Puvvada Ajay Kumar: మీకు ఇష్టం లేకున్నా .. మీ మద్దతు నాకే.. సీపీఐకి.. బీఆర్ఎస్ మంత్రి దిమ్మ తిరిగే షాక్

కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో కమ్యూనిస్టులను దగ్గర తీసే పరిస్థితులు లేవు. భారతీయ జనతా పార్టీతో సైద్ధాంతిక పరమైన వైరం ఉండడం వల్ల కమ్యూనిస్టులు వారితో కలిసే పరిస్థితులు లేవు.

Written By: K.R, Updated On : September 7, 2023 1:02 pm

Puvvada Ajay Kumar

Follow us on

Puvvada Ajay Kumar: సాధారణంగా మనం ఇష్టంగా నిర్మించిన ఇంట్లోకి వేరొకరు రావాలంటే.. మన అనుమతి తప్పనిసరి. మన అనుమతి లేకుండా ఇంట్లోకి వచ్చి..లివింగ్ రూమ్ లో కాఫీ లేదా టీ తాగితే ఎలా ఉంటుంది? ఒళ్ళు మండుతుంది. వచ్చినవాడిని మెడపట్టి బయటికి గెంటేయాలి అనిపిస్తుంది. కానీ ఈ అధికారం ప్రస్తుతం సిపిఐ కి లేకుండా పోయింది. ఆ నాయకుల పరిస్థితి చూసి ఇప్పుడు జాలి పడటం తప్ప చేసేదేమీ లేదు. మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్ తన అవసరం మేరకు వాడుకున్నాడు. ఇండియా కూటమిలో చేరారని చెప్పి దూరం పెట్టాడు. వాస్తవానికి కెసిఆర్ పిలవగానే వెళ్లడం కమ్యూనిస్టులు చేసిన మొదటి తప్పు. మునుగోడులో వారు తటస్థంగా ఉంటే అధికార పార్టీకి ఫలితం వేరే విధంగా వచ్చేది. అప్పుడు ఎన్నికల్లో కమ్యూనిస్టుల కోసం కేసీఆర్ ఒక మెట్టు దిగాల్సిన పరిస్థితి ఏర్పడేది. కానీ అలాంటి అవకాశం కేసీఆర్ కు ఇవ్వకుండా.. పిలవగానే కమ్యూనిస్టులు వెళ్లారు. అవసరం తీరాక కేసీఆర్ మెడపట్టి బయటికి గెంటేశాడు. ఒక్క సీటు కూడా ఇవ్వను పొమ్మని చెప్పాడు. దీంతో కన్నీటి పర్యంతం అవడం తప్ప కమ్యూనిస్టు పార్టీలు చేసేది ఏమీ లేదు.

కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో కమ్యూనిస్టులను దగ్గర తీసే పరిస్థితులు లేవు. భారతీయ జనతా పార్టీతో సైద్ధాంతిక పరమైన వైరం ఉండడం వల్ల కమ్యూనిస్టులు వారితో కలిసే పరిస్థితులు లేవు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని కమ్యూనిస్టులు ప్రకటించినప్పటికీ ఆ పార్టీ నుంచి సానుకూల సంకేతాలు రావడం లేదు. దీంతో రెంటికి చెడ్డ రేవడి సామెత లాగా కమ్యూనిస్టుల పరిస్థితి మారిపోయింది. తరచూ భావసారూప్యత ఉన్న పార్టీలకు మద్దతు ఇస్తుండడంతో కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం సడలిపోతోంది. ఈ క్రమంలో రాష్ట్ర నాయకత్వం చెప్పినా పట్టించుకునే పరిస్థితుల్లో కిందిస్థాయి నాయకత్వం లేదు.

ఇటీవల ఖమ్మంలో భారత రాష్ట్ర సమితికి చెందిన కార్యకర్తల సమావేశం జరిగింది. దీనికి రవాణా శాఖ మంత్రి, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఖమ్మంలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడారు. ఆ తర్వాత సిపిఐ మద్దతు తనకే ఉంటుందని ప్రకటించారు. వాస్తవానికి మునుగోడు ఉప ఎన్నికల తర్వాత సిపిఐ నాయకులను భారత రాష్ట్ర సమితి దూరం పెట్టింది. సీట్ల కేటాయింపులో వారికి రిక్తహస్తం చూపించింది. అయినప్పటికీ తన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు సిపిఐ లో ఉన్నాడు కాబట్టి.. వారి మొదటి తనకే లభిస్తుందని పువ్వాడ అజయ్ కుమార్ ప్రకటించారు. కానీ ఇదే విషయాన్ని సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ ఖండించారు. ఈ పరిస్థితుల్లో తాము భారత రాష్ట్ర సమితికి మద్దతు ఇవ్వబోమని ప్రకటించారు. పువ్వాడ నాగేశ్వరరావు కొడుకు అయినంత మాత్రాన తాము మద్దతు ఎలా ఇస్తామని ఆయన ప్రశ్నించారు. పువ్వాడ నాగేశ్వరరావు ను పార్టీ నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే నారాయణ చేసిన వ్యాఖ్యలు సిపిఐ లో కలకలం రేపాయి. వాస్తవానికి జాతీయ నాయకత్వానికి ఒక దిశ దశ అంటూ లేదు. బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీతో ఆ పార్టీ వర్గాలు పోరాడుతున్నాయి. ఇక మమతా బెనర్జీ, సిపిఐ ఇండియా కూటమిలో ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో జాతీయ నాయకుడిగా ఉన్న నారాయణ మాటలను రాష్ట్ర కార్యవర్గం అంగీకరిస్తుందా? కమ్మ సామాజిక వర్గానికి చెందిన పువ్వాడ నాగేశ్వరరావును తొలగిస్తుందా? అజయ్ కి మద్దతు ఇవ్వకుండా ఉండగలుగుతుందా? ఈ ప్రశ్నలకు సిపిఐ సమాధానం చెప్పలేదు. సమాధానం చెబితే అది సిపిఐ ఎందుకతుంది?!