CM KCR: సార్వత్రిక ఎన్నికలకు ఇంకో ఏడాది టైం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని టీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎవరి పీఠాలను వారు పదిలం చేసుకునేందుకు ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించారు. ఈ నెలలో ఐదురాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిని 2024 ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా బీజేపీ భావిస్తోంది. అయితే, తెలంగాణలో బీజేపీ పాగా వేయకుండా సీఎం కేసీఆర్ పకడ్భందీ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే కేంద్రం ఏ పథకం తీసుకొచ్చినా, ప్రణాళిక చేసినా దానిని కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈనెల 1వ తేది కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చెత్త పద్దుగా అభివర్ణిస్తూనే తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో ఎలాగైనా ముచ్చటగా మూడో సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ చూస్తున్నట్టు తెలిసింది. అందుకోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందంతో ఒప్పందం చేసుకున్నారని టాక్.
దేశంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రశాంత్ కిషోర్ పేరు బాగా వినిపిస్తుంది. ఆయనతో ప్రతిపక్ష, అధికార పార్టీ నేతలు ఒప్పందం చేసుకుని మరీ అధికారాన్ని దక్కించుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తున్నారు. పీకే ఇప్పటివరకు డీల్ చేసిన అన్ని ఎన్నికల్లో విజయం సాధించారు. గతంలో బీహార్, యూపీ ఎన్నికలు మినహా అన్నింటిలోనూ మంచి సక్సెస్ రేట్ ఉంది.
Also Read: రాజధాని విషయంలో జగన్ సైలెంట్.. అది భారీ స్కెచ్‌లో భాగమేనట..
ఈ మధ్యకాలంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్, 2019 ఎన్నికల్లో ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పీకే ఎన్నికల వ్యూహలే పనిచేశాయనడంలో అతిశయోక్తి లేదు. ఆయన రంగంలోకి దిగితే ఎదుటి వారు ఎటువంటి రాజకీయ పండితులైనా ఓటమిని చవిచూడాల్సిందే. తాజాగా ప్రశాంత్ కిశోర్‌తో టీఆర్ఎస్ పార్టీ ఒప్పందం చేసుకుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కుమారుడు కేటీఆర్ కూడా పీకేతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా పీకే బృందం సీఎం కేసీఆర్ కోసం ఓ రహస్య సర్వేను కూడా చేపట్టి ఆయనకు నివేదికను అందజేసిందట..
ఈ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రజల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకతను దూరం చేసేందుకు ఎటువంటి పథకాలు తీసుకురావాలి. ప్రజల అటెన్షన్ ను ఎలా మళ్లించాలనే అంశంపై టీఆర్ఎస్ సర్కార్ నిమగ్నమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ కాస్త పుంజుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్ల సాధించడమే కాదు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు గట్టిపోటీ ఇచ్చింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీని ఎదుర్కోవాలంటే పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్లాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని ఐప్యాక్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
Also Read: మేడారం వెళ్లే భక్తులకు తీపికబురు.. మీ ఇంటి ముందుకే ఆర్టీసీ బస్సు సర్వీస్!