ఏపీ, తెలంగాణా నీటి వివాదం మరింత ముదిరేలా కనిపిస్తుంది. వారం రోజులుగా రెండు రాష్ట్రల్లో ఈ అంశమే హాట్ టాపిక్ గా మారింది. పోతిరెడ్డిపాడుపై తెలంగాణా అనవసర రాద్ధాంతం చేస్తుందని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం తెలంగాణా దూకుడుకి కళ్లెం వేసేందుకు మరో మార్గంలో ముందుకు వెళ్ళింది.
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచేందుకు జారీ చేసిన 203 జీఓపై తెలంగాణా ప్రభుత్వం నానా యాగీ చేస్తోంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కు పిర్యాదు చేసింది. తెలంగాణా రాష్ట్రంలో ప్రతిపక్ష ఈ విషయంలో ఏపీ నిర్ణయాన్ని తప్పు పట్టాయి.
ఏపీ ప్రభుత్వం కృష్ణా నదిలో ఏపీకి రావాల్సిన 512 టీఎంసీలు తప్ప అధికంగా ఒక్క చుక్క నీరు తీసుకోమని సముద్రంలోకి పోయే మిగులు జలాలు మాత్రమే వినియోగించుకొనున్నట్లు ఇన్ని రోజులుగా చెప్పుకొచ్చింది. ఈ వాదనలను ఏ మాత్రం పట్టించుకోని తెలంగాణా ప్రభుత్వం పంచాయతీని కృష్ణా బోర్డులో పెట్టింది. బోర్డు కు తన వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్న ఏపీ సోమవారం స్పెషల్ సీఎస్ అదిత్యనాద్ దాస్ ను పంపి బోర్డు ముందు తన అభిప్రాయాలు, రాయలసీమ దుస్థితి వివరించింది. ఇదిలా ఉంటే మరోవైపు తెలంగాణ గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టులపై గోదావరి బోర్డుకు పిర్యాదు చేసింది. తెలంగాణాకు చెక్ పెట్టాలంటే ఇదే సరైన నిర్ణయంగా భావించిన జగన్ వెంటనే గోదావరి నదిపై కాళేశ్వరం, తుపాకుల గూడెం, సీత రామ ప్రాజెక్టులతో పాటు చిన్నాచితకా ఇతర ప్రాజెక్టులతో తెలంగాణా ప్రభుత్వం గోదావరి జలాలను 450 టి.ఎం.సీల వరకూ అదనంగా వాడుకుంటుందని పూర్తి వివరాలతో గోదావరి బోర్డు వద్ద మరో పంచాయతీ పెట్టారు.
దీంతో కేసీఆర్ ఆత్మరక్షణలో పడ్డారు. మీడియా సమావేశంలో ఆయన ఈ విషయంపై సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కేసీఆర్ కు అన్ని తెలుసు, ఏక్కడెక్కడ ఎంత వాటాలు రావాలో తెలుసు అంటూ ముక్త సరిగా సమాధానం చెప్పారు. అయితే గత ఏడాది స్వయంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి వెళ్లి మీట నొక్కిన జగన్ ఇప్పుడు ఆ ప్రాజెక్టుపై ఫిర్యాదు చేయడం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఊహించనిదిగా భావిస్తున్నారు.