New Year Celebrations 2023: కొత్త సంవత్సరం వస్తుందంటే ఎక్కడా లేని ఉత్సాహం వస్తుంది.. మరి ముఖ్యంగా డిసెంబర్ 31 అర్ధరాత్రి అది తారాస్థాయికి వెళ్తుంది. ఇక యువత గురించి చెప్పాల్సిన పనిలేదు.. వారు చేసే హంగామా అంతా ఇంతా కాదు.. సాధారణంగా 31 అర్ధరాత్రి మద్యం విక్రయాలు జోరుగా ఉంటాయి.. అది తాగిన వారి పరిస్థితి కూడా అలానే ఉంటుంది. ఇక ఆ మైకంలో ఏం చేస్తారో వారికే సోయి ఉండదు. ఇలాంటి వారి వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి.. ఫలితంగా కొత్త సంవత్సరం కాస్త విషాదంగా మారుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కొత్త సంవత్సరం వేడుకలు అంబరాన్ని అంటుతాయి.. పబ్ లు హోరెత్తుతాయి. క్లబ్బులు మారుమోగిపోతాయి. రిసార్టులు కిటకిట లాడతాయి. ఈ ఉత్సాహంలో మద్యం ఏరులై పారుతుంది. తాగినవాళ్లు వాళ్ల మా నాన వాళ్ళు ఉంటే పెద్దగా ఇబ్బంది లేదు. కానీ ఆ మైకంలో బయటికి వస్తేనే ఇబ్బందులన్నీ.

కేసులు పెరిగిపోతున్నాయి
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు 500 వరకు డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక డిసెంబర్ 31 అర్ధరాత్రి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.. గత ఏడాది పదివేల వరకు కేసులు నమోదయ్యాయి. ఇలాంటి స్థితిలో పోలీసులు అందరిని పరీక్షించడం పెద్ద సవాల్ గా మారుతున్నది.. మద్యం తాగిన వారిలో అధిక శాతం యువత ఉండడం ఆందోళన కలిగిస్తున్నది పోలీసు శాఖ అపరాధ రుసుం విధించినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. దీంతో ఈసారి పోలీస్ శాఖ వినూత్న విధానానికి తెరతీసింది.
ఒంటి గంటకు క్లోజ్ చేయాలి
డిసెంబర్ 31 అర్ధరాత్రి వేడుకలు తారా స్థాయికి వెళ్తాయి కాబట్టి… సమయంలో మద్యం తాగే వాళ్లను నియంత్రించడం పోలీసులకు కత్తి మీద సాము. కానీ ఈసారి డిసెంబర్ 31 అర్ధరాత్రి వేడుకలను ఒంటి గంట వరకే పూర్తిచేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఇది అందరికీ వర్తిస్తుందని వారు చెబుతున్నారు. దీనిపై భిన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.. తమ వ్యాపారం సాగేదే ఆ సమయంలో… పోలీసులు అప్పటికే వేడుకలు పూర్తి చేయాలి అంటే ఎలా అని పబ్ లు, క్లబ్ ల నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు.

కానీ ఇదే సమయంలో ప్రభుత్వం మద్యం షాపుల నిర్వహణను రాత్రి 12 గంటల దాకా పొడిగించడం గమనార్హం. కానీ దీనిపై మాత్రం పోలీస్ శాఖ నోరు మెదపడం లేదు.. అంటే ప్రభుత్వం అమ్ముతుంది… మేం పట్టుకుంటాం అనే తీరుగా వారి ధోరణి ఉంది. ఒంటి గంట తర్వాత ఎవరైనా రోడ్లమీద కనిపిస్తే, షాపులు తెరిచినట్టు కనిపిస్తే పోలీసులు ఊరుకోరు.. తాట తీస్తారు. కేసులు పెట్టి కోర్టుకు లాగుతారు. అందుకే తస్మాత్ జాగ్రత్త.