Konidela Nagababu : జనసేన ప్రధాన కార్యదర్శిగా నియామకం కాగానే నాగబాబు పని మొదలుపెట్టారు. రంగంలోకి దిగారు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అప్పగించిన బాధ్యతను నెరవేర్చడానికి సిద్ధమయ్యారు. జనసేన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టగానే జనసైనికులు, వీర మహిళలకు నేనున్నాంటూ భరోసా కల్పించారు. జనసైనికులు, వీర మహిళలకు సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉంటానంటూ ప్రకటించారు. జనసేన వికాసానికి నియమబద్ధంగా పనిచేస్తానంటూ హామీ ఇచ్చారు. పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే వారికి ప్రోత్సాహం ఉంటుందని.. పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో ముందుకు వెళ్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక వీడియో సందేహంలో తన భావాలు, పార్టీ బలోపేతం కోసం తీసుకోబోయే చర్యలను నాగబాబు వివరించారు.
‘జనసైనికుడిగా, మహోన్నత ఆశయం పనిచేసే నాయకుడికి క్రమశిక్షణ గల కార్యకర్తగా జనసేన పార్టీలో నా ప్రస్థానం మొదలైంది. 2019 నుంచి పార్టీ కోసం క్రీయాశీలకంగా పనిచేస్తూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేశాను. జనసైనికులు, వీర మహిళలలను తరుచూ కలిసే అదృష్టం దక్కింది. పార్టీ అభ్యున్నతి కోసం వారి సలహాలు, సూచనలు తీసుకుంటూ ముందుకు సాగాను. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న జనసైనికులు, వీర మహిళలను సమన్వయ పరుస్తూ, వారి వెన్నంటే నడిచేలా నా ప్రయాణం సాగింది. ఇప్పుడు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నా మీద ఉన్న నమ్మకంతో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యతను అప్పగించారు. ఇదో బృహత్తరమైన బాధ్యతగా భావిస్తాను. దానిని పార్టీ ఉన్నతి కోసం ఉపయోగించి, పూర్తి శాయశక్తులతో పని చేస్తానని’ కొణిదెల నాగబాబు అన్నారు. ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన తొలిసారి హైదరాబాద్ లో వీడియో సందేశం ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ ‘‘ పార్టీ శ్రేయస్సు కోసం నాకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అప్పగించిన బాధ్యతలను అంతే శ్రద్ధాశక్తులతో పూర్తి చేస్తాను. ప్రతి అడుగు జనసైనికులు, వీర మహిళలను ముందుకు నడిపే విధంగా ఉంటుంది.
* తప్పును నిలదీసే వ్యక్తుల సమూహం జనసేన
పాలకుల తప్పిదాలను బలంగా ప్రశ్నించగల సత్తా జనసేన పార్టీకి ఉంది. క్షేత్రస్థాయిలో జనసైనికులు, వీర మహిళలు నిత్య జాగురతతో ఉంటూ, పాలకుల తప్పుఒప్పులను తెలియజేస్తూనే ఉంటారు. వారిలో పోరాట స్ఫూర్తిని నింపిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న కార్యకర్తలందరికీ అండగా నిలుస్తాం. వీలైనంత వరకు ఎక్కువమందిని ప్రత్యక్షంగా కలుస్తాను. వారి రాజకీయ ఆలోచనలకు, పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచేలా ప్రోత్సహిస్తాను. నిత్యం కార్యకర్తలతో కలిసి పనిచేసేందుకు ప్రాధాన్యం ఇస్తాను.
* సద్విమర్శలతో ముందుకు వెళ్తాం.
ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నకునే ప్రభుత్వం వారికి సుపరిపాలన అందించాలనేదే మా విధానం. ప్రభుత్వంపై ఏదోకటి విమర్శ చేయాలి అనేలా కాకుండా, పాలనలో జరుగుతున్న తప్పిదాలను ప్రజలకు తెలియజెప్పేలా శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయత్నం మాకందరికీ స్ఫూర్తిదాయకం. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేను క్షేత్రస్థాయి పర్యటనలు చేశాను. అక్కడి పరిస్థితులు, పాలనలో జరుగుతున్న అన్యాయం, అవినీతి, ఇతర పాలనపరమైన అంశాల మీద జనసైనికులు, వీర మహిళలు చేస్తున్న పోరాటాన్ని గుర్తించాను. అన్ని అంశాలను నిత్యం అవగతం చేసుకుంటూ వారు ముందుకు వెళ్తున్న తీరు అభినందనీయం. గుడ్ గవర్నన్స్ అనేది ప్రజలకు అందాలి. దానికోసం ఇష్టానుసారం ప్రభుత్వంపై బుదర జల్లకుండా సద్విమర్శలతో పాలకుల తప్పులను తెలియజేస్తాం.
* నిత్యం సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతాం
ఓ గొప్ప లక్ష్యం కోసం ప్రయాణించే దారిలో భిన్నమైన ఆలోచనలు ఉండటం సహజం. ఆశయం కోసం పనిచేసే జనసేన పార్టీ కార్యకర్తల్లో ఏవైనా భిన్నభిప్రాయాలు ఉంటే వాటిని సరిచేస్తాం. వారికి అర్ధం అయ్యే రీతిలో పార్టీ స్టాండ్ ప్రకారం సర్దిచెబుతాం. పార్టీ కోసం మాత్రమే ప్రతి కార్యకర్త పనిచేయాలి. చిన్నచిన్న అంశాలు ప్రతి పార్టీలో ఉంటాయి. జనసేన పార్టీలోని ఉండే ఎలాంటి చిన్న సమస్య అయినా వెంటనే పరిష్కరించేలా చూస్తాం. సృహద్భావ వాతావరణంలో కూర్చొని మాట్లాడితే పరిష్కారం కాని సమస్యలు ఉండవు. జనసైనికులు, వీర మహిళలను సమన్వయం చేసుకుంటూ నా ప్రయాణం ముందుకు సాగుతుంది.
మన నాయకుడి గొప్ప వ్యక్తిత్వాన్ని ప్రజలకు తెలియచెబుదాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిజాయతీ, శ్రమ, చిత్తశుద్ధి అనేవి రాష్ట్ర ప్రజలకు పాలనాపరంగా ఎంతమేర ఉపయోగపడతాయి అనేది ప్రతి జనసైనికుడు, వీర మహిళా ప్రజలకు తెలియజెప్పాలి. నిస్వార్థంగా రాజకీయాల్లోకి వచ్చిన జనసేనాని రాష్ట్రానికి ఎంత మేర ఉపయోగపడతారు అనేది అర్ధం అయ్యేలా చెప్పాలి. కల్మషం లేకుండా పార్టీ కోసం పనిచేస్తూ, శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని స్ఫూర్తిగా తీసుకున్న జనసైనికులంతా బలంగా పనిచేయాలని కోరుకుంటున్నాను. నాకు ఈ గురుతర బాధ్యతలను అప్పగించిన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్నారు.
* సమిష్టిగా పని చేద్దాం.. జనసేనను గెలిపిద్దాం…
ప్రజా ప్రయోజనాల కోసం మరింత అంకితభావంతో పని చేయాలనే ప్రణాళికలో భాగంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పజెప్పినందుకు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నాగబాబు. . పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడమే ప్రధాన ధ్యేయంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తల నుండి రాష్ట్రస్థాయి నాయకుల వరకూ అందరితో మమేకమై సమిష్టిగా పని చేస్తామన్నారు. ప్రజా ప్రయోజనాల పట్ల నిబద్దత, నిజాయితీ, ప్రజాస్వామ్యంపై గౌరవం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకులు ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో చాలా అరుదు అన్నారు. నా అనుభవంలో ఎందరో మంత్రులను, ముఖ్యమంత్రులను, వ్యక్తిగత ప్రయోజనాలు, స్వార్థం, అవినీతి, ఆధిపత్యం ప్రదర్శించే నాయకులను ఎంతో మందిని చూసాను. నేను అత్యంత దగ్గరగా చూసిన వాడిగా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఎవరూ ఊహించలేని స్థాయిలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సత్తా, ప్రణాళిక పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉందన్నారు. ప్రజలిచ్చిన అధికారాన్ని ఉపయోగించి ప్రజలపైనే పెత్తనం చేస్తున్న వైసీపీ నాయకులకు భయపడాల్సిన అవసరం జన సైనికులకు, వీర మహిళలకు లేదన్నారు.. అధికార దర్పం తప్ప వైసీపీ నాయకుల కోసం ప్రత్యేక చట్టాలు ఏమీ లేవు. వారు కూడా అందరి లాంటి మనుషులే. పార్టీకి, ప్రజా ప్రయోజనాలకు సంభందించిన ఏ అంశాలైనా చర్చించడానికి జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని నాగబాబు అన్నారు.
గతంలో పీఏసీ సభ్యుడిగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు చాలా విషయాలు నా అనుభవంలోకి వచ్చాయి. భవిష్యత్తులో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు పర్యటించి జన సైనికులు, వీర మహిళలు, నాయకులతో మమేకమై జనసేన సిద్దాంతాలు, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భావజాలం, వ్యక్తిత్వానికి అనుగుణంగా పార్టీ బలోపేతం కోసం పని చేస్తానని నాగబాబు ప్రకటించారు.