
దేశంలో కరోనా తగ్గుముఖం పడుతుందని సంబరపడిపోతున్నాం. కానీ కరోనా రెండో దశ ఇంకా ముగిసిపోలేదని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. దీనికితోడు ఇటీవల కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రజల్లో ఆందోళన కలుగుతోంది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు కేసుల సంఖ్య 5 శాతం పెరుగుదల కనిపించింది. భారతదేశంలో గత 24 గంటల్లో కరోనా మహమ్మారి బారిన 45,852 మంది పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా నిన్న ఒక్క రోజే 817 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,09,557 కు పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 405,028 కు పెరిగింది.
దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4,60,704 గా ఉంది. 1.50 శాతం వరకు పెరిగింది. గత 24 గంటల్లో44,291 మంది కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో రికవరీల కంటే నమోదైన కేసులే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో రికవరీల సంఖ్య 2,98,43,825 గా ఉంది. గత 24 గంటల్లో 19,07,216 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.
దేశంలో పాజిటివిటీ రేటు 2.37 శాతానికి పడిపోయింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.42 శాతంగా ఉంది. ఇది వరుసగా 17వ రోజు 3 శాతం కన్నా తక్కువ అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యం పెరిగిందని ఇప్పటివరకు 42.52 కోట్ల పరీక్షలు జరిగాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్లు తీసుకున్న వారి సంఖ్య36,48,47,549 కు చేరుకోగా 33,81,671 మందికి రాగల 24 గంటల్లో టీకాలు వేసినట్లు అధికారులు తెలిపారు.
ఆగస్టులో కరోనా మూడో దశ ప్రారంభం కానుందని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న సందర్భంలో ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేస్తోంది. సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.