బీజేపీ సీఎం కేండిడేట్ కిష‌న్ రెడ్డి..?

తెలంగాణ రాజ‌కీయాల్లో వేగ‌వంత‌మైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక‌రిని చూసి మ‌రొక‌రు ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తున్నారు. ద‌క్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ‌పై జాతీయ పార్టీలు ప్ర‌త్యేక‌మైన దృష్టి సారించాయి. రాజ‌కీయ సేద్యానికి తెలంగాణ మాగాని మంచి అదునుమీద ఉండ‌డంతో.. త‌మ పంట పండించుకునేందుకు పార్టీలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఇప్ప‌టికే.. కాంగ్రెస్ తురుపు ముక్క‌గా భావిస్తున్న‌ రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ప్ర‌క‌టించింది. దీంతో.. కాంగ్రెస్ లో జోష్‌పెర‌గ‌డంతోపాటు రాష్ట్రంలోని పొలిటిక‌ల్ వెద‌ర్ లో ఛేంజ్ వ‌చ్చింది. ఇది […]

Written By: Bhaskar, Updated On : July 8, 2021 4:21 pm
Follow us on

తెలంగాణ రాజ‌కీయాల్లో వేగ‌వంత‌మైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక‌రిని చూసి మ‌రొక‌రు ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తున్నారు. ద‌క్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ‌పై జాతీయ పార్టీలు ప్ర‌త్యేక‌మైన దృష్టి సారించాయి. రాజ‌కీయ సేద్యానికి తెలంగాణ మాగాని మంచి అదునుమీద ఉండ‌డంతో.. త‌మ పంట పండించుకునేందుకు పార్టీలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఇప్ప‌టికే.. కాంగ్రెస్ తురుపు ముక్క‌గా భావిస్తున్న‌ రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ప్ర‌క‌టించింది. దీంతో.. కాంగ్రెస్ లో జోష్‌పెర‌గ‌డంతోపాటు రాష్ట్రంలోని పొలిటిక‌ల్ వెద‌ర్ లో ఛేంజ్ వ‌చ్చింది. ఇది మ‌రింత బ‌ల‌ప‌డితే.. ఇన్నాళ్లూ టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ అన్న‌ట్టుగా ఉన్న ప‌రిస్థితి.. టీఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్ అన్న‌ట్టుగా మారుతుంది. ఇదే జ‌రిగితే బీజేపీ ఆశ‌ల‌కు గండి ప‌డ‌డం ఖాయం. అందుకే ఈ ప‌రిస్థితిని మార్చేందుకు చ‌క్రం తిప్పింది బీజేపీ.

కేంద్ర స‌హాయ మంత్రిగా ఉన్న కిష‌న్ రెడ్డిని కేంద్ర మంత్రిని చేసింది. హోంశాఖ స‌హాయ మంత్రి నుంచి.. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక‌, ఈశాన్య అభివృద్ధి శాఖ‌ల మంత్రిగా నియ‌మించింది. బీజేపీ త‌ర‌పున కేంద్ర మంత్రివ‌ర్గంలో పూర్తిస్థాయి సీటు ద‌క్కించుకున్న తొలి మంత్రి కిష‌న్ రెడ్డి. హోం శాఖ స‌హాయ‌ మంత్రిగా కిష‌న్ రెడ్డి ప‌నితీరు ప‌ట్ల బీజేపీ అధిష్టానం హ్యాపీ ఉంద‌ని, అందుకే.. పూర్తిస్థాయి మంత్రిని చేశార‌ని చెబుతున్నారు. కానీ.. అస‌లు వ్యూహం మాత్రం తెలంగాణ‌ను దృష్టిలో పెట్టుకునే అని అంటున్నారు.

ద‌క్షిణాదిన బీజేపీకి పెద్ద‌గా బ‌లం లేద‌న్న సంగ‌తి తెలిసిందే. ఎంతో కాలం పోరాటం త‌ర్వాత క‌ర్నాట‌క‌లో తిష్ట‌వేయ‌గ‌లిగింది. కానీ.. మిగిలిన రాష్ట్రాలు కొర‌క‌రాని కొయ్య‌గా మారాయి. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో త‌మిళ‌నాట, కేర‌ళ‌లో దారుణ ప‌రాభ‌వ‌మే మిగిలింది. అందుకే.. అవ‌కాశం ఉన్న తెలంగాణ‌లో ప‌ట్టు పెంచుకోవాల‌ని చూస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికలలో 4 ఎంపీ సీట్లు (ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్) గెలుచుకోవ‌డంతోపాటు.. దుబ్బాక ఉప ఎన్నిక‌, జీహెచ్ఎంసీలో స‌త్తా చాట‌డం వంటి ఫ‌లితాల‌తో.. ఇక మిగిలింది రాష్ట్రంలో అధికార‌మే అన్న‌ట్టుగా సాగుతోంది.

ఇలాంటి ప‌రిస్థితుల్లో.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని ప్ర‌క‌టించ‌డంతో.. బీజేపీ బ‌లం ప‌డిపోకుండా.. కిష‌న్ రెడ్డిని కేంద్ర మంత్రిగా చేస్తూ.. భ‌విష్య‌త్ నేత‌గా ప్ర‌మోట్ చేసింద‌ని అంటున్నారు. నిజానికి తెలంగాణ‌లో బీజేపీ త‌ర‌పున కేసీఆర్ ను ఢీకొనే బ‌ల‌మైన నేత ఎవ‌రూ లేర‌న్న‌ది వాస్త‌వం. బండి సంజ‌య్ ఒక్క‌డే ధీటుగా ప్ర‌య‌త్నిస్తున్నా.. అది స‌రిపోవ‌ట్లేదు. అందుకే.. సీనియ‌ర్ నేత‌గా ఉన్న కిష‌న్ రెడ్డిని మ‌ళ్లీ ప్ర‌మోట్ చేస్తోంద‌ని అంటున్నారు. ఇప్పుడు కేంద్రం మంత్రిని చేయ‌డం ద్వారా.. రాబోయే ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి అని సందేశం ఇచ్చింద‌ని అంటున్నారు.

కిష‌న్ రెడ్డికి మంత్రి ప‌దవి ప్ర‌క‌టించ‌డంతో హుటాహుటిన బండి సంజ‌య్ ఢిల్లీ వెళ్లి కిష‌న్ రెడ్డిని అభినందించారు. కేంద్ర మంత్రిగా ప‌ద‌వి ద‌క్క‌డం తెలంగాణ‌కు ద‌క్కిన గౌర‌వ‌మ‌ని, కేంద్రం తెలంగాణ‌పై చూపిస్తున్న ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌కు నిద‌ర్శ‌నం అని అన్నారు. దీంతో.. బండి సైతం కిష‌న్ రెడ్డి త‌ర్వాత‌నే అని అంగీక‌రించార‌నే చ‌ర్చ కూడా సాగుతోంది. మొత్తానికి తెలంగాణ‌లో స‌రికొత్త రాజ‌కీయం మొద‌లైంది. మ‌రి, ఇది రానున్న రోజుల్లో ఏవైపుగా సాగుతుంది?ఎవ‌రి వ్యూహం స‌క్సెస్ అవుతుంది? అన్న‌ది చూడాలి.