పాముకు చెలగాటం.. ఎలుకకు ప్రాణ సంకటంగా మారిందట తెలంగాణ సీఎం కేసీఆర్ పరిస్థితి. లాక్ డౌన్ దేశంలో మే 3 వరకు పొడిగిస్తే కేసీఆర్ మే 7వరకు సాగదీశారు. ఇప్పుడు 7 వచ్చేసింది. అందుకే తెలంగాణ కేబినెట్ భేటి జరుగుతోంది. ఈరోజు మళ్లీ పొడిగించడం ఖాయమే. కానీ దేశ ప్రధాని విధించిన మే 17వరకే ఖాయం చేస్తారా? లేక అందరూ అనుకుంటున్న జూన్ 1 వరకు పొడిగిస్తారా అన్నది ఉత్కంఠగా మారింది.
*పొరుగున మద్యం ప్రవాహం.. తెలంగాణకు సంకటం
తెలంగాణలో మద్యం అమ్మకాలకు కేసీఆర్ ఇంకా తెరతీయలేదు. కానీ కేంద్రం సడలింపులతో పక్క రాష్ట్రాలు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలు మద్యం షాపులు తెరిచేశాయి. అక్కడికి వెళ్లి మరీ మనోళ్లు క్యూలో నిలబడి మద్యం కొంటున్నారు. దీంతో తెలంగాణ జనాల జేబులకు గుల్ల పడుతోంది. ఇక్కడ మద్యం అమ్మకాలు లేకపోవడంతో తప్పనిసరై పొరుగుకు వెళ్లి కొనాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. అదే జరిగితే తెలంగాణలో లాక్ డౌన్ సహా మద్యం అమ్మకాలు బంద్ చేసినా పెద్దగా ప్రయోజనం లేదు. మన వాళ్లు సొమ్ము పక్కరాష్ట్రాలు క్యాష్ చేసుకుంటారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వానికి, ప్రజలకు ఆర్థికంగా ఇబ్బంది.
*కేసీఆర్ కరోనా కట్టడి ఎంతవరకు.?
తెలంగాణలో కరోనా కట్టడిలోకి వచ్చినా రెండు మూడు రోజులకొకసారి పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా టెస్టుల సంఖ్య తగ్గడం… పాతబస్తీలో సరిగా అమలు కాకపోవడం వల్ల కేసుల సంఖ్య కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ లో అనుకున్నంత స్థాయిలో లాక్ డౌన్ సమర్థంగా అమలు చేయడం లేదన్న అపవాదు ఉంది. ఇందులో మైనార్టీలు ఉండే పాతబస్తీలో లాక్ డౌన్ ఫెయిలవుతోందన్న ఆరోపణలున్నాయి..
వైన్ షాపులో ఉపాధ్యాయుల డ్యూటీపై పవన్ సీరియస్!
*గ్రీన్, ఆరెంజ్ లకు మినహాయింపులు ఇవ్వక తప్పని పరిస్థితి..
సీఎం కేసీఆర్ ఖచ్చితంగా ఈసారి కేంద్రాన్ని ఫాలోకాక తప్పని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆల్రెడీ పక్కరాష్ట్రాలు కేంద్రం మినహాయింపులు అమలు చేస్తున్నాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం అమ్మకాలు సహా మెజార్టీ పరిశ్రమలు, ఉద్యోగాలు, పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. దీంతో అక్కడ మినహాయింపులు ఉండి తెలంగాణలో ఆంక్షలు ఉంటే ఖచ్చితంగా జనాలు అవసరార్థం తరలిపోతారు. దీనివల్ల కరోనా వ్యాపించడం ఖాయం. అందుకే ఇక్కడ కూడా మినహాయింపులు ఇవ్వడానికి కేసీఆర్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
*కేరళ మోడల్ కేసీఆర్ ఫాలో కావాల్సిందేనా?
దేశంలోనే తొలి కరోనా కేసు కేరళలో నమోదైంది. కానీ ఇప్పుడు ఆ రాష్ట్రం పటిష్ట చర్యలతో కరోనా ఫ్రీ స్టేట్ గా మారడానికి అడుగులు వేస్తోంది. అక్కడ మరణాలు కేవలం 3శాతం కావడం గమనార్హం. ఇక అక్కడ ఆకలి చావులు లేకుండా ఆర్థికంగా భోజనానికి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వమే సామూహిక భోజనశాలలు ఏర్పాటు చేస్తోంది. ఎవరికైనా అక్కడి నుంచే సప్లై చేస్తున్నారు. కానీ తెలంగాణలో టెస్టుల విషయంలో ఆలస్యం చేస్తున్నారు. రోగ లక్షణాలు బయటపడ్డవారికే చేస్తున్నారు. ఇక చికిత్సలు పర్లేకున్నా వలస కూలీలు, పేదలకు నేరుగా సాయం చేయడంలో ప్రభుత్వం వెనుకబడింది. రేషన్ , 1500 ఇచ్చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది. ఇక కరోనా మరణాల రేటు ఎక్కువే. కేసీఆర్ ప్రతీ ప్రెస్ మీట్ లో కరోనా ఫ్రీ తెలంగాణ ఇప్పటిలోగా అవుతుందని చెబుతున్నా.. కేసులు పెరిగి పెద్దది అవుతోంది. మరి కరోనాపై ఈరోజు తీసుకునే నిర్ణయమే తెలంగాణ కరోనా భవిష్యతును నిర్ణయిస్తుంది. లాక్ డౌన్ విషయంలో కేసీఆర్ నిర్ణయమే తెలంగాణ దిశా దశను నిర్ణయిస్తుంది.
-నరేష్ ఎన్నం