Homeఅంతర్జాతీయంCanada: హిందువులూ.. దేశం వదిలి వెళ్ళి పోవాలని హుకుం

Canada: హిందువులూ.. దేశం వదిలి వెళ్ళి పోవాలని హుకుం

Canada: కెనడాలోని హిందువులంతా స్వదేశానికి వెళ్లిపోవాలంటూ ఖలిస్థానీ ఉగ్రవాది బెదిరిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో కలకలం రేపుతోంది. సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్ జే) అధినేత గురుపత్వాంత్‌ సింగ్‌ పన్నూన్‌ ఈ వీడియోలో కనిపించారు. ఖలిస్థానీ సంస్థ అయిన ఎస్‌ఎఫ్ జే పై భారత్‌లో నిషేధం ఉంది. ‘కెనడాలోని భారత సంతతి హిందువులారా! కెనడా రాజ్యాంగాన్ని, కెనడాతో అనుబంధాన్ని మీరు తిరస్కరిస్తున్నారు. మీ గమ్యస్థానం భారత్‌ అయినప్పుడు మీరంతా అక్కడికే వెళ్లిపోండి. ఖలిస్థానీ అనుకూల సిక్కులు ఎల్లప్పుడూ కెనడాకు విధేయులే. కెనడా రాజ్యాం గం, చట్టాలకు వారు మద్దతుదారులుగా ఉన్నారు’ అని పన్నూన్‌ ఆ వీడియోలో అనడం వినిపించింది.

కాగా, కెనడాలో ఉన్న ఓ సిక్కు పౌరుడు హత్యకు గురికావడం, అనంతరం ఆ దేశ అధ్యక్షుడు ట్రూడో భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్య లు చేయడం.. ఆ హత్య వెనుక భారత్‌ ప్రమేయం ఉన్నట్టు మా ట్లాడటం కలకలం రేపింది. అయితే భారత్‌తో తలపడడం ద్వారా కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో నిప్పుతో చెలగాటమాడుతున్నారని అమెరికా భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాశ్చాత్య దేశాలకు ఆసియా-పసిఫిక్‌లో భారత్‌ అత్యంత వ్యూహాత్మక భాగస్వామి అని.. వేర్పాటువాద ఖలిస్థానీ నేత హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌ హత్యను ఆ దేశంతో ముడిపెట్టడం సిగ్గుమాలిన చర్య అని, అనుమానించదగిన విషయమని అమెరికన్‌ ఎంటర్‌ప్రైజ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సీనియర్‌ ఫెలో మైకేల్‌ రూబిన్‌ వ్యాఖ్యానించారు. నిషిద్ధ ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ నేత నిజ్జర్‌ హత్య గురించి బహిరంగంగా మాట్లాడిన ట్రూడో.. అదే కెనడాలో పాకిస్థాన్‌ సహకారంతో జరిగిన బలూచిస్థాన్‌ నేత కరీమా బలూచ్‌ హత్యను మాత్రం పోలీసులకు సంబంధించిన అంశమని అనడం దారుణమని చెప్పారు.

జీ-20కి ముందే..

భారత్‌పై విషప్రచారానికి ట్రూడో జి-20 సదస్సుకు ముందే ప్రయత్నించినట్లు వెలుగులోకి వచ్చింది. ‘ఫైవ్‌ ఐ’ దేశాల (అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే, న్యూజిలాండ్‌) అధికారులు అంతర్గత చర్చ లు జరిపిన తరుణంలో.. నిజ్జర్‌ హత్యపై ఇండియాను నిందించాలని కెనడా అధికారులు కోరగా.. ఆయా దేశాల యంత్రాంగాలు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చాయని ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ పత్రిక పేర్కొంది. ఢిల్లీలో జి-20 కూటమి భేటీని ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారని.. ఈ పరిస్థితుల్లో మిత్రదేశమైన భారత్‌ను ఇందులోకి లాగడం తగదని అమెరికా యంత్రాంగం హితవు పలికినట్లు తెలిపింది. జి-20 భేటీలో ట్రూడోతో ద్వైపాక్షిక భేటీకి మోదీ నిరాకరించడం.. కూటమిలోని మిగతా నేతలు సైతం ఆయనతో అంటీముట్టనట్లు వ్యవహరించడంతో కెనడాలో విపక్షాలు ఆయన అసమర్థతను తూర్పారబట్టాయి.

కెనడాలో జరభద్రం

కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు, రాజకీయ విద్వేష నేరా లు, హింసాత్మక చర్యలు పెచ్చరిల్లుతున్నాయని విదేశాంగ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. అక్కడ ఉంటు న్న భారత పౌరులు, విద్యార్థులు అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని హెచ్చరిక చేశారు. కాగా, కెనడాలో ఉంటున్న పంజాబీ సింగర్‌ శుభ్‌ భారత పర్యటన రద్దయింది. ఖలిస్థానీ ఉద్యమానికి మద్దతుగా ఆయన సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడంతో భారత్‌లో నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో నిర్వాహకులు ఆయన ముంబై కచేరీని రద్దు చేశారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular