YCP: వైసీపీలో ఉక్కపోత ప్రారంభమైంది. గత ఎన్నికలకు ముందు, తరువాత పార్టీలో చేరిన వారు ఇప్పుడు బయటకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. గత ఎన్నికల సమయంలో ఐప్యాక్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అప్పటి టిడిపి ప్రభుత్వం పై వ్యతిరేకత కనబరిచిన నాయకులందరినీ వైసీపీలో చేర్పించింది. బడా నాయకుల నుంచి, ద్వితీయ శ్రేణి నేతల వరకు వైసీపీలోకి క్యూ కట్టారు. అటు ఎన్నికల తర్వాత సైతం ఈ చేరికల పరంపర కొనసాగింది. చివరకు నలుగురు టిడిపి ఎమ్మెల్యేలను సైతం వైసిపి ప్రలోభ పెట్టి లాగేసుకుంది. అయితే నాటి పరిణామాల సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు ప్రారంభమయ్యాయి. వైసీపీని కలవరపెడుతున్నాయి.
తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలన్న భావనతో.. అవసరం లేకున్నా నలుగురి ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. కానీ ఇప్పుడు ఆ నలుగురు ఎమ్మెల్యేల వల్ల వైసీపీలో ఎప్పటినుంచో ఉన్న నాయకులు బయటకు వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. గన్నవరం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టిడిపి తరఫున వల్లభనేని వంశీ గెలిచారు. కానీ ఆయన్ను వైసీపీలో చేర్చుకున్నారు. ఇప్పుడు టిక్కెట్ కూడా కన్ఫర్మ్ చేశారు. దీంతో గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు టిడిపిలో చేరేందుకు సిద్ధమయ్యారు.
ప్రకాశం జిల్లా చీరాలలో కూడా సేమ్ సీన్. గత ఎన్నికల్లో ఎక్కడి నుంచి ఎమ్మెల్యేగా టిడిపి అభ్యర్థి కరణం బలరామకృష్ణ గెలుపొందారు. వైసీపీ నుంచి పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ ఓటమి చవిచూశారు. కానీ కరణం బలరాం కృష్ణను వైసీపీలో చేర్చుకున్నారు. ఆమంచి కృష్ణమోహన్ ను బలవంతంగా పర్చూరు పంపించారు. అయినా సరే చీరాల వైపే ఆమంచి కృష్ణమోహన్ చూస్తున్నారు. చివరకు వార్డు ఉప ఎన్నికను సైతం విడిచిపెట్టలేదు. తన మద్దతుదారులను నిలిపారు. కచ్చితంగా తాను చీరాల నుంచి పోటీ చేస్తానని సంకేతాలు ఇచ్చారు.జనసేన లో చేరుతారని ప్రచారం సాగుతోంది
విశాఖ దక్షిణ నియోజకవర్గంలోనూ పరిస్థితి అదే. అక్కడి నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన వాసుపల్లి గణేష్ కుమార్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నికల తర్వాత వైసీపీలోకి ఫిరాయించారు. ఆయనకు కానీ టికెట్ ఖరారు చేస్తే.. పనిచేయమని మిగతా వైసిపి నాయకులు తేల్చి చెబుతున్నారు. అటు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లో అదే పరిస్థితి. ఇక్కడ టిడిపి ఎమ్మెల్యే వైసీపీ లోకి చేరారు. ప్రస్తుతం వైసీపీ టికెట్లు నలుగురు నాయకులు ఆశిస్తున్నారు. ఎవరికిచ్చినా మిగతా ముగ్గురు తప్పకుండా వ్యతిరేకిస్తారు. మాజీ మంత్రి సిద్ధ రాఘవరావును వైసీపీ నేతలు భయపెట్టి మరి పార్టీలో చేర్చుకున్నారు. కానీ ఇంతవరకు ఆయనకు ఎటువంటి న్యాయం చేయలేదు. ఆయన ఆందోళనతో ఉన్నారు. వైసీపీ హై కమాండ్ పై రగిలిపోతున్నారు. అలాగే వైసిపి ఆవిర్భావం నుంచి ఉన్న చాలా మంది నాయకులకు అవకాశాలు దక్కకుండా పోతున్నాయి. టిడిపి నుంచి చేరిన వారే బాగుపడ్డారని.. తమకు ప్రత్యేకంగా ఒరిగేది ఏమీ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే వైసీపీకి సైడ్ ఎఫెక్ట్లు గట్టిగానే తగులుతున్నాయి.