Chandrababu
Chandrababu: భారతీయ జనతా పార్టీని చంద్రబాబు వాడుకున్నట్టు.. మరి ఎవరు వాడుకోలేదు. పొత్తుల పేరిట ఆ పార్టీ నుంచి సింహభాగం ప్రయోజనాలు పొందింది ముమ్మాటికి చంద్రబాబే. ఏపీలో బిజెపి ఈ పరిస్థితికి కారణం కూడా చంద్రబాబే. అందుకే చంద్రబాబు విషయంలో బిజెపి అగ్ర నేతలు కఠినంగా ఉన్నారు. పూర్వ అనుభవాల రీత్యా చంద్రబాబును దూరం పెడుతున్నారు. ఆయన దగ్గరయ్యే ప్రయత్నాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.అందుకే రాజకీయంగా పొత్తుకు ఒత్తిడి పెరుగుతున్నా పెద్దగా పట్టించుకోవడం లేదు.
దాదాపు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఏపీలో బిజెపి బలపడాలని చూస్తోంది. ఎన్టీఆర్ టిడిపిని స్థాపించిన కొద్ది రోజుల ముందే.. జన సంఘం నుంచి భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. 1983లో అదే బిజెపి విశాఖ నగరపాలక సంస్థ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసింది. అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. మేయర్ గా బిజెపి సీనియర్ నేత డివి సుబ్బారావు ఎన్నికయ్యారు. అప్పట్లోనే అంత ప్రభావం చూపిన బిజెపి.. నేటి పరిస్థితికి ముమ్మాటికీ కారణం చంద్రబాబే. పొత్తులతో బిజెపి నుంచి ఆయాచిత లబ్ధి పొందారు. పేరుకే పొత్తులు కానీ ఒకటి, అరా సీట్లతో బిజెపిని తన కనుసనల్లోకి తెచ్చుకోగలిగారు. జాతీయస్థాయిలో వెంకయ్య నాయుడుని ప్రయోగించి దాదాపు మూడు దశాబ్దాల పాటు బిజెపిని తన కంట్రోల్లో పెట్టుకున్నారు. ఏపీలో బిజెపి అభివృద్ధిని అడుగడుగునా అడ్డు తగిలారు. ఏపీ సమాజంలో భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిగా మార్చడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు.
1995లో నందమూరి తారక రామారావు నుంచి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు హైజాక్ చేశారు. నాడు కాంగ్రెస్ పెద్దల సహకారంతో ఈ దుశ్చర్యకు దిగారు. అటు తర్వాత బిజెపి బలంతో తనకు తాను నిరూపించుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే బిజెపితోనే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. చంద్రబాబు పార్టీని హైజాక్ చేసిన తర్వాత 1998లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి ఏపీలో లభించినవి కేవలం 12 ఎంపీ సీట్లే. అప్పుడే చంద్రబాబు తన బుర్రకు పదును పెట్టారు. ఆ మరుసటి సంవత్సరం వచ్చిన సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. బిజెపికి కొద్దిపాటి సీట్లు ఇచ్చి.. తాను భారీగా లబ్ది పొందారు. 30కి పైగా ఎంపీ సీట్లు.. 150 వరకు అసెంబ్లీ సీట్లను గెలుపొందారు. ఆ ఎన్నికల్లో కానీ బిజెపి సపోర్ట్ లేకుంటే చంద్రబాబు రాజకీయ జీవితం చాప్టర్ క్లోజ్.
కానీ చంద్రబాబు బిజెపిని తన కబంధహస్తాల్లో పెట్టుకున్నారు. ఆ పార్టీ ఎదిగే ప్రయత్నాన్ని ఆదిలోనే చిదిమేశారు. బిజెపితో రాజకీయ అవసరాలను తీర్చుకున్నారు. ఎన్డీఏ కన్వీనర్ గా ఉంటూ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడేవారు. అప్పట్లో గుజరాత్ సీఎం గా ఉన్న నరేంద్ర మోడీకి చంద్రబాబు నాటకాలు అన్నీ తెలుసు. అయితే ఏపీ ప్రజల్లో బిజెపి పై ఒక రకమైన అపవాదును, మతతత్వ వాదాన్ని ప్రయోగించి ఓటు శాతాన్ని పెంచుకోకుండా చేశారు.2004 ఎన్నికల్లో ఓటమి తర్వాత భారతీయ జనతా పార్టీని కరివేపాకుల పక్కన పెట్టేశారు. 2009 ఎన్నికల్లో సైతం వామపక్షాలు, కెసిఆర్ తో మహాకూటమి పెట్టుకున్నారే తప్ప బిజెపిని పలకరించిన పాపాన పోలేదు. 2014 ఎన్నికల్లో మాత్రం మోడీ చరిష్మను చూసి మరోసారి బిజెపికి దగ్గరయ్యారు. భారతీయ జనతా పార్టీ సహకారంతో అధికారంలోకి రాగలిగారు. అయినా సరే తన కుటిల బుద్ధిని బయట పెట్టుకున్నారు. విభజన హామీల అమలులో బిజెపి ఏపీ దారుణంగా వంచిందని రాష్ట్ర ప్రజల ముందు దోషిగా నిలబెట్టారు. బిజెపిని దారుణంగా దెబ్బతీశారు. నూట కంటే ఓట్లు తగ్గించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. అందుకే చంద్రబాబు నైజాన్ని తెలిసే ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదు. చంద్రబాబు దగ్గర అవ్వాలన్న ప్రయత్నాన్ని సైతం అడ్డగిస్తూ వచ్చారు.
ప్రస్తుతం నిండా కేసులతో మునిగిపోయిన చంద్రబాబు బిజెపి తన వైపు రాదని ఒక నిర్ధారణకు వచ్చారు. ఏపీలో అచేతనంగా ఉన్న వామపక్షాలను దగ్గరకు చేర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. దేశవ్యాప్తంగా నిరాదరణకు గురైన వామపక్షాలు నిరాశా నిస్పృహలతో ఉన్నాయి. వారిని దగ్గరకు చేర్చుకోవడం ద్వారా జాతీయస్థాయిలో ఇండియా కూటమి వైపు చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. బిజెపి వచ్చిందే సరి.. లేకుంటే మాత్రం వామపక్షాలతో అడుగులు వేయడం ఖాయమని.. వారితో కలయిక కలిసి వస్తుందని అస్మదీయ సర్వేలు జరిపి ప్రజల్లో వదిలే పనిలో చంద్రబాబు ఉన్నారు.