సబ్‌స్క్రైబర్లతో, నెలకు 10 కోట్లకు పైగా వ్యూస్‌తో దూసుకెళ్తోంది. అతని వ్యక్తిగత ఛానెల్‌ని 13.5 లక్షల మంది అనుసరిస్తున్నారు.
జనాలకు ఉపయోగపడే కంటెంట్..
జనాలకు ఉపయోగపడే కంటెంట్‌నే ఎంచుకుని, నిజాలను క్రాస్ చెక్ చేసి, నిపుణుల సలహాలతో వీడియోలు చేసే కౌశిక్, రోజుకు ఏడు రీల్స్, నాలుగు వీడియోల చొప్పున సష్టిస్తాడు. తన పెళ్లిరోజున కూడా షార్ట్స్ చేయడం ఆపలేదంటే అతని అంకితభావం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ‘‘నా వీడియోలు చూసి ఒక కుటుంబం పొదుపు మొదలుపెట్టింది. వాళ్ల జీవితం మారిందని నా పేరు వాళ్ల బాబుకి పెట్టారు. ఇలాంటి అనుభవాలే నన్ను మరింత కష్టపడమని ప్రేరేపిస్తాయి,’’ అంటాడు కౌశిక్.
గేమింగ్ యాప్(Gaming aaps)ల వంటి ప్రమాదకర ప్రమోషన్లను తిరస్కరించి, హెల్త్ పాలసీలు, టర్మ్ ప్లాన్‌ల వంటి ఉపయోగకర వాటినే ప్రమోట్ చేస్తూ జనాల పట్ల తన బాధ్యతను చాటుకుంటాడు. ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రకటించిన ‘వాట్సప్ గవర్నెన్స్’ని సరళంగా వివరించిన వీడియోకి వచ్చిన స్పందన అతని సామర్థ్యానికి నిదర్శనం. రుణ యాప్‌ల బారి నుంచి ఉద్యోగులను కాపాడేందుకు బ్యాంక్ ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాల గురించి చెప్పిన వీడియోలు ఎందరికో ఆర్థిక స్వేచ్ఛనిచ్చాయి.
కౌశిక్ మరిడి కేవలం ఇన్‌ఫ్లూయెన్సర్ మాత్రమే కాదు.. తెలుగు జనాలకు ఆర్థిక గురువు, సామాజిక సమస్యలపై గొంతుక, ఉపయోగకర కంటెంట్‌తో జీవితాలను మార్చే శక్తి.
Also Read : తెలుగులో అత్యధికంగా సబ్ స్క్రైబర్స్ ఉన్న చానల్స్ ఇవే..