
హుజురాబాద్ ఉప ఎన్నికపై పార్టీలు దృష్టి సారించాయి. విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ పావులు కదుపుతున్నాయి. తెలంగాణ సీఎం దీన్ని ప్రత్యేకంగా తీసుకుని ప్రణాళికలు రచిస్తున్నారు. ఎలాగైనా పరువు నిలబెట్టుకోవాలని పాకులాడుతున్నారు. హుజురాబాద్ నియోజకవర్గానికి వందల కోట్ల పనులు మంజూరు చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
హుజురాబాద్ పట్టణాభివృద్ధికి రూ.35 కోట్లు కేటాయించారు. తాగునీటి కోసం రూ.10 కోట్లు అందజేశారు. వార్డుల్లో అభివృద్ధికోసం రూ.25 కోట్లు మంజూరు చేస్తూ జీవో ఇచ్చారు. ఉప ఎన్నిక ముగిసే వరకు వీటి గురించి ప్రచారం ముమ్మరం చేయనున్నారు.తరువాత అమలవుతాయో లేదో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అభివృద్ధి పనుల కోసం స్వయంగా తానే వచ్చి కుర్చీ వేసుకుని కూర్చుని పనులు చేయిస్తానని సీఎం చెప్పడంతో దీనిపై ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుస్తోంది.
మంత్రి గంగుల కమలాకర్ హుజురాబాద్ లోనే ఉంటానని ప్రకటించారు. నలభై ఐదు రోజల్లో పనులన్ని పూర్తి చేస్తామని సవాల్ చేశారు. దీనికి ప్రత్యేక అధికారులను నియమిస్తామని చెప్పారు. ఉప ఎన్నిక ముగిసే వరకు హుజురాబాద్ లో ప్రభుత్వ యంత్రాంగం పని చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ ఆరు నెలల్లో అక్కడ ఎంత అభివృద్ధి పనులు జరిగితే అంత జరిగినట్లు తరువాత మాత్రం పట్టించుకునేవారు ఉండరని చర్చ జరుగుతోంది. ప్రభుత్వ హడావిడితో ఈటలపై ప్రజల్లో మరింత సానుభూతి పెరిగే అవకాశం ఉందన్న వాదన ఇప్పటికే ప్రారంభమైంది.
హుజురాబాద్ ఉప ఎన్నికపై ఎలాంటి నిర్లక్ష్యం ఉండకుండా చూసుకోవాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో నాయకులు ప్రత్యేకంగా తీసుకున్నారు. అక్కడే తిష్టవేసి పనులు పర్యవేక్షిస్తున్నారు. అధినేత నిర్ణయాన్ని తూచ తప్పకుండా పాటిస్తూ ప్రజల్లో పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్నారు. విజయం సాధించే వరకు విశ్రమించేది లేదని చెబుతున్నారు.