జానారెడ్డి గెలిస్తే కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు

నాగార్జున సాగర్‌‌ ఉప ఎన్నికను ప్రస్తుతం అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే.. ఈ ఎన్నిక కాంగ్రెస్‌ పార్టీకి మాత్రం జీవన్మరణ సమస్యగా మారింది. దశాబ్దాల సీనియర్‌‌ లీడర్‌‌ అయిన జానారెడ్డి ఆ స్థానం నుంచి పోటీ చేస్తుండడంతో ఆయన గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పీసీసీ చీఫ్ పదవిపై సాగర్ ఉపఎన్నిక ఫలితం ఎక్కువగా ప్రభావం చూపించవచ్చునన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చాలా కాలంగా పీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో తాత్సారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. […]

Written By: Srinivas, Updated On : March 31, 2021 2:28 pm
Follow us on


నాగార్జున సాగర్‌‌ ఉప ఎన్నికను ప్రస్తుతం అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే.. ఈ ఎన్నిక కాంగ్రెస్‌ పార్టీకి మాత్రం జీవన్మరణ సమస్యగా మారింది. దశాబ్దాల సీనియర్‌‌ లీడర్‌‌ అయిన జానారెడ్డి ఆ స్థానం నుంచి పోటీ చేస్తుండడంతో ఆయన గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పీసీసీ చీఫ్ పదవిపై సాగర్ ఉపఎన్నిక ఫలితం ఎక్కువగా ప్రభావం చూపించవచ్చునన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చాలా కాలంగా పీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో తాత్సారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. సాగర్ ఉపఎన్నిక తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఉపఎన్నికలో సీనియర్ నేత జానారెడ్డి విజయం సాధిస్తే… పీసీసీ చీఫ్‌ పదవి ఆయనకే కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాల రీత్యా పీసీసీ పదవిపై ఏకాభిప్రాయం సాధ్యం కావట్లేదు. మొదటి నుంచి పార్టీ జెండా మోసినవారికే పీసీసీ పదవి ఇవ్వాలన్న డిమాండ్ ఒకవైపు.. ఎప్పుడొచ్చామన్న దానితో సంబంధం లేకుండా నాయకుడి ఛరిష్మాను చూసి పదవి ఇవ్వాలన్న డిమాండ్ మరోవైపు.. ఇలా రెండింటి నడుమ కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికీ ఎటూ తేల్చుకోలేకపోతుంది.

ఈ నేపథ్యంలో జానారెడ్డికి ఆ పదవికి కట్టబెడితే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని.. ఆయనైతే ఎవరూ వ్యతిరేకించరని అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాష్ట్రానికి మళ్లీ పునర్వైభవం వస్తుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. కాబట్టి సాగర్ ఉపఎన్నికలో గెలిచే పక్షంలో జానారెడ్డికే కాంగ్రెస్ పగ్గాలు అప్పగించి 2023 ఎన్నికలకు ఆయన సారథ్యంలోనే సన్నద్ధమయ్యే అవకాశం ఉంది. ఇటీవల ఢిల్లీలోని కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం టెన్ జన్‌పథ్‌లోనూ దీనిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా జానారెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే విషయమై చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేత కావడంతో జానారెడ్డికి ఆ పదవి అప్పగిస్తే కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలకు తెరపడుతుందని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏడుసార్లు ఎమ్మెల్యేగా.. సుదీర్ఘ కాలం పాటు మంత్రిగా.. గతంలో సీఎల్పీ నేతగా జానారెడ్డి పనిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సాగర్‌లో జానారెడ్డి గెలిస్తే పార్టీలోనూ ఆయనకు పెద్ద పదవి ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. ప్రస్తుతం సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క ఉన్నారు కాబట్టి.. ఆయన స్థానాన్ని కదిలించకపోవచ్చు. దళిత నేతను ఆ పదవి నుంచి తొలగించి జానారెడ్డికి ఆ పదవి అప్పగిస్తే ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు వెళ్తాయి. దీంతో పీసీసీ ఇవ్వడమే సరైందని అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్