మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను ఎదుర్కోవడానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఆ బాధ్యతలను మంత్రి గంగుల కమలాకర్ కు అప్పగించారు. దీంతో గంగుల రోజు హుజురాబాద్ ప్రాంత నేతలతో మాట్లాడుతున్నారు. పార్టీకి విధేయులుగా ఉండాలని సూచిస్తున్నారు. మరో పక్క ఈటల రాజేందర్ సైతం తన ప్రభావాన్ని చూపిస్తున్నారు. ఎవరు కూడా పార్టీకి సహకరించవద్దని చెబుతున్నారు. దీంతో రాజకీయ దుమారమే రేగుతోంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందోననే అనుమానాలు అందరిలో వ్యక్తం అవుతున్నాయి.
ప్రజాప్రతినిధులే లక్ష్యంగా..
హుజురాబాద్ ప్రాంత ప్రజాప్రతినిధులే లక్ష్యంగా పార్టీ ముందుకు కదులుతోంది. జెడ్పీటీసీలు, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచులను ఎంచుకుని మాట్లాడుతున్నారు. ఈటల వైపు వెళ్లకుండా ఉండాలని సూచిస్తున్నారు. దీంతో చాలా మందికి నోటీసులు సైతం వెళ్లాయి. మాట వినకుంటే బెదిరింపులకు సైతం దిగుతున్నారు. భవిష్యత్తులో కష్టాలు ఎదుర్కొంటారని భయపెడుతున్నారు. ఈటల కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. అధికార పార్టీ నాయకులతో ఏమీ కాదని నేనున్నానని భరోసా ఇస్తున్నారు. భయం అక్కర లేదని అభయం ఇస్తున్నారు. చాలా మంది నేతలు ఈటలతో నడవడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు.
మున్సిపాలిటీపై ప్రత్యేక దృష్టి
జమ్మికుంట మున్సిపాలిటీపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నాయకులను తమ దారికి తీసుకురావడానికి మంత్రికి కష్టంగానే మారింది. చెప్పిన మాట అందరూ వినడం లేదు. దీంతో బెదిరింపులకు పాల్పడినా లొంగడం లేదు. ఈటల ఇరవై ఏళ్లుగా రాజకీయం చేయడంతో ఆయన వెంటే వెళ్లడానికి నాయకులు సంసిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటలనే పైచేయి సాధించే అవకాశాలు ఉన్నాయి. దీంతో టీఆర్ఎస్ పార్టీ ఆలోచనలో పడినట్లు తెలిసింది. ఎలాగైనా ఈటల రాజేందర్ ను ఎదుర్కోవాలనే అంశంపై ప్రధాన దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది.
అధికార పార్టీకి సవాలే
ఈటల రాజేందర్ ను నిలువరించాలంటే టీఆర్ఎస్ పార్టీకిపెద్ద సవాలే అని చెప్పాలి. సుదీర్ఘ కాలంగా రాజకీయం చేస్తున్న ఈటల తన ప్రాంతంపై ఆధిపత్యం కలిగి ఉన్నారు. ఎలాగైనా రాజేందర్ ను ఎన్నికల్లో గెలవకుండా చేసేందుకే పావులు కదుపుతున్నట్లు సమాచారం. దీంతో కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో రాజేందర్ దూకుడుకు కళ్లెం వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.