KCR On AP: గంగను చూస్తే గౌరికి మంట గౌరిని చూస్తే గంగతో తంట ..ఎట్టా చెప్పయ్య బ్రహ్మయ్య… ఇద్దరు భార్యల మధ్య నలిగిపోతూ ’ఏవండీ ఆవిడ వచ్చింది’ సినిమాలో శోభన్ బాబు పాడే పాట ఇది. ఇప్పుడు ఏపీలో రాజకీయాలు మొదలుపెట్టాలనుకుంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇటువంటి సిట్యువేషనే ఎదురైంది. విభజన తరువాత ఏపీ ఎన్నో కష్టాలను ఎదుర్కొంటోంది. రాజధాని లేని రాష్ట్రంగా నడి వీధిలో ఏపీ నిలబడింది. పైగా ఆర్థిక కష్ట నష్టాలతో ఇబ్బంది పడుతోంది. వీటన్నింటికీ కేసీఆరే కారణమని ఇప్పటికీ ఏపీ ప్రజలు నమ్ముతున్నారు. ఇటువంటి తరుణంలో ఏపీలో రాజకీయాలు చేయాలనుకుంటున్న కేసీఆర్ ఏపీ ప్రజలను సంతృప్తి పరచాలి. వారి కష్ట నష్టాలను తీర్చాలి. అవసరమైన భరోసా ఇవ్వాలి. అప్పుడే ఏపీ ప్రజలు ఆయన్ను కొంతవరకైనా నమ్ముతారు. ఇన్నాళ్లూ తెలంగాణ సీఎంగా అడ్డుపడుతూ వస్తున్న విభజన సమస్యలకు తక్షణం పరిష్కార మార్గం చూపాలి. అయితే ఏపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నా తెలంగాణ ప్రజల కోపానికి గురయ్యే చాన్స్ ఉంది. తమలో విభజన వాదం నింపి.. ఇప్పుడు ఏపీ ప్రజలకు అండగా నిలవడం ఏమిటని వారు కచ్చితంగా ప్రశ్నించే అవకాశముంది.

ఇప్పటివరకూ కేసీఆర్ ప్రాంతీయ వాదంతో సవారీ చేశారు. ప్రజల మనోభావాలను గుర్తెరిగి.. వారిలో సెంటిమెంట్ ను రగిల్చి రాజకీయం చేశారు. ఇక అలాచేస్తామంటే కుదరదు. ప్రాంతీయ భావాలతో జాతీయ రాజకీయం చేస్తామంటే జనాలు హర్షించరు. ఆ పార్టీని ఆదరించరు. అందుకే కాబోలు కేసీఆర్ రైతు కాన్సెప్ట్ తో బీఆర్ఎస్ విస్తరణకు అడుగులు వేస్తున్నారు. వ్యవసాయ భూమి, నదుల అనుసంధానమంటూ గణాంకాలతో లెక్కలు చెబుతున్నారు. ఇండియన్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నారు. విధ్వేషాలు, విధ్వంసాలు, విభేదాలు, వివాదాలు లేని దేశం కోసం పాటుపడతానని చెబుతున్నారు. అయితే ఇవన్నీ ఆయన గురించి తెలియని రాష్ట్రాలు, ప్రజల వద్ద వర్కువుట్ అవుతాయో తెలియదు కానీ.. ఏపీలో మాత్రం ఆయన మాటలను ప్రజలు అంత తేలిగ్గా నమ్మే పరిస్థితి అయితే మాత్రం కనిపించడం లేదు. ఏపీ అనేది తెలంగాణ నుంచి వేరుపడిన రాష్ట్రంగా గుర్తించుకోవాల్సిన అవసరముంది. ఆ పరిస్థితికి తెచ్చింది కేసీఆర్ అన్న విషయం మరిచిపోకూడదు.
రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఏ దుర్గతి పట్టిందో అందరికీ తెలిసిందే. కేవలం కలిసి ఉన్న తమను విడగొట్టిందన్న అక్కసుతో ఏపీ ప్రజలు ఈ దేశాన్ని సుదీర్ఘ కాలం ఏలిన కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసేశారు. అటువంటిది నావల్లే రాష్ట్ర విభజన జరిగింది… నావల్లే తెలంగాణ వచ్చింది అని ప్రకటించుకునే కేసీఆర్ చర్యలను ఏపీ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మరిచిపోరు. విభజన ఇష్టపడని ఏపీ ప్రజలు.. ఆ విభజనతో ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యేయో తెలియని వారు కాదు. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితికి ముమ్మాటికీ కేసీఆరే కారణమని ఇప్పటికీ మెజార్టీ ప్రజలు భావిస్తున్నారు. కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలకు, బీఆర్ఎస్ ఆవిర్భావం నాడు ఫ్లెక్సీలు కట్టినంత ఈజీకాదు ఏపీలో పార్టీ విస్తరణ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏపీలో అడుగుపెట్టాలనుకుంటున్న కేసీఆర్ చాలా సవాళ్లు ఎదురవుతాయి. వాటన్నింటిని అధిగమించి.. ఏపీ ప్రజలు సంతృప్తిపడేలా వ్యవహరిస్తేనే బీఆర్ఎస్ ఎత్తుగడ ఏపీలో వర్కవుట్ అయ్యేది. ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు పరిష్కారం కాలేదు. ఇంకా విభజన పంచాయితీలు నడుస్తూనే ఉన్నాయి. ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, విద్యుత్ వినియోగం.. ఇలా చాలా అంశాలు పెండింగ్ లోనే ఉన్నాయి. ఈ సమస్యలు ఉండగానే ఏపీలో రాజకీయాలకు కేసీఆర్ సై అంటున్నారు. ఇటువంటి తరుణంలో ఫెయిల్యూర్ నేతలకు పార్టీని అప్పగించి శరవేగంగా విస్తరించాలన్న కేసీఆర్ ఆకాంక్ష ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు అధికమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విభజన పంచాయితీలు తేల్చాకే ఏపీలో అడుగుపెట్టాలన్న డిమాండ్ తెరపైకి వచ్చే అవకాశముంది. అందుకే కేసీఆర్ ఏపీ పై దండయాత్ర ఏమంత ఈజీ కాదు.