Kohinoor Diamond:ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతీయ వజ్రం ఏదైనా ఉందంటే అది కోహినూర్ మాత్రమే. ఈ వజ్రానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఇది 1300 సంవత్సరంలో గుంటూరు జిల్లా కొల్లూరు గనుల్లో లభించిందని అంటున్నారు. ఆ తరువాత పలువురి చేతులు మారుతూ ప్రత్యేకత చాటుకుంది. అంతకంతకు దాని విలువ పెరుగుతూ రాజులు రాజ్యాలు విడిచిపెట్టే క్రమంలో దీనిని సమర్పించుకొని తమ ప్రాణాలను దక్కించుకున్నారని అంటున్నారు. కాకతీయుల కాలం నుంచి నేటి వరకు కోహినూర్ పై చర్చ జరుగుతూనే ఉంది. భారత్లోనూ రాజులు, ప్రభువులు, సుల్తాన్ల మధ్య మారిన కోహినూర్ వజ్రం.. దేశం దాటి ఇతర దేశాలకు ఎలా వెళ్లింది..? మొదట ఈ వజ్రాన్ని ఎవరు జారవిడుచుకున్నారు..? కోహినూర్ వజ్రం భారత్ నుంచి తరలివెళ్లడానికి ఓ వేశ్య కారణమా..? అంటే చరిత్రకారులు ఔననే అంటున్నారు.
కాకతీయుల కాలంలో మొదలైన కోహినూర్ వజ్రం ప్రస్తానం ప్రస్తుతం లండన్ మ్యూజియంలో భద్రంగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత విలువైనది భావిస్తున్న దీనిని దక్కించుకునేందుకు రాజులు ఎంతోమంది ఎన్నోవ్యూహాలు పన్నారు. ముఖ్యంగా భారత్ నుంచి కోహినూర్ మొదట ఇరాన్ తరలి వెళ్లిందని అంటున్నారు. ఇరాన్ తరలి వెళ్లడానికి మహ్మద్ షా చేసిన చిన్న పొరపాటే కారణమని అంటున్నారు. సౌభాగ్యాలు అనుభవించిన మహ్మద్ షా ఒకానొక సందర్భంలో ఈ వజ్ర రహస్యం ఓ వేశ్యతో ఎంజాయ్ చేస్తున్నప్పుడు చెప్పడంతో ఆమె ద్వారా లీక్ అయ్యి మన దేశం దానిని చేజార్చుకున్నట్లు చరిత్ర చెబుతోంది.
ఔరంగజేబు అలంగీర్ కోహినూర్ వజ్రాన్ని ఎప్పుడూ తన తలపాగాలో ఉంచుకునేవాడు. ఆ తలపాగా వారసత్వంగా తన మనువడు మహ్మద్ షాకు వచ్చింది. ఈయన 1702లో జన్మించారు. 17 ఏళ్ల వయసుకే మహ్మద్ షా సింహాసనంపై కూర్చున్నాడు. మహ్మద్ షా విలాసవంతమన జీవితాన్ని గడిపినట్లు ‘మెర్క్-ఎ-దిల్లీ’ అనే పుస్తకంలో వివరించారు. ఓ వైపు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మరోవైపు సంగీత ప్రదర్శనలు కొనసాగేవి. ఆయన కాలంలో పాడిన ‘మహమ్మద్ షా రంగీలా సజ్నా బిన్ కారీ బదరాయా, తన్ నా సుహానే’ అనే పాట ఇప్పటికీ వింటారు.
మహ్మద్ షా విలాసాల జీవితాన్ని గడుపుతున్న సమయంలో ఇరాన్ కు చెందిన నాదిర్ షా సైన్యం 1739లో ఖైబర్ పాస్ దాటి భారత్ లోకి ప్రవేశించింది. అయితే ఈ సమాచారాన్ని మహ్మద్ షా సైన్యం చెప్పినా.. వచ్చే వరకు చూద్దాం లే.. అన్నట్లు నిర్లక్ష్యం వహించాడు. 100 మైళ్ల దూరం వరకు రాగానే మహ్మద్ షా తన సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం కమ్మన్నాడు. మహ్మద్ షా సైన్యంలో సైనికుల కంటే వంటవాళ్లు, సంగీత కళాకారులు, కూలీలు, మిగతా ఉద్యోగులే ఉండేవారు. లక్షకంటే ఎక్కువగానే ఉండే మహ్మద్ షా సైన్యాన్ని 55 వేల నాదిర్ షా సైన్యం మూడు గంటల్లోనే ఢీకొట్టి విజేతగా నిలిచింది. దీంతో నాదిర్ షా దిల్లీ విజేతగా నగరంలోకి ప్రవేశించాడు.
ఈ క్రమంలో నాదిర్ షా సైన్యం దోపిడీకి ఎగబడింది. వీలైనన్ని వస్తువులు దోచుకొన్నారు. ఆయన దోచుకున్న సంపద విలువ 70 కోట్లు. అంటే ఇప్పుడు 156 బిలియన్లు ఉంటుంది. సుమాదు 10 లక్షల 50 వేల కోట్ల రూపాయలన్నమాట. ఇది చరిత్రలోనే అతిపెద్ద దోపిడీగా పేర్కొంటారు.
ఇక అప్పటి వరకు మహ్మద్ షా చేతిలో ఉన్న కోహినూర్ వజ్రాన్ని నాదిర్ షా తెలివిగా దోచుకున్నాడు. నాదిర్ షాకు నూరుబాయి అనే వేశ్యతో సంబంధం ఉండేది. ఓ సమయంలో నూరు భాయి ‘మీరు సేకరించిన సంపద కంటే విలువైనది మహ్మద్ షా తలపాగాలో ఉంది’ అని నాదిర్ షాకు చెబుతుంది. అప్పటికే బంధీగా ఉన్న మహ్మద్ షాతో నాదిర్ షా ఇలా అంటాడు. ‘మా ఇరాన్ లో ఓ సాంప్రదాయం ఉంది. సంతోషంగా ఉన్న సమయంలో తమ తలపాగాలు మార్చుకుంటాం.. ఈరోజు నుంచి మనం సోదరులం. మన తలపాగాలు మార్చుకుందామా..?’ అని అడుగుతాడు. దీంతో మహ్మద్ షా చేసేదేమీ లేక తలపాగాను మార్చుకుంటాడు. అలా కోహినూర్ వజ్రం భారత్ దాటి నాదిర్ షా ద్వారా ఇరాన్ వెళ్లిపోయిందని చరిత్ర కారులు చెబుతున్నారు. అక్కడి నుంచి బ్రిటీష్ వారికి చిక్కి లండన్ మరిలింది.