టీపీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతల నుంచి ఉత్తమ్ కుమార్ తప్పుకోవడంతో.. ఇంకా పదవిని ఎవరికి కేటాయిస్తారా అని సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే ఈ పదవి కోసం సీనియర్లు పోటీ పడుతున్నారు. మరోవైపు హైకమాండ్ కూడా ఎవరి పేరును కన్‌ఫాం చేయలేదు. పీసీసీ పదవి తమకంటే తమకు కేటాయించాలంటూ పలువురు హస్తినా బాట పడుతూనే ఉన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో భేటీ అయ్యారు.
Also Read: రాయపాటి మోసం: పనిమనిషి, స్వీపర్లు, డ్రైవర్లే డైరెక్టర్లు?
ఈ క్రమంలో మరోసారి కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి హస్తిన బాట పట్టారు. పీసీసీ ఫైనల్ అయ్యిందనే వార్తలు వస్తుండడంతో ఆయన మరోసారి ఢిల్లీకి పయనం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన వంతుగా ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు. పీసీసీ అధ్యక్ష పదవికి ఇప్పటికే ముగ్గురి పేర్లను మాత్రం పరిశీలించింది హైకమాండ్.
ఫైనల్ లిస్టులో మాత్రం రేవంత్, భట్టి విక్రమార్క పేర్లు ఉన్నట్టు సమాచారం. అభిప్రాయ సేకరణలో రేవంత్‌కే ఎక్కువగా మద్దతు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. సీనియర్ల కోణంలో కోమటిరెడ్డి, భట్టి పేర్ల పరిశీలన జరుగుతోందట. ఈ నెల 23 లేదా 26న పీసీసీ కొత్త చీఫ్ పై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మాస్ ఫాలోయింగ్, అందర్నీ కలుపుకుపోయే వ్యక్తికే పార్టీ పగ్గాలు అప్పగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఢిల్లీ వెళ్లిన కోమటిరెడ్డి… సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఇప్పుడు మరోసారి కోమటిరెడ్డి ఢిల్లీ ప్రయత్నాలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ ఎవరి పేరు ప్రకటిస్తుందనేది హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: సొంత నియోజకవర్గంపై జగన్ ప్రేమ
ముందు రాబోతున్న ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, పలు కార్పొరేషన్లకు ఎన్నికలు ఉండడంతో కాంగ్రెస్ అధిష్టానం బలమైన నేత కోసమే ప్రయత్నిస్తోంది. సీనియర్ల అలకను పక్కనబెట్టి అయినా సమర్థుడికే పగ్గాలు అప్పజెప్పాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఇప్పటివరకు పార్టీకి జరిగిన నష్టం చాలని.. ఇక ముందైనా పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయాలని ఈ కసరత్తు చేస్తోంది. ఫైనల్‌గా అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందా అనేది అందరిలోనూ ఆసక్తిగా మారింది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్