Kesineni Family: విజయవాడ.. ఉమ్మడి రాష్ట్రంలోనూ.. అవశేష ఆంధ్రప్రదేశ్ లోనూ రాజకీయంగా విశేషంగా ప్రభావం చూపిన నగరం. రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు. ముఖ్యంగా కమ్మ సామాజికవర్గానికి అండగా నిలిచిన నగరం. అంగబలం, అర్థబలంతో నిండుగా ఉండే కమ్మరాజ్యమన్న మాట. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న నగరం. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలివీచినా.. ఇక్కడ మాత్రం టీడీపీ తట్టుకొని నలబడిందంటే దానికి ఉన్న సంస్థాగత బలం అటువంటిది. అయితే గత కొద్దిరోజులుగా విజయవాడ కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలు టీడీపీ అధినేత చంద్రబాబును కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని చర్యలతో చంద్రబాబు విసిగి వేశారిపోతున్నారు. రెండో సారి గెలిచిన తరువాత ఆయన ఏ వ్యాఖ్యలు చేస్తున్నారో తెలియని స్థితిలో ఉండడం చంద్రబాబుకు మింగుడు పడడం లేదు. నాని చర్యలతో విసిగి వేశారిపోయిన చంద్రబాబు ఆయన్ను పక్కన పడేసి ప్రత్యామ్నాయంగా ఆయన సోదరుడు చిన్నిని తెరపైకి తెచ్చారు.
మార్పు అనివార్యం..
వచ్చే ఎన్నికల్లో ఎంపీగా కేశినేని చిన్నిని టిక్కెట్ ఇచ్చి గెలిపించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. అసలే పార్టీ అధిష్టానంపై తిక్కతిక్కగా మాట్లాడుతూ వస్తున్న కేశినేని నానికి ఈ చర్యలు మరింత కోపం తెప్పించాయి. చంద్రబాబు మీద అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. అంతర్గత సమావేశాల్లో విరుచుకుపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లోటీడీపీని గెలిపించే శక్తియుక్తులేవీ చంద్రబాబు వద్ద లేవని తేల్చిచెబుతున్నారుట. అయితే ఈ విషయాలన్నింటినీ ఎప్పటికప్పుడు కొందరు ఆంతరంగీకులు చంద్రబాబు చెవిలో పడేస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో కేశినేని చిన్ని అభ్యర్థిత్వాన్ని ఖాయం చేసుకున్నారుట. నియోజకవర్గంలో పర్యటించి పార్టీని బలోపేతం చేసుకోవాలని చిన్నికి చంద్రబాబు ఆదేశించడంతో ఆయన చుట్టేస్తున్నారుట. దీంతో కేశినేని నాని మరింత రెచ్చిపోతున్నారు. చంద్రబాబుతో పాటు ఈ ఎపిసోడ్ లో కీలకంగా వ్యవహరించిన ఒకప్పటి టీడీపీ నేత సీఎం రమేష్ పై చిందులేస్తున్నారుట.
Also Read: Rupee Falling: రూపాయి పతనం ఎందాకా?
కార్పొరేషన్ ఎన్నికల తరువాత...
కేశినేని నాని టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా నిలిచారు. చంద్రబాబుకు నమ్మినబంటుగా వ్యవహరించారు. అందుకే రెండుసార్లు ఆయన ఎంపీ సీటును పొందగలిగారు. గడిచిన ఎన్నికల్లో 22 ఎంపీ స్థానాలకుగాను శ్రీకాకుళం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు నుంచి గల్లా జయదేవ్, విజయవాడ నుంచి కేశినేని నాని గెలుపొందగలిగారు. ముఖ్యంగా విజయవాడ సీటును ఎలాగైనా గెలవాలని భావించిన వైసీపీకి నాని గట్టి షాకే ఇచ్చారు. దీంతో నాని ప్రాబల్యం టీడీపీలో ఎన్నో రోజులు నిలవలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ కార్పొరేషన్ టీడీపీ మేయర్ అభ్యర్థిగా నాని కుమార్తె శ్రావ్యను టీడీపీ అధిష్టానం ప్రకటించింది. కానీ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పలేదు. అయితే టీడీపీలోని గ్రూపు రాజకీయాల వల్లే విజయవాడ కార్పొరేషన్ చేజారిపోయిందని.. తన కుమార్తె మేయర్ కాకుండా పోయారని నాని తెగ బాధపడ్డారు. అసమ్మతి నాయకులకు టీడీపీ అధిష్టానమే మద్దతు పలుకుతుందంటూ అప్పటి నుంచి నాని కీనుక వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరింత దూరమయ్యారు.
బీజేపీలో చేరతారని ప్రచారం..
ఒకానొక దశలో ఆయన బీజేపీ నాయకులకు టచ్ లోకి వెళ్లారని టాక్ నడిచింది. దాదాపు ఆయన పార్టీ మారడం ఖాయమన్న సంకేతాలు వచ్చాయి. తరువాత పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. టీడీపీలో తిరిగి యాక్టివ్ అయ్యారు. కుమార్తెను మేయర్ అభ్యర్థిగా పెట్టడానికి ఆసక్తిచూపారు. కానీ టీడీపీ ఓటమితో మాత్రం ఆయన యూటర్న్ తీసుకున్నారు. పార్టీకి అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. అంతర్గత సమావేశాల్లో మాత్రం అధినేత వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు. అయితే ఇటీవల ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము టీడీపీ నేతలతో సమావేశమైనప్పుడు మాత్రం నాని కీ రోల్ ప్లే చేశారు. తెగ హడావుడి చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ నాయకులు హాజరైన సమావేశంలో నాని కొద్దిపాటి సందడి చేశారు. అయితే ఇదంతా బీజేపీ నేతల దృష్టిలో పడేందుకేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తానికి విజయవాడ టీడీపీలో కొత్త ముసలం ఎటు దారితీస్తుందో చూడాలి మరీ.
Also Read:AP Free Ration: ఈ నెలా ఫ్రీ రేషన్ లేనట్టేనా? జగన్ సర్కారుపై కేంద్రం ఆగ్రహం