
దేశంలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్ మనీ అమలు చేయాలని గతంలో కోరిన సంగతి తెల్సిందే. రాజ్యాంగంలో హెలికాప్టర్ మనీ గురించి స్పష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై మీడియాలో పలురకాల చర్చలు కూడా జరిగాయి. తాజాగా హెలికాప్టర్ మనీపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు హెలికాప్టర్ మనీ సాధ్యకాదని తేల్చిచెప్పారు. ఒక్క రాష్ట్రం కోరితే హెలికాప్టర్ మనీ ఇవ్వడం కుదరదని.. అన్ని రాష్ట్రాలు ఒప్పుకుంటేనే అది సాధ్యమవుతుందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ మాత్రమే ఉందని.. ఆర్థిక ఎమర్జెన్సీ కాదని ఆయన స్పష్టం చేశారు.
దేశంలో కరోనాను ఎలా కట్టడి చేయాలన్నదే ప్రధాన అంశమని అన్నారు. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో అప్పులు ఇచ్చే అవకాశాలు కనబడటం లేదని తెలిపారు. మర్కజ్ సంఘటన అనంతరం దేశంలో కరోనా కేసులు పెరగాయన్నారు. మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తుందన్నారు. వలస కార్మికుల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడి ప్రజలు అక్కడే ఉండాలన్నారు. సరిహద్దులు దాటేందుకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. వలస కార్మికుల కోసం ప్రభుత్వం ఇప్పటికే 12వేల కోట్ల రూపాయాలను విడుదల చేసిందని ఆయన తెలిపారు. జనసాంద్రత ఎక్కువ పట్టణాల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కాగా కేంద్రీయ రిజర్వ్ పోలీసు దళంలో ప్రత్యక్షంగా నియమించబడిన గెజిటెడ్ అధికారుల 51వ బ్యాచ్ ఇ-పాసింగ్ అవుట్ పరేడ్‌ను ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. శాంతిభద్రతలను కాపాడటంలో, తిరుగుబాటు, ఉగ్రవాద వ్యతిరేక కార్యాకలాపాలను ఎదుర్కోవడంలో సీఆర్‌పీఎఫ్ సమర్థవంతంగా పని చేస్తుందని కొనియాడారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిని ఆయన అభినందించారు.