అమరజీవి…

( పొట్టి శ్రీ రాములు గారి 120 వ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం )

ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడీయన.

పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌన్, అణ్ణాపిళ్ళె వీధిలోని 165వ నంబరు ఇంటిలో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. వారి పూర్వీకులది అప్పటి నెల్లూరు జిల్లా కనిగిరి తాలూకా పడమటి పల్లె. ఇప్పుడు కనిగిరి తాలూకా పడమటి పల్లె ప్రకాశం జిల్లా లో ఉంది. ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసు లోనే జరిగింది. అనంతరం బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివి “గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే” లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేసారు.అప్పటిలో అతని జీతం వెలకు 250 రూపాయలు. 1928లో వారికి కలిగిన బిడ్డ చనిపోయారు. తరువాత కొద్ది రోజులకే అతని భార్య కూడా చనిపోయింది. 25 యేండ్ల వయసు కలిగిన శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేసారు. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి, గాంధీజీ అనుయాయిగా సబర్మతి ఆశ్రమం చేరి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు.

పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. తర్వాత మళ్ళీ 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించారు. 1985లో ప్రచురింప బడిన ఆంధ్ర ఉద్యమం కమిటీ (Committee for History of Andhra Movement) అధ్యయనంలో పొట్టి శ్రీరాములు – మహాత్మా గాంధీల మధ్య అనుబంధం గురించి ఇలా వ్రాయబడింది. –

“సబర్మతి ఆశ్రమంలో శ్రీరాములు సేవ చరిత్రాత్మకమైనది. ప్రేమ, వినయం, సేవ, నిస్వార్ధత లు మూర్తీభవించిన స్వరూపమే శ్రీరాములు”.

1943-44ల్లో నెల్లూరు జిల్లాలో చరఖా వ్యాప్తికి కృషిచేసారు. కులమతాల పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవారు. 1946లో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశంకోసం నిరాహారదీక్ష బూని, సాధించారు. మరోసారి నిరాహారదీక్ష చేసి, మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేసారు. దీని ఫలితంగా వారంలో కనీసం ఒకరోజు హరిజనోద్ధరణకు కృషి చెయ్యవలసిందిగా ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తరువులు ఇచ్చింది. గాంధీజీకి శ్రీరాములు అంటే ప్రత్యేకమైన అభిమానంతో పాటు అతని మంకుతనం మీద కాస్త భయం కూడా ఉండేవి. శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు పదిమంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే స్వతంత్రం సాధించవచ్చునని గాంధీజీ అనేవారు.

1946 నవంబరు 25న గాంధీ శిష్యుడు అయిన వీరు మద్రాసు ప్రొవిన్సులోని అన్ని దేవాలయాల లోనూ హరిజనులకు ప్రవేశం కల్పించాలని ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే స్వాంతంత్ర్యం రావచ్చునన్న ఆశాభావంతో కాంగ్రెసు నాయకులు, సభ్యులందరి దృష్టీ ఆ స్వాతంత్ర్యోద్యమంపైనే ఉంది. కనుక శ్రీరాములు దీక్షను మానుకోవాలని వారు సూచించినా అతను వినకపోయేసరికి ఇక వారు గాంధీని ఆశ్రయించారు. ఎలాగో గాంధీ ప్రకాశం గారిద్వారా శ్రీరాములుకు నచ్చజెప్పి దీక్ష విరమింపజేశారు. అప్పుడు మహాత్మా గాంధీ టంగుటూరి ప్రకాశంకు ఇలా వ్రాశారు – “హమ్మయ్య. శ్రీరాములు దీక్ష నువ్వు చెప్పినట్లు విరమించుకోవడం నాకు సంతోషం. దీక్షను మానుకొన్నాక నాకు అతను టెలిగ్రామ్ పంపారు. అతను ఎంతో దీక్షాపరుడైన ఉద్యమకారుడైనా గాని కాస్త తిక్కమనిషి (eccentric)”. –

1952లో శ్రీరాములు దీక్ష మాన్పించడానికి గాంధీజీ జీవించి లేరు. ఉన్నాగాని ఆంధ్రోద్యమంపై అతనికున్న దృఢత్వం అచంచలమైనది. జీవితం చివరిదశలో నెల్లూరులో ఉంటూ, హరిజనోద్ధరణకు కృషిచేసారు. దీనిగురించిన నినాదాలను అట్టలకు రాసి, మెడకు వేలాడేసుకుని ప్రచారం చేసేవారు. కాళ్ళకు చెప్పులు, తలకు గొడుగు లేకుండా మండుటెండల్లో తిరుగుతూ ప్రచారం చేసే ఆయన్ను పిచ్చివాడనేవారు. ఆ పిచ్చివాడే ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకుని, అమరజీవి అయ్యారు.

మద్రాసు రాజధానిగా వుండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించారు. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష, క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెసు కమిటీ మాత్రం దీక్షను సమర్ధించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చెయ్యలేదు. రోజురోజుకూ ఆరోగ్యం క్షీణస్తూ ఉన్నా, శ్రీరాములులో మనోధైర్యం మాత్రం మరింత పెరుగుతుండేది. తన ఆరోగ్యానికి ఏమీ ఢోకాలేదని ఆయన ఉత్తరాల్లో పదే పదే చెప్పేవారు. నవంబరు 27వ తేదీ నాటికి శ్రీరాములు ఇంట్లోనే కొద్దికొద్దిగా తిరుగుతూ అవసరాన్ని బట్టి మాట్లాడుతుండేవారు. ఆ తర్వాత అతని ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. వార్తా పత్రికల్లో ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమయ్యేది. డాకర్లు వచ్చి రక్త పరీక్షలు కూడా చేశారు. నిద్రపోయే సమయంలో తప్పితే ఆయనకు ఎల్లప్పుడూ నోట్లో లాలాజలం కారుతుండేది. నిమిష నిమిషానికి చొంగ కారుతుండేది. తరచూ వాంతులు అయ్యేవి. ఎక్కిళ్ళు, తుమ్ములు వచ్చేవి. అప్పటికే ఆయన అలసిపోవడం… పైగా వాంతులు, తుమ్ములతో మరింత కష్టంగా ఉండేది. డిసెంబరు 5వ తేదీనాటికి ఎక్కిళ్లు, తుమ్ములు తగ్గినా శీతవిరోచనాలు మొదలయ్యాయి. దాంతో మరింత నీరసించారు. శిబిరంలోని అందరూ గాబరాపడ్డారు. నిరాహారదీక్షకు కూర్చునేముందే ఆయన రోజుకు మూడుసార్లు నీటిలో నిమ్మకాయ రసం, కొంచెం తేనె కలిపి తీసుకుంటానని ప్రకటించారు. ఇప్పుడు అవి కూడా వాంతులు అయిపోయేవి. కొన్నికొన్ని సందర్భాల్లో నెత్తురు పడ్డది. ఇక ఆత్మార్పణ వారం రోజులు ఉందనగా శ్రీరాములు పూర్తిగా లేవలేని, మాట్లాడలేని స్థితికి వచ్చారు. డిసెంబరు నెల కావడంతో విపరీతంగా చలి. దాంతో, ఆయన వణుకుతుంటే ఎప్పుడూ చొక్కా వేసుకోని శ్రీరాములుకు చొక్కా తొడిగారు. ఆయన బాగా నీరసించిపోవడంతో గ్లూకోజ్ ఇవ్వాలని డాకర్లు చెప్పారు. అప్పటికే మాట్లాడలని స్థితిలో ఉన్న శ్రీరాములు వద్దని చేయి ఊపుతూ సూచించారు. ఉద్యమం ఉధృతం కావడం; ప్రభుత్వం స్పందించకపోవడం; ఆయన రోజురోజుకూ నీరసం కావడంతో ఓరోజు బులుసు సాంబమూర్తి, నరసింహలతో మాట్లాడారు. క్రమక్రమంగా దేహం బలహీనం అయ్యి, స్పృహ తప్పి పోయినా దీక్ష నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకొన్నారు. స్పృహ లేనప్పుడు ఎవరూ బలవంతంగా ఇంజెక్షను ద్వారా ఆహారం ఎక్కించరాదని ఆయన చెప్పారు. అప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న అల్లరును ఆయన వ్యతిరేకించారు.

అది డిసెంబర్ 15
పొట్టి శ్రీ రాములు గారి ఆత్మార్పణ రోజు!!

ఉదయం నుంచే ఆయన స్పృహలో లేరు. కళ్లు తెరిచారు. అంతలోనే మూతలు పడపోయేవి. చేతులు కదిపేందుకు కూడా శక్తి లేదు. 54 పౌనుల (24.5 కేజీలు) బరువు తగ్గారు. నాడి కదలిక, శ్వాసతీరుల్లో మార్పు వచ్చింది. 16 గంటలపాటు మూత్రం స్తంభించింది. నోటిమాట కష్టమైంది. అప్పుడప్పుడు అపస్మారకంలోకి వెళ్లేవారు. సందర్శకులను నిలిపివేశారు. సాయంత్రం వచ్చిన ప్రకృతి చికిత్సకులు వేగిరాజు కృష్ణమరాజు, వారి సతీమణితో మాట్లాడలేకపోయినా… చిరునవ్వుతో స్వాగతం పలికారు. అప్పటి నుంచి క్రమంగా శరీరం చల్లబడిపోయింది. రాత్రి 11.23 గంటలకు పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్ట్రం కోసం తనను తాను బలిదానం చేసుకొని అమరజీవి అయ్యారు.

ఆగ్రహావేశులైన ప్రజలు హింసాత్మకచర్యలకు పాల్పడ్డారు. మద్రాసులో జరిగిన ఆయన శవయాత్రలో నినాదాలతో ప్రజలు ఆయన త్యాగనిరతిని కొనియాడారు. తదుపరి మద్రాసు నుండి విశాఖపట్నం వరకు ఆందోళనలు, హింస చెలరేగాయి. పోలీసు కాల్పుల్లో ప్రజలు మరణించారు. చివరికి డిసెంబర్ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేస్తూ ప్రధాని నెహ్రూ ప్రకటన చేసారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఒక్క రోజు కూడా ఆంధ్రులు మద్రాసులో రాజధాని పెట్టుకోటానికి వీల్లేదని మరునాడే వెళ్ళిపోవాలని చక్రవర్తుల రాజగోపాలాచారి తెగేసి చెప్పారు. అయితే కాకతీయులు పాలించిన వరంగల్లు రాజధానిగా బాగుంటుందని అంబేద్కర్ సూచించారు. రాజమండ్రి కూడా మంచిదేనన్నారు. విజయవాడ కమ్యూనిస్టుల కంచు కోట కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు వొప్పుకోలేదు. నెల్లూరు, చిత్తూరు నాయకులు మాకు మద్రాసు దగ్గరగా వున్న సౌకర్యం వదులుకోవాలా అని అలిగారు. కోస్తా వాళ్ళను మేము నమ్మం, రాజధాని రాయల సీమ లోనే పెట్టాలని, లేకపోతే ఆంధ్ర రాష్ట్రమే వద్దని నీలం సంజీవరెడ్డి తదితరులు ఎదురుతిరిగారు.

గత్యంతరంలేక కర్నూలు రాజధానిగా 1953 నవంబరు 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచారు. బళ్ళారి, బరంపురం, హోస్పేట, తిరువళ్ళూరు లాంటి తెలుగు ప్రాంతాలు కూడా వదులుకొని ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచారు. శ్రీరాములు మరణానంతరం ఆయన కలలుకన్న మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది..,

ఈ మహనీయుని జ్ఞాపకార్థం మద్రాసు మైలాపూరు, రాయపేట హైరోడ్డులో శ్రీరాములు అమరజీవియైన 126 నంబరు ఇంటిని ఆయన స్మృతి చిహ్నంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కాపాడు తున్నది. ఈ మహనీయుని జ్ఞాపకార్థం రాష్ట్రప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించింది. నెల్లూరు జిల్లా పేరును 2008లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు.
Great men never die

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular