
కృష్ణా జిల్లాలో రాజకీయ హత్యలు చోటు చేసుకోవడం ఆ ఈ ప్రాంత వాసులను ఆందోళనకు గురిచేస్తుంది. వైసీపీ నేత మోకా భాస్కర రావు హత్య జరిగిన కొద్ది రోజుల వ్యవధిలో నాగాయలంక మండలం పర్రచివర గ్రామంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి తాతా సాంబశివరావు హత్యకు గురయ్యాడు. ఈ రెండు హత్యలు జిల్లాలో రాజకీయాన్ని మరింత వేడెక్కించాయి. రెండు హత్యలు నేపథ్యం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినదే కావడం విశేషం.
మచిలీపట్నం మున్సిపల్ కార్పోరేషన్ 24వ వార్డుకు వైసీపీ అభ్యర్థిగా మోకా భాస్కర రావు నామినేషన్ దాఖలు చేశారు. అక్కడ టీడీపీ అభ్యర్థి నాంచారయ్యకు మోకా భాస్కరరావుకు ఎంతో కాలంగా వైరం ఉంది. ఈ నేపథ్యంలో నాంచారయ్య కొంతకాలంగా భాస్కరరావును హత్య చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. జూన్ 29న మచిలీపట్నం చేపల మార్కెట్ వద్ద కత్తితో పొడిచి హాత్య చేశారు. నాంచారయ్య మాజీ మంత్రి, టీడీపీ నాయకులు కొల్లు రవీంద్ర అనుచరుడు కావడంతో, వారి మధ్య జరిగిన సంభాషణల ఆధారంగా మాజీ మంత్రి కొల్లు అనుమతితోనే మోకా హత్య జరిగిందని పోలీసులు తేల్చారు.
హత్యకు సంబంధించిన అంశాలను నాంచారయ్య కొల్లు రవీంద్రతో పలుమార్లు ప్రత్యేకంగా సమావేశమై చర్చించానని పోలీసుల విచారణలో అంగీకరించాడు. దీంతో పోలీసులు మంత్రి కొల్లు రవీంద్రను అరెస్టు చేసేందుకు ఇంటికి వెళ్లగా ఆయన అక్కడ లేరు. దీంతో పోలీసు బృందాలు ఆయన కోసం గాలించాయి. చివరి మచిలీపట్నం నుంచి విశాఖపట్నం వెళుతుండగా మధ్యలో అరెస్టు చేశారు. టీడీపీ నాయకులు ఈ అరెస్టును ఖండిస్తున్నారు.
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఆయన అనుచరుడు నాంచారయ్య, హాత్యకు గురైన మోకా భాస్కరరావులు బీసీ (మత్స్యకార) సామాజిక వర్గానికి చెందిన వారు. వైసీసీ అధికారంలోకి రావడంతో మంత్రి పేర్ని నాని అండతో భాస్కరరావు ఆ సామాజిక వర్గంలో పట్టు పెంచుకునే యత్నంలో ఉన్నారు. దీంతో ప్రత్యర్థి నాంచారయ్య, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తమకు రాజకీయంగా సమస్యలు ఉంటాయని భావించి ఈ హత్యకు పాల్పడ్డారని పోలీసులు విచారణలో వెల్లడైంది. మొబైల్ ఫోన్లో నిందితులు మాజీ మంత్రితో మాట్లాడిన వివరాలు.. కాల్ డేటా, మాజీ మంత్రి పిఏతో మాట్లాడిన వివరాలు పోలీసులు సేకరించి కొల్లు ప్రోద్భలంతోనే హత్య జరిగిందనే నిర్ధారణకు వచ్చారు. మాజీ మంత్రి అరెస్ట్ తో మోకా హత్యోదంతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మరో ఘటనలో అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని నాగాయలంక మండలంలోని పర్రచివర గ్రామ ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తాతా సాంబశివరావు ద్విచక్ర వాహనంపై నాగాయలంక నుంచి పేద గౌడపాలెం వెళుతుండగా మేరకాపాలెం వద్ద మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశారు. ఇది వైసీపీ నాయకుల పనే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కేసు విచారణ సాగుతోంది. రెండు సంఘటనలు మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. ఈ రెండు హత్యలు జిల్లాలో ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేశాయి.