KCR- Early Elections: ఆడవారి మాటలకు అర్థాలే వేరు అనేది నానుడి.. ఇప్పుడు రాజకీయ నేతల మాటలకు అర్థాలే వేరేగా ఉంటున్నాయి. అవునంటే కాదని.. కాదంటే ఔనని.. ఒక్కోసారి ఔనంటే.. అవుననే అర్థం చేసుకోవాల్సి వస్తోంది. నాయకులు తీసుకునే నిర్ణయాల ఆధారంగా వారి మాటల్లో అర్థం మారిపోతోంది. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వేస్తున్న అడుగులు.. తీసుకుంటున్న నిర్ణయాలను డీకోడ్ చేస్తే.. కచ్చితంగా ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నారని అనిపిస్తుంది.

అభివృద్ధి కళ్లకు కనిపించేలా ప్లాన్..
రాష్ట్రంలో వివిధకాల కింద చేపట్టిన పనులు ఇన్నాళ్లూ ప్రపారంభించి వదిలేసిన కేసీఆర్ వాటిని వచ్చే మార్చిలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి అంతా ప్రజల కళ్ల ముందు కనిపించేలా ఉండాలని అంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు, సొంత జాగాలో నివాసాలు, ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయ ప్రారంభం, దళితబంధు లాంటి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. వచ్చే ఏడాది మార్చిలోగా రోడ్లు అద్దంలా మెరవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కొత్త సచివాలయ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకోవడంతో సంక్రాంతికి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమరుల స్మారకాన్నీ అదే రోజు ప్రారంభిస్తారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని కూడా ఎన్టీఆర్ ఘాట్ పక్కనే వచ్చే నెలలో ఆవిష్కరించబోతున్నారు. మెట్రో విస్తరణకు శంకుస్థాపన చేయబోతున్నారు.
త్వరలో నోటిఫికేషన్లతో సందడి..
కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన 80 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించచి ఇప్పుడు వేగం పుంజుకుంది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు ఇచ్చారు. పరీక్షలు నడుస్తున్నాయి. తాజాగా మరో తొమ్మిది వేల ఉద్యోగాలతో గ్రూప్ 4 నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతునన్నారు. మరో 9,500 గురుకుల పోస్టులు భర్తీ చేయబోతున్నానరు.. ఈమేరు కసరత్తు మొదలైంది. దీంతో నిరుద్యోగులంతా బిజీగా ఉన్నారు. మార్చి వరకూ నియామకాల జోరు కొనసాగే అవకాశం ఉంది.
వరుసగా జిల్లాల టూర్..
ఇన్నాళ్లూ ప్రగతిభవన్, ఫాంహౌస్‌కు పరిమితమైన కేసీఆర్ డిసెంబర్ మొదటి వారం నుంచి జిల్లాల పర్యటనకు ప్లాన్ చేసుకున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలు కూడా జరుగుతాయి. డిసెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, బడ్జెట్‌పై కేంద్రం విధిస్తున్న ఆంక్షలను అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని ఇప్పటికే నిర్ణయించారు. మరోవైపు జిల్లాల పర్యటన ద్వారా కేంద్రం కక్షపూరిత వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.

ఆత్మీయ సమావేశాలు..
ఇదే సమయంలో పార్టీలో విభేధాలు ఉంటే.. పరిష్కరించుకోవడానికి ఆత్మీయ సమావేశాలు పెట్టుకోవాలని కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. మండలాల వారీగా పార్టీ కేడర్‌తో ఆత్మీయ సమ్మేళనాల కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వంద మంది ఓటర్లకు ఒకరు చొప్పున ఇన్‌చార్జీల కోసం జాబితాల రూపకల్పనపై దృష్టి పెట్టారు. ఇవన్నీ వచ్చే ఏడడాది మార్చిలోపు పూర్తయ్యేలా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.
కర్ణాటకతో ‘ముందుకు’..?
ఎలా చూసినా కేసీఆర్ మార్చి నాటికి ఎన్నికలకు రెడీ అయిపోతారని తెలుస్తోంది. బడ్జెట్ పెట్టిన తర్వాత ఆయన అసెంబ్లీని రద్దు చేయవచ్చని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఇదే జరిగితే వచ్చే ఏడాది మేలో కర్ణాటకతోపాటే తెలంగాణలోనూ ఎన్నికలు జరపాల్సి ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారు. ఈమేరుకు కేసీఆర్ తాజాగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ తగ్గించారని తెలుస్తోంది.