
తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ మధ్య మరోమారు జల వివాదాలు చోటుచేసుకోనున్నాయి. ఇన్నాళ్లు మిత్రులుగా మెలిగిన కేసీఆర్ జగన్ ఉన్నట్లుండి శత్రువులుగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయని ఇరు పార్టీల వర్గాలు భావిస్తున్నాయి. దీనికి కారణం జగన్ చెల్లెలు షర్మిల అని చెబుతున్నారు. ఆమె ఎంత చెప్పినా వినకుండా తెలంగాణలో పార్టీ పెట్టి కేసీఆర్ పైనే విరుచుకు పడుతుండడంతో కేసీఆర్ వ్యూహాత్మకంగా షర్మిలను కట్టడి చేసే క్రమంలో జగన్ పై కయ్యానికి కాలు దువ్వుతున్నట్లు సమాచారం.
ఉమ్మడి రాష్ర్టంలో కృష్ణానదిపై దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించిన పోతిరెడ్డిపాటు హెడ్ రెగ్యులేటరీ ప్రాజెక్టు అంశాన్ని కేసీఆర్ తనకు అనుకూలంగా మార్చుకోనున్నట్లు తెలుస్తోంది. కృష్ణానదికి సంభవించే వరదల సమయంలో అదనపు జలాలను పోతిరెడ్డిపాడు నుంచే రాయలసీమ జిల్లాలకు తరలించడానికి జగన్ సర్కారు నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం మరోసారి రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది.
రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై మొదట్లో పెద్దగా పట్టించుకోని కేసీఆర్ ఇఫ్పుడు దాన్ని ప్రస్తావనకు తీసుకోవడానికి షర్మిల ఓ కారణంగా భావిస్తున్నారు జులై 8వ తేదీన తన తండ్రివైఎస్సార్ జయంతి సందర్భంగా వైఎస్సార్ టీపీ ప్రకటించడానికి సిద్ధమవుతున్న షర్మిలకు చెక్ పెట్టడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెరమీదకు తీసుకురానున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంపై షర్మిల తన వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో ఆలస్యంగానైనా కేసీఆర్ తన వైఖరి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆయన వైఎస్ జగన్ ను మూర్ఖుడిలా అభివర్ణించినట్లు వార్తలొచ్చాయి. ఘాటుగా స్పందించడం ద్వారా ఏపీతో తెలంగాణ ప్రభుత్వం ఘర్షణ వైఖరి తెరమీదకు తీసుకున్నట్లయింది. దీంతో జల వివాదాలపై మొదటి నుంచి తెలంగాణ మెతక వైఖరినే ప్రదర్శిస్తున్నట్లు తెలిసిందే. ఇక అమీతుమీ తేల్చుకోవడానికే సిద్ధమైనట్లు సమాచారం.