Daggubati Purandeswari: విశాఖపై పురందేశ్వరి గురి.. బాలకృష్ణ అల్లుడికి షాక్

చంద్రబాబుతో విభేదాలు తర్వాత దగ్గుబాటి కుటుంబం కాంగ్రెస్ పార్టీకి చేరువైంది. 2004లో అధికారంలోకి వచ్చిన వైయస్ రాజశేఖర్ రెడ్డి పురందేశ్వరిని కాంగ్రెస్ గూటికి చేర్పించడంలో సఫలీకృతులయ్యారు.

Written By: Dharma, Updated On : September 7, 2023 1:04 pm

Daggubati Purandeswari

Follow us on

Daggubati Purandeswari: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పక్కా పొలిటికల్ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా చట్టసభలకు ఎన్నికవ్వాలని భావిస్తున్నారు. ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. గత తొమ్మిదేళ్లుగా ఆమె ఏ పదవి లేకుండా ఉన్నారు. అందుకే ఈసారి గట్టిగా కొట్టాలని భావిస్తున్నారు.

చంద్రబాబుతో విభేదాలు తర్వాత దగ్గుబాటి కుటుంబం కాంగ్రెస్ పార్టీకి చేరువైంది. 2004లో అధికారంలోకి వచ్చిన వైయస్ రాజశేఖర్ రెడ్డి పురందేశ్వరిని కాంగ్రెస్ గూటికి చేర్పించడంలో సఫలీకృతులయ్యారు. 2009లో విశాఖపట్నం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన పురందేశ్వరి గెలుపొందారు. ఎన్టీఆర్ కుమార్తె అన్న మార్కు కలిసి వచ్చింది. అప్పటికే కావూరి సాంబశివరావు వంటి సీనియర్లు ఉన్నా.. వారిని కాదని పురందేశ్వరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. అయితే రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో మసకబారింది. దీంతో 2014 ఎన్నికల ముందు ఆమె బిజెపిలో చేరారు. టిడిపి తో పొత్తులో భాగంగా ఎంపీ టిక్కెట్ను దక్కించుకున్నారు. కానీ ఆమెకు ఓటమి ఎదురైంది.

గత తొమ్మిది సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నా నామినేటెడ్ పోస్ట్ అంటూ దక్కలేదు. ఒకానొక దశలో ఆమె టిడిపిలో చేరతారని ప్రచారం జరిగింది. ఇంతలో బిజెపి హై కమాండ్ ఆమెకు ఏపీ బాధ్యతలను అప్పగించింది. ఈ తరుణంలో రాజకీయంగా మరోసారి పునాదులు వేసుకోవాలని పురందేశ్వరి భావిస్తున్నారు. తనకు అచ్చొచ్చిన విశాఖ పార్లమెంటు స్థానంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో బిజెపికి పొత్తు కుదురుతుందని పురందేశ్వరి నమ్మకం పెట్టుకున్నారు. ఆమె వ్యవహార శైలి సైతం టిడిపితో అనుకూలంగా ఉంది. దీంతో ఆమె విశాఖ సీటు మీద కన్నేశారు. అక్కడ టిడిపి అభ్యర్థిగా బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ ఉన్నారు. కుటుంబ వ్యవహారం కావడం, ఆపై బీజేపీతో పొత్తు ఉండాలంటే పురందేశ్వరి కీలకం కావడంతో విశాఖ లోక్సభ స్థానాన్ని ఆమె కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది.

విశాఖ లోక్సభ స్థానంపై ఎప్పటినుంచో బిజెపి సీనియర్ నాయకుడు జీవీఎల్ మనసు పారేసుకున్నారు. అయితే ఆయనకు బిజెపిలో పరపతి ఉండవచ్చు కానీ.. పొత్తు పరంగా చంద్రబాబు సపోర్ట్ పురందేశ్వరికి ఉంటుంది. బిజెపితో పొత్తుకు పురందేశ్వరి కీలకంగా మారిన నేపథ్యంలో.. ఆమెని ఎంపీగా గెలిపిస్తే కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లిపోతారన్నది చంద్రబాబు భావన. అందుకే పొత్తులో భాగంగా విశాఖ లోక్సభ స్థానాన్ని బిజెపికి కేటాయించి.. ఆ స్థానం నుంచి పురందేశ్వరి పోటీ చేసేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ పొత్తు కుదిరితే మాత్రం.. పురందేశ్వరి భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయం.