Chandrababu- KCR: ఇన్నాళ్లకు కేసీఆర్ చంద్రబాబుకి కాస్తా చాన్సిచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశించడానికి కాస్తా వెసులబాటు కల్పించారు. నాడు మంత్రి పదవి ఇవ్వకుండా చేసి .. తన ఈ స్థాయి రాజకీయ ఉన్నతికి ఇంటర్నల్ గా చంద్రబాబే కారణమని తెలిసినా కేసీఆర్ మాత్రం క్షమించలేదు. అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబును డీ గ్రేడ్ చేస్తూ వచ్చారు. చివరాఖరుకు తెలంగాణ నుంచి బలవంతంగా ఏపీకి పంపించారు. ఏపీలో చంద్రబాబు ప్రత్యర్థి జగన్ తో చేతులు కలిపి కోలుకోలేని దెబ్బతీశారు.తెలంగాణలో చంద్రబాబు అడుగుపెట్టిన ప్రతిసారి సమైఖ్య వాదిగా చిత్రీకరించారు. తెలంగాణ ద్రోహిగా తెలంగాణ సమాజంలో చూపించడంలో సక్సెస్ అయ్యారు. తెలంగాణలో టీడీపీ అవశేషాలు ఉన్నా.. చివరకు విడిచిపెట్టాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఇన్నాళ్లకు కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా విస్తరించడంతో చంద్రబాబుకు రిలీఫ్ దొరికింది. కేసీఆర్ తనపై ప్రాంతీయ వాదం ఆపదించే చాన్స్ లేకపోవడంతో చంద్రబాబు తెలంగాణ వ్యాప్తంగా స్వేచ్ఛంగా తిరిగేందుకు మార్గం దొరికింది.

ఏపీలో కేసీఆర్ బీఆర్ఎస్ ఎంట్రీ ఖాయంగా తేలింది. వచ్చే ఎన్నికల్లో పోటీకి కూడా కేసీఆర్ సిద్ధపడుతున్నారు. ఇప్పటికే విజయవాడలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు వెలిశాయి. కార్యాలయం ఏర్పాట్ల పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో బీఆర్ఎస్ పనులను మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కు కేసీఆర్ అప్పగించారు. ఆయనతో టీడీపీలో కలిసి పనిచేసిన వారితో పాటు బంధు గణం కూడా ఎక్కువే. టీడీపీకి చెందిన మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడు, టీటీడీ మాజీ చైర్మన్ సుధాకర్ యాదవ్ తో బంధుత్వం ఉంది. కానీ వారు బీఆర్ఎస్ వైపు వచ్చే చాన్స్ లేదు. కానీ రాజకీయం చేయడానికి బంధు గణం ద్వారా పావులు కదిపే అవకాశం ఉంది. సంక్రాంతి తరువాత ఏపీలో ఒక బహిరంగసభకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. దీని బాధ్యతలను కూడా తలసానికే కేసీఆర్ అప్పగించారు. ప్రస్తుతం ఆయన చిన్నాచితకా నాయకులతో చర్చలు జరుపుతున్నారు. బీఆర్ఎస్ గూటికి తెప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏపీలో బీఆర్ఎస్ కార్యకలాపాలు ఎంతలా సాగితే.. అంతలా తెలంగాణలో చంద్రబాబు చొచ్చుకెళ్లే చాన్స్ ఉంది. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా 2014లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 15 స్థానాల్లో గెలుపొందింది. అటు తరువాత కేసీఆర్ టీడీపీని కబళించడం స్టార్ట్ చేశారు. 2018లో టీడీపీ కాంగ్రెస్ తో మహా కూటమి ఏర్పాటుచేసి రెండు స్థానాలకే పరిమితమైంది. అయితే విభజన తరువాత చంద్రబాబుకు చాన్సివ్వకుండా కేసీఆర్ సెంటిమెంట్ ను రగిల్చి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు సెంటిమెంట్ ను విడిచిపెట్టి జాతీయ బాట పట్టడంతో చంద్రబాబుకు లైన్ క్లీయర్ ఇచ్చినట్టయ్యింది. అందుకే చంద్రబాబు టీడీపీకి బలమున్న ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ లో పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే కాసాని కాసాని జ్ఞానేశ్వర్ కు టీ టీడీపీ పీఠం కట్టబెట్టారు. పార్టీలో ఓ వెలుగు వెలిగిన ఫేడ్ అవుట్ అయినా చాలామంది నాయకులను టీడీపీలో చేర్చేందుకు వర్కవుట్ చేస్తున్నారు. తెలంగాణలో సెలెక్టివ్ ప్రాంతాల్లో కనీసం 30 నియోజకవర్గాల్లో పార్టీని నిలబెడితే పొత్తులు, ఇతరత్రా అంశాల ద్వారా తెలంగాణలో పార్టీ పూర్వ వైభవం సాధించవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు.

అయితే ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ ఏమంతా ఈజీ కాదు. తెలంగాణలో టీడీపీకి బలమైన ఫౌండేషన్ ఉంది. ఆ స్థాయిలో ఏపీలో బీఆర్ఎస్ కు నాయకులు దొరుకుతారంటే డౌటే. పైగా ఏపీ ప్రజలను, నాయకులను గతంలో కేసీఆర్ తిట్టిన సందర్భాలున్నాయి. శాపనార్థాలు పెట్టిన విషయాన్ని ప్రజలు మరిచిపోలేకపోతున్నారు. అయినా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ప్రజలు ఊహించనివి..ఆశపడ్డ పథకాలు, సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తే టర్న్ అయ్యే అవకాశముంది. ఇటువంటి వాటిలో కేసీఆర్ ముందు వరుసలో ఉంటారు. ఏపీ ప్రజలను టర్న్ చేసుకోవడం కాస్తా ఆలస్యమైనా.. అనుకున్నది కేసీఆర్ సాధించుకోగలరని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.