తెలంగాణ కాంగ్రెస్ లో ఒక విధంగా `తిరుగుబాటు నేత’గా పేరున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలసి, టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిపై ఫిర్యాదు చేయడం ఒక వంక కాంగ్రెస్, మరోవంక బిజెపి వర్గాలలో కలకలం రేపుతున్నది. ఆయన జరిపిన సమావేశంపై గల రాజకీయ ప్రాధాన్యతపై అంచనా వేస్తున్నారు.
పిసిసి అధ్యక్ష పదవి కోసం పట్టుబడుతున్న వెంకటరెడ్డి గత వారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కూడా కలిశారు. ఈ పదవి ఇవ్వని పక్షంలో తాను మరో మార్గం చూసుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే పార్టీ నాయకత్వానికి స్పష్టమైన సంకేతం ఇచ్చారు. బీజేపీలో చేరడమా లేదా తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేయడమా అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది.
వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల ముందే బీజేపీలో చేరడానికి కోమటిరెడ్డి సోదరులు ప్రయత్నించారు. విశేషమైన ప్రజాబలం, పుష్కలంగా వనరులు గల అటువంటి వారు పార్టీలో చేరితే తమ ప్రాధాన్యత తగ్గిపోతుందని భయపడిన ప్రస్తుత కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అందుకు మోకాలడ్డారని బిజెపి వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇప్పుడు తెలంగాణలోని పార్టీ నాయకత్వంపై బిజెపి అధిష్టానానికి సహితం విసుగు వచ్చిన్నట్లున్నది. అందుకనే అందరికి ఆశ్చర్యం కలిగించే రీతిలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను రాష్ట్ర అద్యక్షకుడిగా చేశారు. అయినా రాష్ట్రంలో పార్టీ బలం పుంజుకోవాలి అంటే జనాబలం గల నాయకులు అవసరం. అందుకనే కోమటిరెడ్డి సోదరులు వస్తే బీజేపీ పుంజుకొని అవకాశం ఉంటుంది.
ఒక వంక కాంగ్రెస్ నాయకత్వానికి హెచ్చరిక సందేశం ఇస్తున్నట్లు, మరోవంక బీజేపీలో చేరడానికి మార్గం ఏర్పాటు చేసుకొనేటట్లు కోసమే వెంకటరెడ్డి ప్రధానిని కలసినన్నట్లు కనిపిస్తున్నది. తెలంగాణలో కాంగ్రెస్, బిజెపి నాయకులలో అనేకమంది తెరచాటున టీఆర్ఎస్ నాయకత్వంతో సంబంధాలు ఏర్పాటు చేసుకొంటూ ఉన్న సమయంలో ఆయన ప్రధానిని కలవడం ఆసక్తి కలిగిస్తున్నది. రాష్ట్రంలోని కొందరు బీజేపీ నేతల తీరుతెన్నులపై కూడా ఫిర్యాదు చేశారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ సందర్భంగా ప్రాజెక్టుల పేరుతో బ్యాంకులు, కేంద్ర సంస్థల నుంచి లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి సిండికేట్ విధానంలో టీఆర్ఎస్ సర్కార్ దోచుకుంటున్నదని ప్రధానికి ఫిర్యాదు చేయడం ద్వారా రాష్ట్రంలో టీఆర్ఎస్ తో పోరాడగల సత్తా తమకు మాత్రమే ఉన్నదనే సంకేతాన్ని సహితం రెండు పార్టీల అధినేతలకు ఇచ్చిన్నట్లు స్పష్టం అవుతున్నది.