Kodi Kathi Case: ఐదేళ్లుగా రిమాండ్ లోనే.. కోడికత్తి శీను చేసిన పాపమేంటి?

జగన్ విపక్ష నేతగా ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా విజయనగరంలో పాదయాత్ర చేసిన సమయంలో సిబిఐ వారాంతపు విచారణకు హాజరయ్యేందుకు 2018 అక్టోబర్ 25న హైదరాబాద్ బయలుదేరారు.

Written By: Dharma, Updated On : October 25, 2023 8:43 am

Kodi Kathi Case

Follow us on

Kodi Kathi Case: కోడి కత్తి కేసు.. గుర్తింది కదూ.. అప్పుడే ఈ కేసుకు ఐదేళ్లు పూర్తయింది. కానీ ఆ కేసులో నిందితుడు మాత్రం.. ఇప్పటికీ రిమాండ్ ఖైదీ గానే ఉండడం విశేషం. ఇందులో కుట్ర కోణం ఉందని చెబుతున్న బాధితుడు, ఏపీ సీఎం జగన్ ఈ ఐదేళ్లలో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా కోర్టు విచారణకు హాజరు కాలేదు. ముఖ్యమంత్రిగా క్షణం తీరిక లేకుండా ఉండడం వల్లే విచారణకు హాజరు కాలేకపోతున్నానని కోర్టుకు ఆయన స్పష్టం చేస్తున్నారు.దీంతో నిందితుడు జైలులోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.

జగన్ విపక్ష నేతగా ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా విజయనగరంలో పాదయాత్ర చేసిన సమయంలో సిబిఐ వారాంతపు విచారణకు హాజరయ్యేందుకు 2018 అక్టోబర్ 25న హైదరాబాద్ బయలుదేరారు. విశాఖ ఎయిర్ పోర్ట్ లో జగన్ పై జనుపల్లి శ్రీనివాసరావు అనే యువకుడు కోడి కత్తితో దాడి చేశాడు. అప్పట్లో చిన్న గాయంగా చెప్పుకొని జగన్ హైదరాబాద్ వెళ్ళిపోయారు. అయితే ఆ ఘటన వెనుక కుట్ర కోణం ఉందని.. జగన్ ను అంతం చేసేందుకు తెలుగుదేశం పార్టీయే హత్యాప్రయత్నం చేసిందని వైసిపి ఆరోపించింది. అటు నిందితుడు సైతం జగన్ కు సానుభూతి దక్కేందుకే ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిపాడు. అందుకు తగ్గట్టుగానే జగన్కు ఎనలేని సానుభూతి దక్కింది. అధికారంలోకి రాగలిగారు.

తొలుత చిన్న దాడిగా చెప్పుకున్న జగన్.. దానిని రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారు. ఎలాగోలా అధికారంలోకి వచ్చారు. కానీ ఐదేళ్లుగా నిందితుడు జనపల్లి శ్రీనివాసరావుకి మాత్రం జైలు నుంచి విముక్తి లభించడం లేదు. ఇప్పటికీ ఆయన రిమాండ్ ఖైదీ గానే ఉన్నాడు. ఎన్ఐఏ విచారణ పూర్తి చేసి ఇందులో ఏ కుట్ర కోణము లేదని న్యాయస్థానానికి చెప్పింది. కానీ జగన్ మాత్రం లోతైన విచారణ జరపాలని కోరుతున్నారు. అసలు కుట్రే లేని కేసులో లోతైన దర్యాప్తు అవసరం లేదని ఎన్ఐఏ చెబుతోంది. ఈ ఐదేళ్లలో జగన్ ఒక్కసారి కూడా విచారణకు రాలేదు. అటు నిందితుడికి బెయిల్ దక్కకుండా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారన్న అపవాదు సైతం ఉంది.

నిందితుడు శ్రీనివాసరావు దళిత యువకుడు. వైసిపి వీరాభిమాని. జగన్ కు సానుభూతి దక్కాలనే తాను కోడి కత్తితో దాడి చేసినట్లు చెబుతున్నాడు. ఈ కేసు విచారణ విజయవాడ కోర్టు నుంచి విశాఖకు మారింది. ఈ దాడి వెనుక వైసిపి పక్క వ్యూహం ఉందని నిందితుడు తరపు న్యాయవాది చెబుతున్నారు. మంత్రి బొత్స మేనల్లుడు మధ్య శ్రీనివాసరావు ఈ కోడి కత్తిని సమకూర్చారని బాహటంగానే ఆయన వ్యాఖ్యానించారు. అటు నిందితుడు తల్లి, సోదరుడు సీఎం జగన్ ను కలిసేందుకు పలుమార్లు ప్రయత్నించారు కానీ.. పోలీసులు అడ్డుకున్నారు. అటు న్యాయస్థానాల్లో నిరుపేద కుటుంబం పోరాటం చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. రిమాండ్ ఖైదీగానే ఐదేళ్లపాటు నిందితుడు జైల్లో గడపడం విశేషం.