Skill Development Case: స్కిల్ స్కాం లో కీలక మలుపు.. సిఐడి పై పీవీ రమేష్ అనుమానం

సిఐడి రూపొందించిన ఎఫ్ఐఆర్లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఐ వై ఆర్ కృష్ణారావు, పివి రమేష్ పేరును సిఐడి ప్రత్యేకంగా ప్రస్తావించింది.

Written By: Dharma, Updated On : September 11, 2023 6:41 pm

Skill Development Case

Follow us on

Skill Development Case: చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో కీలక మలుపు. ఏ అధికారి వివరణను కార్నర్ చేసుకొని.. సిఐడి చంద్రబాబుపై కేసు నమోదు చేసిందో.. సదరు అధికారి ఇప్పుడు సిఐడి తీరును తప్పుపడుతున్నారు. సీఎంగా ఉండే వారికి ఏం సంబంధం? అన్ని అధికారులే చూస్తారు అంటూ తేల్చి చెబుతున్నారు. సిఐడి తీరుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాను ఒకటి చెబితే.. సిఐడి తనకు అనుకూలంగా మార్చుకుందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇంతకీ ఆయన ఎవరంటే మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్. చంద్రబాబు హయాంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారిగా పని చేశారు. మొన్నటి వరకు సీఎం జగన్ కు అత్యంత సన్నిహిత ఐఏఎస్ అధికారిగా వ్యవహరించారు.

సిఐడి రూపొందించిన ఎఫ్ఐఆర్లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఐ వై ఆర్ కృష్ణారావు, పివి రమేష్ పేరును సిఐడి ప్రత్యేకంగా ప్రస్తావించింది. అయితే నా వాంగ్మూలం ఆధారంగా 14 ఏళ్లు చాలా బాగా పనిచేసిన సీఎంపై కేసు పెట్టమనడం ఏమిటి అని తాజాగా ఆయన ప్రశ్నించడం వైరల్ గా మారింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఈ మాజీ ఐఏఎస్ అధికారి చేసిన వ్యాఖ్యలు కొత్త సంచలనానికి కారణం అవుతున్నాయి. పివి రమేష్ ఇచ్చిన లిఖితపూర్వక సమాచారమే చంద్రబాబు కేసులో కీలకమని వార్త వైరల్ అవుతున్న నేపథ్యంలో.. ఆయన ఈటీవీ కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.

స్కిల్ స్కాం కేసులో అసలు చర్యలు తీసుకోవాలి అంటే ముందుగా అరెస్టు చేయాల్సింది స్కిల్ డెవలప్మెంట్ ఎండి, కార్యదర్శులు అని పివి రమేష్ తేల్చి చెబుతున్నారు. వారి పేర్లు నిందితుల జాబితాలో ఎందుకు లేవని ప్రశ్నిస్తున్నారు. తన స్టేట్మెంట్ ఆధారంగానే కేసు పెట్టారు అనడం దిగ్భ్రాంతికరమని.. తన వాంగ్మూలంతో చంద్రబాబును అరెస్టు చేశారని హాస్యాస్పదమని స్పష్టం చేశారు. తాను అప్రూవర్ గా మారానన్న ప్రచారం అవాస్తవమని.. క్రిమినల్స్, తప్పు చేసిన వాళ్ళు మాత్రమే అప్రూవర్లుగా మారతారని గుర్తు చేశారు. అసలు ఫైలే లేకుండా కేసులు ఎలా పెడతారు అని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఆర్థిక శాఖ ఏ తప్పు చేయలేదని పివి రమేష్ స్పష్టం చేశారు.

తాను సిఐడి కి వాంగ్మూలం ఇచ్చిన మాట వాస్తవమేనని చెప్పుకొచ్చారు. నేను చెప్పింది సిఐడి తనకు అనుకూలంగా మార్చుకుందని రమేష్ అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈటీవీ ఇంటర్వ్యూ అనంతరం ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు రమేష్ కుమార్ ప్రకటించారు. కానీ సిఐడి నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వాయిదా వేసినట్లు తెలుస్తోంది. పివి రమేష్ ఒక్క స్టేట్మెంట్తో కేసు నడవదని.. తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని సిఐడి చెబుతోంది. పివి రమేష్ ఇంటర్వ్యూ దర్యాప్తును ప్రభావితం చేసేదిగా ఉందని సిఐడి భావిస్తోంది. దీంతో పివి రమేష్ ను సిఐడి టార్గెట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ గా మారుతోంది. సిఐడి చంద్రబాబుపై ఉద్దేశపూర్వకంగానే కేసులు నమోదు చేసినట్లు ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.