KCR- National Politics: వినేవాడు ఎర్రిపప్ప అయితే.. చెప్పేవాడు ఎన్నైనా చెప్తాడు.. ప్రతీ మనిషికి వేపకాయంత వెర్రి ఉన్నట్లుగా.. పాలకులకు ఎన్నో సెంటిమెంట్లు ఉంటాయి. ఫలానా పని చేస్తే మంచి జరుగుతుందని, ఫలానా పని చేస్తే చెడు జరుగుతుందని కొందరు భావిస్తుంటారు. ఎప్పుడూ విజయాలు రావాలనే కోరుకుంటారు కాబట్టి అందుకు తగ్గట్లుగానే సెంటిమెంట్లను ఫాలో అవుతారు. ఇందుకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మినహాయింపు కాదు. వీరిద్దరికీ ఉన్న కామన్ సెంటిమెంటు దేవుడిపై అపారమైన నమ్మకం. తమ రాజకీయ విజయాల కోసం ఒకవైపు ప్రజల మీద ఆధారపడతారు. పథకాలు అమలు చేస్తారు. వ్యూహాలు పన్నుతారు. అదనంగా దేవుడిని నమ్ముకుంటారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్న సీఎం జగన్ తాను నమ్ముకున్నది ఆ దేవుడిని. ఆ తరువాత ప్రజలను. ఇద్దరు సీఎంలకు మొదటి ప్రాధాన్యం దేవుడు. రెండో ప్రాధాన్యం ప్రజలు.

2019 నుంచి ఆధ్యాత్మికత వైపు..
ఏపీ సీఎం జగన్ 2019 నుంచి ఆధ్మాత్మికతవైపు మళ్లారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగా విశాఖ శారదా పీఠంపై సీఎం జగన్‌కు నమ్మకం ఎక్కువ. అక్కడ నిర్వహించే రాజశ్యామల యాగంలో పాల్గొంటున్నారు. ఆ యాగంతో తిరిగి సీఎంగా అధికారం ఖాయమని నమ్ముతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఈ యాగం ఒక సెంటిమెంట్. ప్రతీ ముఖ్యమైన కార్యక్రమం సమయంలో ఈ యాగం చేస్తారు. కేసీఆర్ చేసిన సూచనల మేరకే సీఎం జగన్ ఏటా ఈ యాగంలో పాల్గొంటున్నారు. సీఎం జగన్ మతపరంగా క్రిస్టియన్. ఒక పక్క క్రీస్తును నమ్ముతూనే మరో పక్క అత్యధికంగా హిందూ ఓటర్లు ఉన్నారు కాబట్టి వారి మాతాచారాలను కూడా పాటిస్తుంటారు. అందులో భాగమే యాగాలు చేయడం.. విశాఖ శారదాపీఠంలో వార్షికోత్సవాలు ప్రతీ ఏటా ప్రత్యేక పూజలు చేస్తున్నారు.. వార్షికోత్సవాల వేళ చివరి రోజున రాజశ్యామల యాగం చేయటం ఆనవాయితీ. 2023లో కూడా పీఠం వార్షికోత్సవాలు ఉన్నాయి. జనవరి 27 నుంచి 31 వరకూ అయిదు రోజుల పాటు జరిగే వార్షికోత్సవాలలో భాగంగా మరోసారి రాజశ్యామల యాగం చేయనున్నారు.
వేడుకలకు ఆహ్వానం..
వార్షికోత్సవాలకు సంబంధించి శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతిస్వామి ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్‌ను తాడేపల్లిలోని ఆయన క్యాంప్ ఆఫీసులో కలిశారు. వారిషకోత్సవ వేడుకల ఆహ్వాన పత్రం అందచేశారు. జగన్ తొలి నుంచి శారదా పీఠం స్వామజీ స్వరూపానందేంద్ర స్వామీజీ అంటే నమ్మకం. 2019 ఎన్నికల సమయంలోనూ పార్టీ ఎంపీ ఒకరు నెల్లూరు కేంద్రంగా రాజశ్యామల యాగం నిర్వహించారు. విచిత్రంగా 2019 ఎన్నికల్లో జగన్ విజయం సాధించారు. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఏటా విశాఖ శారదా పీఠంలో జరిగే కార్యక్రమాలకు హాజరు అవుతున్నారు.
తెలంగాన సీఎంకు ఆనవాయితీ..
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజశ్యామల యాగం.. దాని ఫలాలపై మంచి పట్టు ఉంది. దీంతో ఏ ముఖ్యమైన కార్యక్రమం చేపట్టినా.. ఈ యాగం కేసీఆర్ కచ్చితంగా నిర్వహిస్తారు. కేసీఆర్ వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చినా రాజశ్యామల యాగం నిర్వహణ కొనసాగిస్తున్నారు. తాజాగా.. బీఆర్‌ఎస్ ప్రకటించిన కేసీఆర్.. ఢిల్లీ కేంద్రంగా ఈ యాగం నిర్వహణతోనే పార్టీ కార్యాలయం ప్రారంభించారు. సీఎం జగన్ – సీఎం కేసీఆర్ సన్నిహిత సంబంధాలు కొనసాగిన రోజుల్లో ఇద్దరూ స్వరూపానందేంద్ర అమరావతిలో నిర్వహించిన యాగంలో పాల్గొన్నారు. అదే విధంగా విశాఖకు వచ్చి సీఎం కేసీఆర్ స్వామి స్వరూపానంద నిర్వహించిన యాగంలో పాల్గొన్నారు.

వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం..
ఇక, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తిరిగి గెలుపు కోసం వ్యూహాలు సిద్దం చేస్తున్న జగన.. ఇటు ఆధ్యాత్మికంగానూ రాజశ్యామల యాగంలో పాల్గొంటున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ఉప ఎన్నికలు. .స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జగన్ ఏకపక్ష విజయం సాధించారు. దీంతో సీఎంతోపాటుగా మంత్రులు.. పార్టీ ప్రముఖులు తరచూ శారదా పీఠం సందర్శిస్తున్నారు. ఈసారి జరిగే వేడుకల్లోనూ సీఎం పాల్గొంటారాని తెలుస్తోంది. దీని ద్వారా 2024లోనూ జగన్‌కు అటు అమ్మవారి ఆశీస్సులు.. ఇటు ప్రజల మద్దతుతో గెలుపు ఖాయమని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే అనేకసార్లు యాగాలు చేసిన కేసీఆర్.. గత ఎన్నికలకు ముందు రాజ శ్యామల యాగం చేసి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో విజేతగా నిలిచారు. ఎన్నికల విజయం తరువాత సహస్ర చండీయాగం చేశారు. ఇప్పుడు బీఆర్‌ఎస్ జాతీయ రాజకీయాల్లో అడుగుపెడుతున్న సందర్భంగా మళ్లీ రాజశ్యామల యాగం చేశారు. కేసీఆర్ యాగం చేసిన ప్రతిసారీ అందుకు ప్రతిఫలం పొందారని.. ఈ సారికూడా రాజశ్యామల యాగం ద్వారా జాతీయ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తారని పార్టీ వర్గాల విశ్వాసం.
నాడు ధర్మరాజు.. నేడు ముఖ్యమంత్రులు..
మహాభారతంలో ధర్మరాజుతో శ్రీకృష్ణుడు చేయించిన రాజసూయ యాగం, ప్రస్తుతం కేసీఆర్ అండ్ జగన్ చేస్తున్న రాజశ్యామల యాగం ఒకటేనా అంటే…ఈ రెండు యాగాలు ఒకటే కాకపోయినా వాటి వెనకున్న ఆంతర్యం, పరమార్థం మాత్రం ఒకటే. ప్రారంభించిన కార్యంలో విజయం అందుకోవాలి, శత్రువులు క్షీణించాలి, సార్వ భౌమాధికారం సిద్ధించాలి, రాజ్యలక్ష్మి శాశ్వతంగా ఉండాలని చేస్తారు. రాజసూయ యాగం చేయడం చాలా పెద్ద క్రతువు అది నిర్వహించడం అంత సుసాధ్యం కాదు అందుకే అందుకు ప్రతిగా రాజశ్యామల యాగం ద్వారా విజయం సిద్ధించేలా చేయేమని శ్యామలా దేవిని ప్రసన్నం చేసుకుంటారు. యాగాలు చేయడం కేవలం సెంటిమెంటా? లేదా దానివల్ల నిజంగా అనుకూల ఫలితాలు వస్తాయా? మరి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎందుకు.. ఎన్నికల్లో వారెందుకు ఓటు వేయాలి అంటే సమాధానం చెప్పలేం. ఎవరి నమ్మకాలు వారివి మరి!!