Jagan Delhi Tour
Jagan Delhi Tour: తెలుగుదేశం పార్టీకి ఇది క్లిష్ట సమయం. అధినేత చంద్రబాబు జైల్లో బందీగా ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ స్కాం, ఫైబర్ గ్రిడ్, ఓటుకు నోటు.. ఇలా అన్ని కేసులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్ అయి దాదాపు నెల రోజులు సమీపిస్తోంది. తనను టచ్ చేయలేరని చంద్రబాబు భావించారు. అటు పార్టీ శ్రేణులు సైతం బాబు గారిని అరెస్టు చేసే దమ్ముందా అని బహిరంగంగానే వ్యాఖ్యానించేవారు. కానీ జగన్ చేసి చూపించారు. చంద్రబాబు రిమాండ్ ఖైదీగా మారి మూడు వారాలు దాటుతోంది. నాలుగో వారం ప్రవేశించింది. గంటల వ్యవధిలో బయటకు వస్తారన్న బాబు.. రోజులు, వారాలు, చివరికి నెల రోజులు దాటుతున్న బయటకు వచ్చిన దాఖలాలు కనిపించడం లేదు.ఈ తరుణంలో సీఎం జగన్ ఢిల్లీలో అడుగుపెట్టనుండడంతో తెలుగుదేశం పార్టీ నాయకుల వెన్నులో వణుకు పుడుతోంది.
సాధారణంగా సీఎం జగన్ ఢిల్లీ వెళ్తే.. తెలుగుదేశం పార్టీ నేతలు సెటైరికల్ గా మాట్లాడేవారు. అసలు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించేవారు. సీఎం జగన్ ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఆయన వ్యక్తిగత కేసుల కోసమేనని ఆరోపించేవారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో బేరం కుదుర్చుకునేందుకేనని లేనిపోని మాటలు అనేవారు. ఆయన పర్యటన అంతా వ్యక్తిగత ప్రయోజనాలకేనని ఆరోపించేవారు. అసలు ప్రధానితో ఏం చర్చించే వారని ప్రశ్నించేవారు. ఇప్పుడు సీఎం జగన్ తాజా పర్యటన పై మాత్రం టిడిపి నేతలకు నోరు పెగలడం లేదు. స్కిల్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబుకు మరింత ఉచ్చు బిగించడానికి జగన్ ఢిల్లీ వెళుతున్నారని అనుమానం సగటు టిడిపి అభిమానిని వెంటాడుతోంది.
ఈనెల 6న సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళనున్నారు. అది తెలిసింది లగాయత్తు ఎల్లో మీడియా గగ్గోలు పెడుతోంది. జగన్ ఢిల్లీ వెళ్తున్నారంటే భారీ ప్రణాళికే ఉంటుందని అనుమానిస్తోంది. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరినీ వివిధ కుంభకోణాల్లో ఇరికించే వ్యూహం పకడ్బందీగా జరుగుతోందని ప్రచారం చేస్తోంది. జగన్ తప్పకుండా ఢిల్లీ పర్యటనలో మోడీ అమిత్ షాలతో చంద్రబాబు కేసులపై చర్చిస్తారని ప్రత్యేక కథనాలు వండి వార్చుతోంది. కేంద్ర పెద్దల ప్రమయంతోనే బాబును జైలుకు పంపారని ఏపీ సమాజం నమ్మేలా వ్యూహం పన్నుతోంది. మోదీ, అమిత్ సాలు సహకారంతోనే జగన్ ఇంతటి చర్యకు దిగగలిగారని ప్రచారంతో ఊదరగొడుతుంది.
15 రోజులుగా నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. కేంద్ర పెద్దలను కలుసుకునేందుకు అపాయింట్మెంట్లు కోరుతున్నారు. కానీ ప్రయత్నాలు ఏవి వర్కౌట్ కావడం లేదు. బిజెపిలో ఉన్న ప్రో టిడిపి నేతలు, అస్మదీయ రఘురామకృష్ణంరాజు.. ఇలా ఎంతోమంది హేమహేమీలు ప్రయత్నిస్తున్న కేంద్ర పెద్దలు కనికరించడం లేదు. కనీసం చంద్రబాబు అరెస్టుపై ఆరా తీయడం లేదు. మొన్నటికి మొన్న తెలంగాణ ప్రభుత్వం తప్పుడు కేసులతో వైయస్ షర్మిలను అరెస్టు చేసిన విషయంలో ప్రధాని ఆరా తీసినట్లు ప్రచారం జరిగింది. కానీ చంద్రబాబు అరెస్ట్ ఐ నెల రోజులు కావస్తున్నా కనీసం పలకరించిన పాపాన పోలేదు. కనీసం చంద్రబాబు కుమారుడు లోకేష్ గోడు వినేందుకు కూడా కేంద్ర పెద్దలు ఇష్టపడడం లేదు. అదే సమయంలో జగన్ ఢిల్లీ పర్యటనకు వెళుతుండడం.. ప్రధాని మోదీ, అమిత్ సాలను కలవనుండడం టిడిపి నేతలకు మింగుడు పడడం లేదు. అంతకంటే మించి చంద్రబాబు అరెస్టు విషయంలో మున్ముందు పరిణామాలు తలుచుకుని నిద్ర పట్టడం లేదు.