Internet Cut In Konaseema: వాట్సాప్ లేకుంటే పొద్దు గడవదు. ఫేస్‌బుక్ చూడకుంటే దిక్కుతోచదు. గూగుల్ పే, ఫోన్ పేలతో చెల్లింపులు, బ్యాంకింగ్ యాప్‌లతో లావాదేవీలు.. అన్నీ ఫోన్లతోనే! బస్సు టికెట్ నుంచి విమానం టికెట్ వరకు… అన్నీ ఆన్‌లైన్‌లోనే. కానీ… కోనసీమ జిల్లా ప్రజలు ఈనెల 24వ తేదీ నుంచి ఇవేవీ లేకుండానే గడుపుతున్నారు. జిల్లా పేరుమార్పుపై ఈనెల 24వ తేదీన అమలాపురంలో భారీ విధ్వంసం జరిగిన సంగతి తెలిసిందే. వాట్సాప్ ద్వారా సమాచారం చేరవేసుకుని అల్లర్లకు పాల్పడ్డారని ఆ రోజున ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఉవ్వెత్తున ఎగిసిన ఆ ఉద్రిక్తత ఆ ఒక్కరోజుతోనే ముగిసిపోయింది. పేరు మార్పును వ్యతిరేకిస్తూ కొత్తగా ఎవరూ ఎలాంటి కార్యాచరణా ప్రకటించలేదు. అయినప్పటికీ… ఇంటర్నెట్ సేవలను మాత్రం పునరుద్ధరించలేదు.
మొబైల్ డేటా మాత్రమే కాదు. ఇళ్లు, కార్యాలయాల్లో రౌటర్ ఆధారిత వైఫై సేవలనూ కట్ చేశారు. దీంతో… ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలు దాదాపు పూర్తిగా ఆగిపోయాయి. సొంత సర్వర్లు ఉన్న బ్యాంకు శాఖలు మినహా… ఇతర బ్యాంకులేవీ పని చేయడంలేదు. ఏటీఎంలు ఖాళీ అయ్యాయి.గూగుల్ పే, ఫోన్‌పే వంటి డిజిటల్ యాప్‌లు, బ్యాంకుల యాప్‌ల ద్వారా జరిగే ఆర్థిక లావాదేవీలన్నీ స్తంభించాయి. ఇంటర్నెట్ ఆధారంగా ఆర్డర్లు పెట్టి సరుకు తెప్పించుకోవాల్సి ఉండటంతో… ప్రభుత్వ మద్యం షాపులు సైతం బంద్ అయ్యాయి. మద్యం విక్రయించగా వచ్చిన కోట్ల రూపాయల నగదును సమీపంలోని పోలీ్‌సస్టేషన్లలో డిపాజిట్ చేస్తున్నారు. సచివాలయ వ్యవస్థ వెలవెలబోతోంది. కోనసీమ జిల్లా పరిధిలోని పదికిపైగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగిపోయింది. జిల్లావ్యాప్తంగా విద్యుత్ బిల్లుల చెల్లింపులు ఆగిపోయాయి. ఆఫీసుకు వెళ్లినా చేసేదేమీలేక… చాలామంది ఉద్యోగులు ఇళ్లకే పరిమితమవుతున్నారు.
సాఫ్ట్‌వేర్ కష్టాలు…
ప్రస్తుతం ‘వర్క్‌ఫ్రమ్‌హోమ్’ నడుస్తుండటంతో కోనసీమ జిల్లాకు చెందిన వేల మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు సొంత ఊళ్లకు వచ్చి, ఇళ్లలోనే పని చేసుకుంటున్నారు. వీరందరికీ ‘నెట్ కట్’ శాపంగా మారింది. ప్రాజెక్టుల ఒత్తిడి పెరగడంతో… అత్యధికులు రాజమహేంద్రవరం, యానాం, నర్సాపురం, భీమవరం, ఏలూరు వంటి ప్రాంతాలకు వెళ్లి అక్కడే లాడ్జీలు, బంధువుల ఇళ్లకు వెళ్లి పని చేస్తున్నారు. మరికొందరు… తమ కార్యాలయాలకు చేరుకున్నారు.ఎయిర్‌టెల్, రిలయన్స్, బీఎ్‌సఎన్‌ఎల్, ఐడియా సహా వివిధ నెట్‌వర్క్‌లకు చెందిన సుమారు 750 టవర్ల పరిధిలో లక్షలాది మంది వినియోగదారులు ఇంటర్నెట్ బంద్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు.
సెల్‌ఫోన్ వినియోగదారులు గోదావరి తీర ప్రాంతాల్లో వందల సంఖ్యలో మోహరించి… పక్క జిల్లా నుంచి అప్పుడప్పుడు కనెక్ట్ అవుతున్న ‘నెట్’ను వాడుకుంటున్నారు. పి.గన్నవరం మండలం పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దు ప్రాంతం కావడంతో… అక్కడి గ్రామాలకు చెందిన వారు ఇల్లు వదిలిపెట్టి చెట్ల కింద, గోదావరి నది చెంతన పాంచాల రేవు దిమ్మలపై కూర్చుని పని చేసుకుంటున్నారు. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో మాత్రం నెట్ సేవలకోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. కిమ్స్, శ్రీనిధి ఆసుపత్రుల నుంచి ‘ఆరోగ్యశ్రీ’ రోగులను ఎస్పీ కార్యాలయానికి తీసుకువచ్చి అక్కడ ఉన్న నెట్ సౌకర్యంతో వేలిముద్ర వేయించుకుంటున్నారు.
లావాదేవీలు తగ్గిపోవడంతో వ్యాపారాలూ తగ్గిపోయాయి. వివిధ వర్తకసంఘాల ప్రతినిధులు కలెక్టర్ హిమాన్షు శుక్లాను కలిసి తమ ఇబ్బందులను ఏకరువు పెట్టినప్పటికీ ఫలితం లభించలేదు.
Also Read:KCR IAS Postings : కేసీఆర్ దగ్గర పదవులు ఎవరికిస్తారు? ఎందుకిస్తారో తెలుసా?.. రహస్యం బయటపడింది!