Homeజాతీయ వార్తలుషర్మిల పార్టీ నుంచి ఆహ్వానంః కోమ‌టిరెడ్డి

షర్మిల పార్టీ నుంచి ఆహ్వానంః కోమ‌టిరెడ్డి

తెలంగాణ పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ద‌క్కించుకునేందుకు మాజీ మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట‌రెడ్డి ఎంత‌గా ప్ర‌య‌త్నించారో అంద‌రికీ తెలిసిందే. రేవంత్ తో బ‌లంగా పోటీప‌డ్డ‌ది కోమ‌టిరెడ్డి మాత్ర‌మే. సీనియ‌ర్ కోటా ప‌రంగా చూసినా.. త‌న‌కే వ‌స్తుంద‌ని, రావాల‌ని ఆశించారు. ఇత‌ర సీనియ‌ర్ల మ‌ద్ద‌తుతో ప‌లుమార్లు ఢిల్లీ వెళ్లొచ్చారు. రాయ‌బారాలు సాగించారు. కానీ.. అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డివైపే మొగ్గు చూపింది. దీంతో.. కోమ‌టిరెడ్డి తీవ్ర నిరుత్సాహానికి గుర‌య్యారు.

త‌న అసంతృప్తిని ఓ సారి బ‌హిరంగంగానే వ్య‌క్తం చేశారు కూడా. తెలంగాణ కాంగ్రెస్ కూడా.. తెలంగాణ టీడీపీలా మారిపోతుంద‌ని అన్నారు. తాను బ‌య‌ట‌ప‌డితే.. మిగిలిన నేత‌లు కూడా గ‌ళం వినిపిస్తార‌ని భావించి ఉంటారు. కానీ.. ఎవ్వ‌రూ మాట్లాడ‌క‌పోవ‌డంతో.. ఆ త‌ర్వాత ఆయ‌న కూడా సైలెంట్ అయిపోయారు. అయితే.. ఇప్పుడు ఉన్న‌ట్టుండి క‌ల‌క‌లంరేపే వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు ష‌ర్మిల పార్టీ నుంచి ఆహ్వానం అందింద‌ని చెప్పారు.

ఇవాళ వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి జ‌యంతి. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని ష‌ర్మిల కొత్త పార్టీని ప్ర‌క‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌భ జ‌ర‌గ‌నున్న హైద‌రాబాద్ లోని జేఆర్సీ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ వ‌ద్ద ఆగిన కోమ‌టిరెడ్డి, వైఎస్ అభిమానుల‌తో మాట్లాడారు. వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి గొప్ప నేత‌గా కొనియాడిన కోమ‌టిరెడ్డి.. వైఎస్ ష‌ర్మిల పార్టీ ప్రారంభోత్స‌వానికి త‌న‌కు ఆహ్వానం అందింద‌ని అన్నారు.

కాగా.. కోమ‌టిరెడ్డి తొలి నుంచీ వైఎస్ అనుచ‌రుడిగా ఉన్నారు. 2009 లో గెలిచిన త‌ర్వాత జానారెడ్డి వంటివారిని కాద‌ని, కోమ‌టిరెడ్డిని మంత్రివ‌ర్గంలోకి తీసుకున్నారు వైఎస్‌. ఆ విధంగా.. ఆయ‌న‌కు విధేయుడిగానే ఉన్నారు. అయితే.. ఇప్పుడు ష‌ర్మిల పార్టీ నుంచి ఆహ్వానం అందింద‌ని చెప్ప‌డం. ఆ పార్టీకి శుభాకాంక్ష‌లు కూడా చెప్ప‌డం కాంగ్రెస్ లో చ‌ర్చ‌కు దారితీసింది. మ‌రి, రాబోయే రోజుల్లో కోమ‌టిరెడ్డి అడుగులు ఆ వైపుగా ప‌డ‌తాయా? లేక.. రేవంత్ విషయంలో ఇంకా అసంతృప్తిగానే ఉన్నాను అని చాటి చెబుతున్నారా? అన్న‌ది తేలాల్సి ఉంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version