Kolkata Doctor Case: కోల్ కతా లోని అర్జీ కార్ ఆసుపత్రిలో ఇటీవల జూనియర్ వైద్యురాలు హత్యాచారానికి గురైంది. ఆస్పత్రి లో పనిచేస్తున్న ఓ వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ముందుగా ఆమెపై అత్యాచారం చేసి.. ఆ తర్వాత హత్య చేశాడు. ఈ వివరాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయని తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన నాటి నుంచి పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. నెలలు గడుస్తున్నాకొద్దీ ఈ కేసు మరింత సంక్లిష్టంగా మారుతున్నది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బృందం కేసు విచారణ సాగిస్తున్నప్పటికీ ఇంతవరకు పురోగతి కనిపించడం లేదు. అయితే ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ సంచలన విషయాలను వెల్లడించాడు. కోల్ కతా కోర్టు నుంచి పోలీసులు అతడిని తరలిస్తుండగా.. కీలక వ్యాఖ్యలు చేశాడు. కోల్ కతా నగర మాజీ పోలీస్ కమిషనర్ తనను అకారణంగా ఇరికించాడని ఆరోపించాడు. ఇదే విషయాన్ని బిగ్గరగా అరుస్తూ చెప్పాడు.
ఇప్పటికీ లభించని పురోగతి
కోల్ కతా ఆర్జీ కార్ ఆస్పత్రిలో ఆ ఘటన జరిగిన మూడు రోజులకు సంఘటన స్థలంలోకి కొంతమంది దూసుకు వెళ్లారు. అక్కడ ఉన్న ఆనవాళ్లను చెరిపి వేసే ప్రయత్నం చేశారు. ఆసుపత్రిలో ఉన్న అద్దాలను ధ్వంసం చేశారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. దీనిపై మమతా బెనర్జీ ప్రభుత్వం పెద్దగా చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత జూనియర్ వైద్యులు నిరసన బాట పట్టారు. హత్యాచారానికి గురైన వైద్యురాలి స్నేహితుడు సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చాడు. తన దుర్గకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరాడు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇన్ని రోజులు గడుస్తున్నా తమకు న్యాయం జరగకపోవడంతో ఆ వైద్యురాలి తల్లిదండ్రులు ఇప్పటికీ విలపిస్తూనే ఉన్నారు. అప్పట్లో మమతా బెనర్జీ ప్రభుత్వం పై వారు చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి..” మమతకు మాలాంటి ఒక కూతురు ఉంటే బాధ ఏమిటో తెలిసేదని” అప్పట్లో వారు వ్యాఖ్యానించడం కలకలం రేపింది.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ రాయ్ కోల్ కతా మాజీ పోలీస్ కమిషనర్ పై ఆరోపణలు చేయడం సంచలనం కలిగిస్తోంది. అంటే ఈ కేసులో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా? వారిని కాపాడేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నారా? అమాయకుడిని బలి పశువును చేశారా? అనే కోణాలలో జాతీయ మీడియాలో వార్తలు ప్రసారమవుతున్నాయి. మరి వీటిపై ఇంతవరకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్పందించలేదు. కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు వివరణ ఇవ్వలేదు. ” ఈ కేసు మరింత సంక్లిష్టంగా మారుతున్నది. ఈ ఘటనకు పాల్పడింది ఎవరు? అనే విషయంపై ఇప్పటికీ ఒక స్పష్టత లేకపోవడం విచారకరమని” విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.