Homeజాతీయ వార్తలుKothagudem Review : సెగ్మెంట్‌ స్కాన్‌: కొత్తగూడెంలో ‘జలగం’ గండం ఎవరికి?

Kothagudem Review : సెగ్మెంట్‌ స్కాన్‌: కొత్తగూడెంలో ‘జలగం’ గండం ఎవరికి?

Kothagudem Review : ‘కొత్తగూడెం గడ్డ నా అడ్డా. ఇక నాకు తిరుగులేదు. ఈజీగా గెలిచేస్తానని’ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎంతో ఆశపడ్డాడు.. సీఎం పర్యటనతో ఒక్కసారిగా తన మీద ఉన్న వ్యతిరేకత పూర్తిగా తొలగిపోయిందని ఆయన భావించారు. కానీ అకస్మాత్తుగా మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు రాకతో సీన్‌ మారిపోయింది. కూల్‌ గా సాగిపోతున్న కొత్తగూడెం రాజకీయాల్లో కాక రేగింది. వాస్తవానికి కొత్తగూడెం నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోట లాంటింది. ఈసారి ఎన్నికల పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ముఖ్యంగా వనమా వర్గీయులు సంబరపడ్డారు. ఆయన గెలుపు నల్లేరు మీద నడక అనే అభిప్రాయానికి వచ్చారు. కానీ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు సడన్‌ ఎంట్రీతో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయాయి. ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థిగా లగం వెంకటరావు నామినేషన్‌ దాఖలు చేయడంతో కొత్తగూడెం పాలిటిక్స్‌ హీట్‌ ఎక్కాయి.

ఈ వైరం ఈనాటిది కాదు

2014 ఎన్నికల్లో జలగం, వనమా పరస్పరం పోటీ పడ్డారు. వైసీపీ అభ్యర్థిగా వనమా, జలగం వెంకటరావు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వనమా మీద జలగం విజయం సాధించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలిచిన ఒకే ఒక్క టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. ఆ తర్వాత వనమా కాంగ్రెస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా వనమా రంగంలోకి దిగారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా జలగం వెంకటరావు పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో వనమా విజయం సాధించారు. ఆ తర్వాత కొంతకాలానికే వనమా టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే వనమా అఫిడవిట్‌ పై జలగం కోర్టుకు వెళ్లడంతో పరిణామాలు మారిపోయాయి.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో హైకోర్టు వనమాను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ వనమా సుప్రీం కోర్టు మెట్లు ఎక్కారు.. ప్రస్తుతం ఈ కేసు స్టే లో ఉంది.

జలగం ఎంట్రీతో..

ఇప్పటి వరకు కాంగ్రెస్, జనసమితి, సీపీఎం బలపర్చిన సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావుకు, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుకు మధ్యనే పోటీ ఉంటుందని భావించిన నేపథ్యంలో జలగం ఎంట్రీ నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. దీంతో ఒక్కసారిగా నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయి త్రిముఖ పోటీ నెలకొంది. 2014 ఎన్నికల్లో జిల్లాలో జలగం వెంకటరావు ఒక్కరే ఇప్పటి బీఆర్‌ఎస్‌, అప్పటి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆతర్వాత 2018 ఎన్నికల్లో వనమా వెంకటేశ్వరావు చేతిలో ఓటమి చవిచూశారు. అప్పటి నుంచి నియోజకవర్గానికి, పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈక్రమంలో తిరిగి జలగం నియోజకవర్గంలో ఎంట్రీ కావడంతో ఆయన వర్గ కార్యకర్తల్లో నూతనోత్సాహం నెలకొంది. జలగం వచ్చారని తెలవడంతోనే సుమారు రెండు వేల మంది కార్యకర్తలు స్వచ్చందంగా వచ్చారు. జలగం నామినేషన్‌ వేసే సమయంలో ర్యాలీ తీయడం సంచలనం కలిగించింది.

జలగం ఎవరికి గండం?

జలగం వెంకట్రావు ఎన్నికల్లో పోటీచేయడం ఎవరికి గండం అనే చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది. ఒకవైపు వనమా వెంకటేశ్వరరావుపై, పార్టీపై తీవ్ర అసంతృప్తి, మరోవైపు తనయుడు రాఘవేంద్రరావు అరాచకాలు వనమా వెంకటేశ్వరరావు ఫలితంపై ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. “కొత్తగూడెం సీటును పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించడం, బ్యాలెట్‌లో చేయిగుర్తు ఉండదు ఇక గెలుపు సునాయాసం అని, సీటును ఆశించిన ఎడవల్లి కృష్ణ సైతం బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోవడంతో కాంగ్రెస్ బలహీన పడిందని వనమా వర్గీయులు భావించారు. అయితే వనమా, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎవరిని వరిస్తే వారికి విజయం ఖాయం అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. త్రిముఖ పోటీ ఉన్నప్పటికి జలగం, సాంబశివరావుల మధ్యనే నువ్వా నేనా అన్నట్లు ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌ ఓటు బ్యాంకును సీపీఐ కి వేయించడంలో సఫలీకృతమైతే ఫలితం కూనంనేనికి సానుకూలంగా ఉంటుంది. లేకుంటే జలగానికి లాభించే అవకాశం మెండుగా కన్పిస్తోందని” రాజకీయ పరీశీలకులు భావిస్తున్నారు. వ్యాపార వర్గాలు, కాంట్రాక్టర్లు, అధికారులు, యువత, మహిళలు అధికశాతం జలగం అభ్యర్థిత్వాన్ని కోరుకొంటున్నట్లు వివిధ సర్వేల్లో ప్రచారం సాగుతోంది. దీనికి తోడు ఆయన నియోజకవర్గంలో చేసిన అభివృద్ది కొంత కలిసి వస్తోంది.

ఇవీ బలాబలాలు

గతంలో జలగం ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, డ్రెయినేజీలు, పాతకొత్తగూడెంలో తెలంగాణ ఇంగ్లీష్‌మీడియం పాఠశాల, నియోజకవర్గవ్యాప్తంగా అన్ని పాఠశాలలకు మధ్యాహ్న భోజనానికి “అక్షయపాత్ర” ఏర్పాటు, పాల్వంచలో బంగారుజాలు ప్రాంతంలో ఎయిర్‌పోర్టు ప్రతిపాదన వంటివి జలగానికి కలిసి వచ్చే అవకాశాల్లాగా కనిపిస్తున్నాయి. సాంబశివరావు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని, పేరున్న వ్యక్తి కావడం, అంగన్‌వాడీ, మధ్యాహ్నభోజన పథకం, కార్మిక సంఘాలు, సింగరేణి కార్మికులతో కొంత సొంత బలం కలిగి ఉన్న సీపీఐకి కాంగ్రెస్‌, సీపీఎం తోడుకావడం కొంత మేర కలిసి రావచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు ప్రభుత్వ పథకాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. దళితబంధు, బీసీ బంధు, మైనార్టీ రుణాల్లో వసూళ్లు, డబుల్‌బెడ్‌రూం కేటాయింపులో విఫలం కావడం ఆయనకు కొంత ఇబ్బందిగా మారే ప్రమాదం లేకపోలేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular